త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఒక్క బిల్డర్ కోసం 4 వేల కుటుంబాలను రోడ్డున పడేస్తరా?

Harish Rao | రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి(Narsingi)లో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌మెంట్‌(Road Alignment)ను వంక‌రటింక‌ర‌గా మార్చార‌ని.. ఒక్క బిల్డ‌ర్ కోసం నాలుగు వేల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 31, 2026, 4.30 pm IST

Harish Rao | ఒక్క బిల్డర్ కోసం 4 వేల కుటుంబాలను రోడ్డున పడేస్తరా?
Advertisement
  • నార్సింగిలో 100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్‌ను వంకరటింకరగా మార్చారు
  • సీఎం బిడ్డ నిర్మించే స్కూల్ కోసం చేయ‌డం దుర్మార్గం
  • అర్ధరాత్రి ఫోన్ చేసినా ప‌దే ప‌ది నిమిషాల్లో వ‌స్తం
  • ఏ ఒక్క బిల్డింగ్‌పై చెయ్యి పడినా ఊకోం
  • 2026 నాటి అక్రమ గెజిట్‌ను తక్షణమే రద్దు చేయాల్సిందే
  • ఈ రెడ్ మార్కులు తుడిచేసే దాకా కొట్లాడుతం
  • మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి(Narsingi)లో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌మెంట్‌(Road Alignment)ను వంక‌రటింక‌ర‌గా మార్చార‌ని.. ఒక్క బిల్డ‌ర్ కోసం నాలుగు వేల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. సీఎం బిడ్డ నిర్మించే స్కూల్ కోసం ఇంత దారుణానికి ఒడిగ‌ట్ట‌డం ఏంట‌న్నారు. ఏ ఒక్క బిల్డింగ్‌పై చెయ్యి ప‌డినా ఊరుకునేది లేద‌న్నారు. 2026 నాటి అక్ర‌మ గెజిట్‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. హెచ్ఎండీఏ అధికారులు వేసిన రెడ్ మార్కులు తుడిచేసేదాకా కొట్లాడ‌తామ‌న్నారు. సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్ తదితర కాలనీలను శ‌నివారం ఆయ‌న‌ కాలినడకన పరిశీలించారు. బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. బాధితులు ఫోన్ చేస్తే ప‌దే ప‌ది నిమిషాల్లో వ‌స్తామ‌న్నారు.

ఇక్కడ తమ ఆవేదనను వ్యక్తం చేసిన అజయ్ కుమార్, సోదరీమణులు శోభ, శ్వేత, పద్మజ, రిటైర్డ్ జిల్లా జడ్జి విజయ్ కుమార్, ప్రసన్నత, డాక్టర్ నందగోపాల్‌, అలెగ్జాండర్ రెడ్డి, అనిల్ కుమార్, వివిధ అపార్ట్‌మెంట్ల అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు, నష్టపోతున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మాటలు వింటుంటే ప్రభుత్వం ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకానీ ఒక బిల్డర్ కోసమో, ఒక కాంట్రాక్టర్ కోసమో, కొందరు వ్యక్తుల స్వార్థం కోసమో పనిచేయొద్దు.

వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఈ 100 ఫీట్ల రోడ్డు కోసం మాస్టర్ ప్లాన్‌లో మార్కౌట్ ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన గెజిట్‌లో ఇక్కడి గుట్టను తొలగిస్తూ, గుట్ట మీద ఉన్న 400 ఏళ్ల చారిత్రక హనుమాన్ టెంపుల్‌ను కూల్చేస్తూ ఆ 100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్ ఉండేది. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ హనుమాన్ ఆలయాన్ని కాపాడాలని స్థానికులు సబితక్క దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సబితా ఇంద్రారెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి, ఆ 100 ఫీట్ల రోడ్డును యథావిధిగా కొనసాగిస్తూనే.. ఆలయం దగ్గర మాత్రం గుడిని కాపాడుతూ పక్కనే ఉన్న ఓపెన్ ల్యాండ్ నుంచి మెయిన్ రోడ్డుకు కలిపేలా 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గెజిట్ (జీవో నం. 181) ఇచ్చింది.

అలైన్‌మెంట్ ఎందుకు మార్చామంటే..

ఆ రోజు మేం అలైన్‌మెంట్ ఎందుకు మార్చామంటే.. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రజల కోరిక మేరకు ఒక చారిత్రక దేవాలయాన్ని కాపాడుతూ, ఏ ఒక్క అపార్ట్‌మెంట్‌కు గానీ, ఏ ఒక్కరి ఇంటికి గానీ ఇంచు కూడా నష్టం కలగకుండా 2018లో కేసీఆర్ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. మరి ఈరోజు 2026లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త గెజిట్ వెనుక ఏముంది? ఇందులో ఏమైనా ప్రజాప్రయోజనం ఉందా? ఇందులో అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనే లేదు, కేవలం ‘ప్రైవేట్ ఇంట్రెస్ట్’ మాత్రమే ఉంది. ఒక బిల్డర్ ప్రయోజనమే ఈ ప్రభుత్వ ప్రయోజనంగా మారింది.

ఒక్క‌ బిల్డర్‌ను సంతోషపెట్టడం కోసం ఇవాళ 2 వేల అపార్ట్‌మెంట్లలో ఉండే 4 వేల కుటుంబాలు, 5 వేల మంది ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు. దసరా పండుగ ముందు వీళ్ల ఇండ్లకు రెడ్ మార్కులు వేసి, గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో తెలియక నిద్రలేని రాత్రులు గడిపేలా చేశారు. ఈ ప్రాంతంలో ఆర్ఆర్ రియాల్టీ అనే బిల్డర్ తమను ఎలా వేధించాడో, ఆయన భూదాహానికి తాము ఎలా ఇబ్బంది పడ్డామో ఇక్కడ ఇల్లు కట్టుకున్న అలెగ్జాండర్ రెడ్డి, కాలనీ వాసులు కన్నీళ్లతో చెప్తున్నారు.

రాధా రియల్టర్ ఎక్క‌డ ఉంటాడంటే..

ఈ రాధా రియల్టర్ ఎక్కడ ఉంటాడో మా తమ్ముడు కార్తీక్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు.. అతను సాక్షాత్తూ ‘బిగ్ బ్రదర్’ ఆఫీసులోనే కూర్చుంటాడు, అక్కడ అతనికి ఒక ప్రత్యేక ఛాంబర్ పెట్టారు. ఆ అండ చూసుకునే వాడికి ఇంత ధైర్యం వచ్చింది. లేకపోతే రాత్రికి రాత్రే జీవోలు, గెజిట్‌లు మారుతాయా? జనవరి 7వ తేదీన ఒక జీవో వస్తుంది, తెల్లారేసరికి జనవరి 8వ తేదీన మళ్లీ మార్పులతో ఇంకో గెజిట్ వస్తుంది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, పెద్ద స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టే రాత్రికి రాత్రే జీవోలు మారిపోయి, ఇండ్లపై రెడ్ మార్కింగ్‌లు పడుతున్నాయి.

ఇక్కడి వెస్ట్రన్ మిడోస్ ప్రతినిధి డాక్టర్ నందగోపాల్ చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఇదంతా జరుగుతున్నది ఒకవైపు ముఖ్యమంత్రి కూతురు స్కూల్ కోసం అంటే ‘బిగ్ బ్రదర్స్’ కుటుంబానికి చెందిన కార్పొరేట్ స్కూల్ కోసం. ఇంకోవైపు బిగ్ బ్రదర్స్ భాగస్వామి, అత్యంత సన్నిహితుడైన ఆర్ఆర్ రియాల్టీ హై-రైజ్ భవనాల కోసమే. హనుమాన్ టెంపుల్‌ను తప్పిస్తూ 2018లో వేసిన పాత నోటిఫైడ్ రోడ్డులో రాధా రియల్టర్స్ వెంచర్ ఎఫెక్ట్ అవుతుందని దాన్ని మార్పించాడు. కొత్తగా వేలంలో కొనుక్కున్న భూమికి, అతని ఇతర భూములకు హై-రైజ్ పర్మిషన్ రావాలంటే ముందు 100 ఫీట్ల రోడ్డు ఉండాలి. కాబట్టి ఆ రోడ్డును రౌండ్‌గా తిప్పి ఇక్కడున్న 10 అపార్ట్‌మెంట్లను కూల్చడానికి సిద్ధమయ్యారు.

అంటే వాళ్ల ఒక్క అపార్ట్‌మెంట్ కట్టుకోవడానికి ప్రజల ఇన్ని అపార్ట్‌మెంట్లు కూల్చాలా? వాళ్ల స్కూల్ కోసం ప్రసన్నత ఎంతో ప్యాషన్‌తో, కష్టపడి కట్టుకున్న స్కూల్‌ను కూల్చేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇందులో జరిగిన భూ వేలం కుంభకోణం చూస్తే వీళ్ల దోపిడీ ఎంత బరితెగింపుగా ఉందో అర్థమవుతుంది. సాధారణంగా ప్రభుత్వం ఎప్పుడైనా భూమిని వేలం వేస్తే.. ముందు అక్కడ 100 ఫీట్ల రోడ్డు వేసి, ఆ భూమి 100 ఫీట్ల రోడ్డు మీద ఉందని పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి వేలం వేస్తుంది. అప్పుడు ఆ భూమికి ఎక్కువ ధర పలికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

గ‌జం 47 వేలకే వేలం..

కానీ వీళ్లు ఏం చేశారు? కోకాపేట, నార్సింగి ప్రాంతంలో ఇవాళ గజం ధర రూ. 2 లక్షలకు తక్కువ లేదు. కానీ ఈ ప్రభుత్వ భూమికి 60 ఫీట్ల రోడ్డే ఉంది, హై-రైజ్ పర్మిషన్ రాదు అన్నట్లుగా చూపించి, 100 ఫీట్ల రోడ్డు విషయం దాచిపెట్టి.. సైలెంట్‌గా గజం కేవలం రూ. 47 వేలకే వేలం వేసేశారు. దాదాపు రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 26 కోట్లకే తమ బిల్డర్‌కు కట్టబెట్టారు. తీరా వాడు అగ్గువకు భూమి కొన్నాక.. ఇప్పుడు ఆ భూమికి 100 ఫీట్ల రోడ్డు వేయడం కోసం మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తామంటున్నారు.

ఒకవైపు HYDRAA అని పెట్టి పేదవాళ్ల గుడిసెలన్నీ కూల్చి వాళ్లను రోడ్డు మీదకు తెచ్చారు. ఇంకోవైపు హైదరాబాద్ చుట్టూ భూములను ‘22-A’ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ల పేరు మీద మధ్య తరగతి ప్రజల అపార్ట్‌మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా అయినా, 22-A అయినా, 100 ఫీట్ల రోడ్లయినా.. ఇవేవీ ప్రజలకు పనికొచ్చే పనులు కావు. కేవలం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్ల భూదాహం, ధనదాహం తీర్చడానికి చేస్తున్న అరాచకాలే..

చట్ట ప్రకారం కొత్త గెజిట్ ఇవ్వాలన్నా, మాస్టర్ ప్లాన్ మార్చాలన్నా.. ముందు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడాలి, పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ ఏ ఒక్కటీ చేయలేదు. కనీసం బాధితులు వెళ్లి తమ గోడు చెప్పుకుందామంటే అధికారులు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. వినతిపత్రం ఇస్తామంటే.. ఇందులో చాలా పెద్దవాళ్లు ఉన్నారు లేండి, మేం మాట్లాడలేం, మీరు ఏమీ అనుకోకండి, మేం కాగితం కూడా తీసుకోలేం అని అధికారులు అంటున్నారంటే రాష్ట్రంలో అసలు చట్టం ఉందా?

ర‌క్ష‌కుడే భ‌క్ష‌కుడిగా మారాడు..

బాధితుల కాగితం తీసుకోవడానికి కూడా అధికారులు భయపడుతున్నారంటే.. దీని వెనుక ముఖ్యమంత్రి కుటుంబం, ‘బిగ్ బ్రదర్స్’ ఉన్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాష్ట్రాన్ని పాలించే రక్షకుడే ఇవాళ భక్షకుడిగా మారిపోయాడు. ఇక్కడి సెవెన్ హిల్స్ వారు ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఇవాళ రేపు ఇంట్లో నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండటమే కష్టమైన రోజుల్లో.. ఏ బిల్డర్ లేకుండా 1,553 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక తాటిపైకి వచ్చి, ఒకే కుటుంబంలా కలిసి నిర్మించుకుని 13-17 ఏళ్లుగా ఆనందంగా జీవిస్తున్నారు.

అలాంటి సెవెన్ హిల్స్ అపార్ట్‌మెంట్‌కు ఒకవైపు 10 మీటర్లు, ఇంకోవైపు 7 మీటర్ల లోపలికి రెడ్ మార్కులు వేశారు. దీనివల్ల సెల్లార్‌లోకి వెళ్లే అండర్‌పాస్, గుడి, వాకింగ్ ట్రాక్, సెల్లార్ పార్కింగ్ పోతుంది. పిల్లర్లు దెబ్బతిని అసలు బిల్డింగ్ స్ట్రెంత్, అపార్ట్‌మెంట్ లైఫే పోయే ప్రమాదం ఏర్పడింది. సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్, అలెగ్జాండర్ రెడ్డి లాంటి వ్యక్తిగత ఇండ్లు, పాఠశాలలు.. ఇలా దాదాపు 10 అపార్ట్‌మెంట్లు ఈ అక్రమ అలైన్‌మెంట్ వల్ల దెబ్బతింటున్నాయి. పక్కనే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉండే పేద అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు కూడా ఇక్కడికి వచ్చి తమ బాధ చెప్పుకున్నారు.

గతంలో వాళ్లు కేవలం 100 మీటర్లలో మెయిన్ రోడ్డు మీదకు వచ్చేలా దారి ఉండేది. కానీ ఈ బిల్డర్ రాత్రికి రాత్రే రేకులు పెట్టి వాళ్ల దారిని మూసేశాడు, డ్రైనేజీ మార్చేశాడు, ఉన్న రోడ్డును తవ్వేశాడు. పాపం ఆ పేదవాళ్లు ఇప్పుడు కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ఇదేంటని అడిగితే పోలీసులను పెట్టి భయపెడుతున్నారు. నాడు కేసీఆర్ పేదల దగ్గర ఆరు పైసలు కూడా తీసుకోకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి గృహ ప్రవేశాలు చేయించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి పేదలకు ఇల్లు ఇవ్వాలంటే రూ. 5 లక్షలు, 6 లక్షలు కట్టాలంటున్నాడు. ఆటోలు, రిక్షాలు నడుపుకునేవాళ్లు, ఇండ్లలో పనిచేసుకునే పేదవాళ్లు రూ. 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు?

మీ దారి తెరిపిస్తం

పైగా కేసీఆర్ ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లే దారిని కూడా మూసేస్తారా? డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు ఎవరూ అధైర్యపడొద్దు. సబితా మేడమ్, మేమంతా మళ్లీ మీ కాలనీకి వస్తాం, మీ దారిని తెరిపిస్తాం. నాడు కోకాపేట, నార్సింగి ప్రాంతంలో మంచినీళ్ల సమస్య ఉంటే.. కేసీఆర్ ప్రభుత్వం పైప్‌లైన్లు వేసి, మీ వాటర్ ట్యాంకర్ల బిల్లులు తగ్గించి పుష్కలంగా తాగునీళ్లు ఇచ్చింది. పవర్ కట్స్ లేకుండా, ఇన్వర్టర్లు, జనరేటర్లతో పని లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చింది. కాంగ్రెస్ రాగానే మళ్లీ వాటర్ ట్యాంకర్ల దందా మొదలైంది, ఇంకో నాలుగు రోజులు పోతే మళ్లీ కరెంటు కోతలు, ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

కాలనీ వాసులందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నాను. మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గత దీపావళి అప్పుడు పక్కనే ఉన్న హైదర్‌షాకోట్‌లో మూసీ సుందరీకరణ పేరుతో 40-50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదల ఇండ్లకు ఇలాగే రెడ్ మార్కులు ఇచ్చి దీపావళి గిఫ్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. వాళ్లంతా తెలంగాణ భవన్‌కు వస్తే, మేమందరం హైదర్‌షాకోట్‌కు వెళ్లి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించాం. బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన రేవంత్ రెడ్డి.. అక్కడ ఇండ్లు, అపార్ట్‌మెంట్లు కూల్చబోమని ప్లాన్ మార్చుకున్నాడు.

హైద‌ర్‌షాకోట్‌లో ఎట్ల‌యిందో అట్ల‌నే..

హైదర్‌షాకోట్‌లో రెడ్ మార్కులు ఎలాగైతే పోయాయో.. నార్సింగిలో కూడా ఈ రెడ్ మార్కులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దాకా కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంట‌ది. ఇక్కడి కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, రిటైర్డ్ జడ్జితో కూర్చుని చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ రూపొందిస్తాం. అవసరమైతే నేను, సబితక్క, దాసోజు శ్రావణ్, సుధీర్ రెడ్డి, మా నగర ఎమ్మెల్యేలమంతా మీతో పాటు హెచ్ఎండీఏ ఆఫీసుకు వస్తాం. అధికారులను నిలదీస్తాం. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో.. ఏ వేదిక మీదనైనా సరే ఈ 2026 నాటి అక్రమ గెజిట్ రద్దయ్యేదాకా పోరాడుతాం.

ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పాలసీతో రకరకాల ప్రలోభాలకు, భయాలకు గురిచేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరంతా ఐక్యంగా ఉండాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ ఒకే హక్కు ఉంటుంది.. ప్రభుత్వానికి గానీ, రాధా రియల్టర్‌కు గానీ కొమ్ములేమీ లేవు. ఇదేదో శాశ్వత ప్రభుత్వం కాదు, ఇంకో ఏడాది, ఏడాదిన్నర పోతే మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీకు అర్ధరాత్రి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి.. నా ఇల్లయినా, కేటీఆర్ ఇల్లయినా, సబితక్క ఇల్లయినా మీ అపార్ట్‌మెంట్ నుంచి కేవలం 10 నిమిషాల దూరమే. పది నిమిషాల్లో మీ ముందుంటాం, మా కార్తీక్ రెడ్డి 24 గంటలూ మీకు అందుబాటులో ఉంటాడు.

ఇష్యూ పెద్దది కాకముందే ప్రభుత్వం తక్షణమే ఈ 2026 గెజిట్‌ను నిలిపివేయాలి. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం హనుమాన్ ఆలయాన్ని కాపాడుతూ ఇచ్చిన పాత గెజిట్ ప్రకారమే 100 ఫీట్ల రోడ్డును వేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి, మాజీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Harish RaoHMDAHYDRAANarsingiRangareddyRevanth ReddyRoad AlignmentTelangana
Advertisement

తాజావార్తలు

Advertisement