త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Traffic Police Special Drive | హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఆ తప్పులు చేస్తే భారీ ఫైన్ తప్పదు!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది! టీజీఆర్‌టీసీ బస్టాండ్ల వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలపై కొరడా. 1860 కేసులు నమోదు.

J

Hyderabad | Published On Jul 11, 2026, 11.55 pm IST

Hyderabad Traffic Police Special Drive | హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఆ తప్పులు చేస్తే భారీ ఫైన్ తప్పదు!
Advertisement
  • టీజీఆర్‌టీసీ బస్టాండ్ల వద్ద ప్రైవేట్ వాహనాల అక్రమ పార్కింగ్, ఓవర్ లోడింగ్‌పై హైదరాబాద్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
  • జూలై 6వ తేదీ నుంచి చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఆటోలు, జీపులు తదితర వాహనాలపై 1860 కేసులు నమోదు
  • ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ జామ్‌ల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు 'జీరో టాలరెన్స్' విధానం అమలు
  • వాహనదారులు మోటారు వాహనాల చట్టాన్ని కచ్చితంగా పాటించాలని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ విజ్ఞప్తి 

Hyderabad Traffic Police Special Drive | త్రినేత్ర.న్యూస్ : నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సురక్షితమైన జర్నీని అందించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) నడుంబిగించారు. టీజీఆర్‌టీసీ (TGRTC) అధికారుల సమన్వయంతో, బస్టాండ్ల వద్ద ఇష్టానుసారంగా వాహనాలు ఆపి ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్న ప్రైవేట్ వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జూలై 6, 2026 నుంచి నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ (Special Enforcement Drive) ప్రారంభించి పెద్ద ఎత్తున చలాన్లు విధిస్తున్నారు.

కొరడా ఝుళిపించిన పోలీసులు.. 1860 కేసులు

బస్టాండ్ల వద్ద ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా అనధికారికంగా పార్కింగ్ చేస్తున్న ఆటోలు, టాటా మ్యాజిక్, జీపులు, తూఫాన్ వాహనాలు, మ్యాక్సీ క్యాబ్‌లపై మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act) కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటివరకు మొత్తం 1860 కేసులు నమోదయ్యాయి.

పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

బస్ బేలలో (Bus Bays) పార్కింగ్ చేసినందుకు: 520 కేసులు

మితిమీరిన ప్రయాణికులతో (Overloading) వెళ్తున్నందుకు: 504 కేసులు

బస్ స్టాప్ సమీపంలో పార్కింగ్/వెయిటింగ్: 342 కేసులు

పత్రాలు లేకుండా (DL, RC, ఇన్సూరెన్స్, పొల్యూషన్) డ్రైవింగ్: 342 కేసులు

గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల తరలింపు: 141 కేసులు

సరైన పర్మిట్లు లేకుండా రవాణా: 11 కేసులు

జీరో టాలరెన్స్.. నిబంధనలు మీరితే యాక్షనే

బస్ స్టాప్‌ల వద్ద ప్రైవేట్ వాహనాలు ఆపడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలగడమే కాకుండా, నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు (Traffic jams) అవుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఉల్లంఘనలు ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తున్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం పూర్తి కఠిన వైఖరిని (Zero-Tolerance Policy) అవలంబిస్తోంది.

నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్ నగరంలో సురక్షితమైన, ఇబ్బందులు లేని రవాణాను పెంపొందించడానికి ఇటువంటి ప్రత్యేక తనిఖీలు క్రమం తప్పకుండా కొనసాగుతాయని ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డెవిస్ (IPS) స్పష్టం చేశారు. ప్రైవేట్ రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తీరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement