త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thiruparankundram | తిరుపరంకుండ్రం కొండపై ఉద్రిక్తత.. దీపస్తంభం వద్ద వెలగని జ్యోతి

Thiruparankundram | తమిళనాడు మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం అంశం తీవ్ర ఉద్రిక‌త్త‌ల‌కు దారి తీసింది. రాతి స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ.. మంగళవారం సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచిపిళ్లయార్‌ మండపంలోనే జ్యోతిని వెలిగించారు.

P

Devotional | Published On Nov 24, 2026, 7.51 pm IST

Thiruparankundram | తిరుపరంకుండ్రం కొండపై ఉద్రిక్తత.. దీపస్తంభం వద్ద వెలగని జ్యోతి
Advertisement
  • సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.. సంప్రదాయ మండపంలోనే వెలిగిన కార్తీక దీపం
  • బీజేపీ నేతల నిర్బంధం.. 5,600 మందితో భారీ పోలీసు బందోబస్తు

Thiruparankundram | తమిళనాడు మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం అంశం తీవ్ర ఉద్రిక‌త్త‌ల‌కు దారి తీసింది. రాతి స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ.. మంగళవారం సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచిపిళ్లయార్‌ మండపంలోనే జ్యోతిని వెలిగించారు. వివాదాస్పద దీపథూన్‌ వద్ద దీపం వెలిగించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడం, మరోవైపు మద్రాస్‌ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

అసలేంటీ వివాదం?

తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపథూన్‌ అనే రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు, భ‌క్తులు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ స్తంభం హజ్రత్‌ సుల్తాన్ సికిందర్‌ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ దీపం వెలిగించే సంప్రదాయం గతంలో లేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో వివాదం కోర్టుల వరకు వెళ్లింది. నవంబర్‌ 20న దీపథూన్‌ వద్ద నవంబర్‌ 24న దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు ఒకసారి మాత్రమే వెలిగించేందుకు అనుమ‌తి ఇస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. మత సామరస్యం, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. అయినా సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లోనే ఉన్నాయి.

ఆదేశాలు అమలు చేయాల్సిందే: హైకోర్టు

దీపం వెలిగించే కార్య‌క్ర‌మానికి కొద్ది గంట‌ల ముందు మ‌దురై బెంచ్ ఆఫ్‌ మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఆలయ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌, జస్టిస్‌ ఎండీ సుమతి ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా మదురై కలెక్టర్‌ నిషాంత్‌ కృష్ణ, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఏజీ ఇనిగో తివ్యన్‌ కోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందనే కారణంతో వాటిని అమలు చేయకుండా ఉండలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. 'రివ్యూ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండడం ఆదేశాల అమలుకు ఆటంకం కాదు' అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 144ను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. అదే సమయంలో జిల్లా యంత్రాంగం విధించిన ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 హక్కును ఉల్లంఘించకూడదని పేర్కొంది.

బీజేపీ నేతల నిర్బంధం.. భారీ బందోబస్తు

వివాదం నేపథ్యంలో తిరుపరంకుండ్రం కొండ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 5,600 మందికి పైగా పోలీసులను మోహరించారు. మదురైకి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు బీజేపీ నేతలు, హిందూ సంఘాల నాయకులను వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. తిరునల్వేలిలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ను మదురై బయలుదేరే సమయంలో గృహ నిర్బంధంలో ఉంచారు. శివగంగలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ హిందూ మున్నాని నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ పలువురు హిందూ సంస్థల కార్యకర్తలను నిర్బంధించారు. కొండ, ఆలయ మెట్లు, గిరివలం మార్గం, పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. దక్షిణ జిల్లాలకు చెందిన 12 మంది ఎస్పీలు, ఎనిమిది మంది అదనపు ఎస్పీలు, 132 మంది ఇన్‌స్పెక్టర్లు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. దీపథూన్‌ స్తంభం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను కాపలాగా ఉంచారు. దీపం వెలిగించేందుకు అవసరమైన సంప్రదాయ రాగి పాత్ర, వత్తులు, నెయ్యిని సైతం భారీ పోలీసు భద్రత మధ్య కొండపైకి తరలించారు.

సెక్షన్‌ 163 కింద ఆంక్షలు

నవంబర్‌ 23 రాత్రి 9 గంటల నుంచి నవంబర్‌ 25 ఉదయం 10 గంటల వరకు బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద మదురై కలెక్టర్‌ నిషాంత్‌ కృష్ణ నిషేధాజ్ఞలు విధించారు. బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, అనుమతి లేకుండా కొండపైకి వెళ్లడాన్ని నిషేధించారు. అయితే సంప్రదాయ పూజలు, ఆలయ నిత్యకైంకర్యాలు, దర్గాకు చట్టబద్ధంగా వెళ్లడం, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చేపట్టే చర్యలకు మినహాయింపు ఇచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా తిరుపరంకుండ్రం కొండ, పరిసర ప్రాంతాలను నవంబర్‌ 23, 24 తేదీల్లో తాత్కాలిక డ్రోన్‌ రెడ్‌ జోన్‌గా మదురై నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్ రాజేంద్రన్‌ ప్రకటించారు. కొండ శిఖరం, గిరివలం మార్గం, ప్రవేశ ద్వారం నుంచి 16 స్తంభాల మండపం వరకు, కొండ దిగువ ప్రాంతాల్లో అనుమతి లేకుండా డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలను నడపరాదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో 70కి పైగా అదనపు సీసీ కెమెరాలు, ఫేస్ రిక‌గ్నైజేష‌న్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సాయుధ పోలీసులను కూడా మోహరించారు. కలెక్టర్‌ నిషాంత్‌ కృష్ణ ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

కొనసాగుతున్న న్యాయ, రాజకీయ వివాదం

సుప్రీంకోర్టు ఆదేశాలు, మద్రాస్‌ హైకోర్టు జోక్యం, రాష్ట్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌.. ఇలా వరుస పరిణామాల మధ్య కార్తీక దీపం కార్యక్రమం ముగిసింది. అయితే సుప్రీంకోర్టు అనుమతించిన దీపథూన్‌ వద్ద కాకుండా సంప్రదాయ ఉచిపిళ్లయార్‌ మండపంలోనే దీపం వెలిగించడంతో ఆదేశాల అమలు అంశంపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటన తమిళనాడులో రాజకీయంగా, న్యాయపరంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement