త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather | హైద‌రాబాద్‌లో మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు.. జ్వ‌రం, ద‌గ్గుతో జ‌నం బాధ‌లు

Weather | వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారిపోవ‌డంతో.. సీజ‌నల్ వ్యాధులు కూడా మ‌ళ్లీ ప్ర‌బ‌లుతున్నాయి. మ‌రి ముఖ్యంగా జ్వ‌రం, ద‌గ్గుతో భాగ్య‌న‌గ‌ర వాసులు బాధ‌ప‌డుతున్నారు.

S

Hyderabad | Published On Feb 10, 2026, 7.30 am IST

Weather | హైద‌రాబాద్‌లో మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు.. జ్వ‌రం, ద‌గ్గుతో జ‌నం బాధ‌లు
Advertisement

Weather | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త కొద్ది రోజుల నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప‌గలంతా ఉక్క‌పోత‌.. రాత్రంతా చ‌లితో న‌గ‌ర జ‌నం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి చ‌లికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభ‌మ‌వుతున్న త‌రుణంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారిపోవ‌డంతో.. సీజ‌నల్ వ్యాధులు కూడా మ‌ళ్లీ ప్ర‌బ‌లుతున్నాయి. మ‌రి ముఖ్యంగా జ్వ‌రం, ద‌గ్గుతో భాగ్య‌న‌గ‌ర వాసులు బాధ‌ప‌డుతున్నారు.

ఉన్న‌ట్టుండి ఒకేసారి వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు వ్యాప్తి చెంద‌డంతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల వ‌ద్ద రోగుల తాకిడి ఎక్కువైంది. న‌ల్ల‌కుంట‌లోని ఫీవ‌ర్ ఆస్ప‌త్రి వ‌ద్ద తెల్ల‌వారేస‌రికి రోగులు బారులు తీరుతున్నారు. ఈ హాస్పిట‌ల్‌లో రోజూ 500 మందికి పైగా ఓపీలో చూపించుకుంటున్నారు. గ‌తంతో పోలిస్తే 10 శాతం ఓపీ పెరిగిన‌ట్లు డాక్ట‌ర్లు పేర్కొన్నారు.

చాలా మందిలో గొంతు నొప్పి స‌మ‌స్య త‌లెత్త‌డం, క‌ఫంతో కూడిన ద‌గ్గు, చ‌లి జ్వ‌రం, తలనొప్పి, నీర‌సం లాంటి ల‌క్ష‌ణాలో బాధ‌ప‌డుతున్నారు. చిన్నారులు సైతం ఈ ల‌క్ష‌ణాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా ఇన్‌ప్లుయెంజా-ఏ, బీ, రెస్పిరేటరీ సిన్సిటియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ), హెచ్‌3ఎన్‌2, రైనోవైరస్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తొలుత ముక్కు, గొంతు, శ్వాసనాళాలు తర్వాత ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా వైద్యుల‌ను సంప్ర‌దించి.. చికిత్స తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

మ‌రి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..?

  • వాతావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
  • ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాలి.
  • రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి.
  • జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
  • గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుంటే మంచిది.
  • బ‌య‌టి నుంచి ఇంటికి చేరుకున్న వెంట‌నే చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి.
Advertisement
Advertisement