త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | హైద‌రాబాదీల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. రాత్రిపూట న‌డ‌వ‌నున్న బ‌స్సులు

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ హైద‌రాబాదీల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. న‌గ‌రంలో రాత్రివేళ‌ల్లోనూ ప్ర‌యాణీల‌కు సేవ‌లు అందించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 29 నుంచి న‌గ‌రంలో ఆరు ప్రధాన రూట్ల‌లో రాత్రంతా సిటీ బస్సులను న‌డిపించ‌బోతున్న‌ది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండ‌నున్నాయి.

P

Hyderabad | Published On Aug 25, 2026, 2.12 pm IST

TGSRTC | హైద‌రాబాదీల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. రాత్రిపూట న‌డ‌వ‌నున్న బ‌స్సులు
Advertisement
  • తొలుత ఆరుమార్గాల్లో న‌డిపించేందుకు నిర్ణ‌యం
  • ఈ నెల 29 నుంచి నైట్ స‌ర్వీసులు షురూ
  • ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను బ‌ట్టి విస్త‌రించేందుకు ప్లాన్‌

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ హైద‌రాబాదీల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. న‌గ‌రంలో రాత్రివేళ‌ల్లోనూ ప్ర‌యాణీల‌కు సేవ‌లు అందించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 29 నుంచి న‌గ‌రంలో ఆరు ప్రధాన రూట్ల‌లో రాత్రంతా సిటీ బస్సులను న‌డిపించ‌బోతున్న‌ది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఐటీ ఉద్యోగులు, రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు, అర్ధరాత్రి తర్వాత ఇళ్లకు చేరుకునే ప్రయాణికులకు బ‌స్ సేవ‌లు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నున్నాయి. రాత్రి, తెల్ల‌వారుజాము వేళ‌ల్లోఆయా మార్గాల్లో ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను పరిశీలించిన అనంతరం టీజీఎస్‌ఆర్టీసీ ఆరు మార్గాలను తొలిదశలో ఎంపిక చేసింది.

అర‌గంట‌.. గంట‌కో బ‌స్సు..

ప్రయాణికుల నుంచి ల‌భించే రెస్పాన్స్‌ను బ‌ట్టి 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులను నడపనుంది. ప్రతి మార్గంలో సుమారు ఎనిమిది బస్సులను అందుబాటులో ఉంచనున్న‌ది. రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేయ‌నున్న‌ది. నగరంలో రాత్రి స‌మ‌యంలో కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికార‌యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులతోపాటు హోటళ్లు, హాస్పిటాలిటీ, వాణిజ్య సంస్థల్లో పనిచేసేవారు, రాత్రివేళ షాపింగ్‌ చేసే వారితో పాటు నైట్ టూరిజం సైతం ప్ర‌స్తుతం విస్త‌రిస్తోంది. రాత్రి వేళల్లో సాధారణ ప్రజారవాణా సదుపాయాలు పరిమితంగా ఉండ‌డంతో ఆర్టీసీ ప్రారంభించ‌నున్న సేవ‌లు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నున్నాయి.

ఆరు మార్గాల్లో సేవలు

టీజీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ ఏ శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో రాత్రివేళ ప్రయాణికుల రాకపోకలు, డిమాండ్‌ను అధ్యయనం చేసిన తర్వాత తొలిదశలో ఆరు మార్గాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల స్పందనను నిరంతరం పరిశీలించి అవసరాన్ని బట్టి తదుపరి మార్గాలకు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్‌-హైటెక్ సిటీ, సికింద్రాబాద్‌-హ‌య‌త్‌న‌గ‌ర్‌, కోఠి-హైటెక్ సిటీ, కోఠి-ప‌ఠాన్‌చెరు, సికింద్రాబాద్‌-ప‌ఠాన్‌చెరు-బాచుప‌ల్లి రూట్ల‌లో బ‌స్సులు న‌డుస్తాయ‌ని తెలిపారు.

10హెచ్ రూట్‌లో ఇలా..

సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌ సిటీ, కొండాపూర్‌ మీదుగా నడిచే ఈ రూట్ నైట్ సర్వీసుల్లో కీలకంగా మారనుంది. ఐటీ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు అధికంగా ఉండ‌డం ఈ మార్గంలో రోజంతా రద్దీ ఉంటుంది. పగటిపూట 15 నుంచి 30 నిమిషాలకో బస్సు ఉండగా.. రాత్రివేళ 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో సర్వీసులు నడపనున్నారు. ఈ మార్గంలో సుమారు 8 నుంచి 10 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

రైలు ప్రయాణికులకు ఊరట

290యూ మార్గం రూట్‌లో సికింద్రాబాద్‌–హయత్‌నగర్‌ మధ్య నడిచే ఈ సర్వీసును రాత్రిపూట ప్ర‌యాణించే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేశారు. సికింద్రాబాద్‌లో సాధారణంగా సంగీత్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి బయలుదేరే బస్సును రాత్రివేళ ఆల్ఫా హోటల్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఇది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉండడంతో అర్ధరాత్రి రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, ఎన్జీవోస్‌ కాలనీ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది.

కోఠి–పటాన్‌చెరు.. హైటెక్ సిటీ రూట్‌లో..

218 రూట్‌లో కోఠి–పటాన్‌చెరు మధ్య నడిచే ఈ మార్గం నగరంలోని రద్దీ రూట్ల‌లో ఒకటి. ఉద‌యం నుంచి 5 నుంచి 10 నిమిషాలకో బస్సు నడిచినా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రాత్రివేళ మాత్రం సుమారు గంటకో సర్వీసు నడపనున్నారు. 222ఏ రూట్‌లో కోఠి–హైటెక్‌ సిటీ మీదుగా పటాన్‌చెరు మధ్య నడిచే ఈ మార్గంలోనూ రాత్రి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులు న‌డువ‌నున్నాయి. అలాగే, 219 రూట్‌ని సికింద్రాబాద్‌–పటాన్‌చెరు మధ్య రాత్రి సర్వీసుల జాబితాలో చేర్చారు. 195డబ్ల్యూ రూట్‌ని బాచుపల్లి, పరిసర ప్రాంతాలను కలుపుతూ నడిచే ఈ సర్వీసు ఐటీ ఉద్యోగులతోపాటు రాత్రివేళ పనిచేసే ప‌లు సంస్థల సిబ్బందికి ఉపయోగపడనుంది. హౌస్‌కీపింగ్‌, హోటల్స్‌, ఇతర వాణిజ్య సంస్థల్లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు అందుబాటులో ఉండ‌నున్నాయి.

ఆద‌ర‌ణ బ‌ట్టి మ‌రిన్ని రూట్ల‌లో..

ఆరు మార్గాల్లో రాత్రి సర్వీసులు ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల రద్దీని టీజీఎస్‌ఆర్టీసీ పర్యవేక్షించనుంది. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా హైదరాబాద్‌లోని మరిన్ని ప్రాంతాలకు రాత్రి బస్సులను విస్తరించే అవకాశం ఉంది. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, సందర్శకుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను కలిపే మార్గాలనూ భవిష్యత్తులో పరిగణనలోకి తీసుకునే తీసుకొని కొత్త రూట్ల‌లో బ‌స్సులు న‌డిపేందుకు అవ‌కాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement