H-FAST | బట్టలకు వేసే రంగులతో మసాలాల తయారీ
H-FAST | హైదరాబాద్ నగరవాసులారా.. పారాహుషార్..! H-FAST తనిఖీలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. మీరు నిత్యం వంటింట్లో రుచి కోసం ఉపయోగించే మసాలా దినుసుల్లో విషయ రసాయనాలు ఉన్నట్లు తేలింది. జీలకర్ర, వాము, లవంగాలు, షాజీరా, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాల్లో బట్టలకు వేసే రంగులు, పారిశ్రామిక రసాయనాలు, టాల్కం పౌడర్ వంటి తినరాని పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు తేలింది.
- హైదరాబాద్‌లో అడ్డగోలుగా కల్తీ దందా
- ఇవి తింటే రోగాల పాలే
- కల్తీగుట్టు రట్టు చేసిన H-FAST
- 13 ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- వివరాలు వెల్లడించిన సీపీ వీసీ సజ్జనార్
H-FAST | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరవాసులారా.. పారాహుషార్..! H-FAST తనిఖీలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. మీరు నిత్యం వంటింట్లో రుచి కోసం ఉపయోగించే మసాలా దినుసుల్లో విషయ రసాయనాలు ఉన్నట్లు తేలింది. జీలకర్ర, వాము, లవంగాలు, షాజీరా, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాల్లో బట్టలకు వేసే రంగులు, పారిశ్రామిక రసాయనాలు, టాల్కం పౌడర్ వంటి తినరాని పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు తేలింది. కాసుల కక్కుర్తితో ఆహార పదార్థాలకు డైలు, ఇండస్ట్రియల్ రంగులు కలిపి మసాలాలను ఆకర్షణీయంగా మార్చి మార్కెట్‌లోకి పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని కేంద్రాల్లో నాసిరకం ఆవాలకు ఫ్యాబ్రిక్ డై, టాల్కం పౌడర్, నూనె కలిపి కృత్రిమ మెరుపు, బరువు పెంచుతున్నట్లు తేలింది. ఈ కల్తీ మసాలాల వినియోగం వల్ల క్యాన్సర్ ముప్పుతో పాటు కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.

పక్కా సమాచారంతో దాడులు..
హైదరాబాద్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ ఈ వివరాలను వెల్లడించారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయని తెలిపారు. పక్కాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు 13 మసాలాల ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. తనిఖీల్లో హానికర రసాయనాలు కలిపిన 25.3 టన్నుల మసాలాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రెండు, బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒకటి చొప్పున మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి రాహుల్ భాటి (కాటేదాన్), విశాల్ పన్వార్, దులీచంద్ కచ్చవా (ఇద్దరూ బేగంబజార్)లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
కల్తీ ఎలా చేస్తున్నారంటే..
దాడుల్లో బయటపడిన అంశాలు పోలీసులు, అధికారులను సైతం షాక్‌కు గురిచేశాయి. ఆహారంలో వినియోగించే కొన్ని రంగులతో పాటు బట్టలకు ఉపయోగించే ఫ్యాబ్రిక్ డైలు, పారిశ్రామిక శాశ్వత రంగులు, షైనింగ్ పౌడర్ (టాల్కం పౌడర్), రైస్ బ్రాన్ ఆయిల్ వంటి పదార్థాలను మసాలాల్లో కలుపుతున్నట్లు గుర్తించారు. నాసిరకం, తిరస్కరించిన ఆవాల స్టాక్‌కు డైలు, పౌడర్, నూనె కలిపి కృత్రిమంగా మెరుపు, బరువు పెంచుతున్నట్లు తేలింది. లవంగాలు, షాజీరా వంటి సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయమైన రంగు రావడానికి సింథటిక్ రంగులు పూస్తుండగా.. షాజీరా, వాము తదితర మసాలాల్లో పారిశ్రామిక రంగులు నేరుగా కలుపుతున్నట్లు గుర్తించారు. దాడుల్లో 7,920 కిలోల వాము, 6,700 కిలోల జీలకర్ర, 550 కిలోల లవంగాలు, 2,280 కిలోల షాజీరా, 540 కిలోల సోంపు, 4,960 కిలోల కల్తీ ఆవాలు, 2,350 కిలోల జీలకర్ర డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 65 టన్నుల ఆవాలు, 13.46 టన్నుల మెంతులు, 10 టన్నుల తెల్లనువ్వులు, సింథటిక్ రంగులు, షైనింగ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్, మూడు రోలింగ్ యంత్రాలను కూడా అధికారులు సీజ్ చేశారు.

ల్యాబ్‌కు శాంపిళ్లు
ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి అనుమానాస్పద నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006తో పాటు ఇతర చట్టాల కింద నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై కఠిన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించే వరకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగులు, ఫ్యాబ్రిక్ డైలు, టాల్కం పౌడర్ వంటి తినరాని పదార్థాలు కలిసిన మసాలాలను వినియోగించడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడంతో పాటు జీర్ణకోశ సమస్యలు, అల్సర్లు, అలెర్జీలు, చర్మవ్యాధులు, నరాల వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
140 రోజుల్లో 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాల పట్టివేత
H-FAST ఏర్పాటు చేసిన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకుంది. 232 కేసులను తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించింది. 46 పనీర్, 83 నెయ్యి విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తెల్లగా కనిపించేలా చేయడానికి పెయింట్లలో వినియోగించే టైటానియం ఆక్సైడ్, ఎసిటిక్ యాసిడ్ వాడుతున్నట్లు గుర్తించింది. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో తయారు చేసిన 27 టన్నులకుపైగా పేస్ట్‌ను స్వాధీనం చేసుకుంది. 12 టన్నుల కుళ్లిన కోడి, మేక మాంసంతో పాటు హోటళ్లకు సరఫరా చేసేందుకు నిల్వ చేసిన 60 టన్నుల కోడి వ్యర్థాలను సీజ్ చేసింది. ఈగలు, బొద్దింకలు, మురుగు కాలువల మధ్య ఆహార పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రాలను గుర్తించింది. అదేవిధంగా రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టిన 25.8 టన్నుల పండ్లు, 9.2 టన్నుల కల్తీ ఊరగాయలు, 3.8 టన్నుల టీ పొడి, యూరియా, డిటర్జెంట్లు, పామ్ ఆయిల్‌తో తయారు చేసిన 1.5 టన్నుల సింథటిక్ పనీర్, 2.5 టన్నుల కల్తీ పెరుగు, 3.2 టన్నుల క్రీమ్, నెయ్యి, నూనెలను కూడా స్వాధీనం చేసుకుంది. ప్రమాణాలకు విరుద్ధంగా నడుస్తున్న ఆర్‌వో వాటర్ ప్లాంట్లు, ఐస్‌క్రీమ్, సమోసా, బిస్కెట్ తయారీ కేంద్రాలపైనా చర్యలు తీసుకుంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మసాలాలు, ఇతర ఆహార ఉత్పత్తులను గుర్తింపు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, లేబులింగ్ తప్పనిసరిగా పరిశీలించాలని సజ్జనార్ సూచించారు. అసాధారణంగా ప్రకాశవంతమైన రంగుల్లో కనిపించే మసాలాలు, బ్రాండ్ లేని లూజ్ సరుకులను కొనొద్దని హెచ్చరించారు. పరిసరాల్లో కల్తీ ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా, అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారుచేస్తున్నా వెంటనే డయల్–100 లేదా H-FAST హెల్ప్‌లైన్ 8712661212 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు రంజిత్, అంజయ్య, ఎస్‌ఐలు శంకర్, కృష్ణ, అఖిల్ తదితరులతో కూడిన H-FAST బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా వారిని సీపీ అభినందించారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mahesh Kumar Goud | హరీశ్‌రావు క్షుద్రపూజలు చేస్తుండు
ఆగస్టు 4, 2026

Murder | హైదరాబాద్‌లో దారుణం.. కొబ్బరికాయలు నరికే కత్తితో పొడిచి చంపారు
ఆగస్టు 4, 2026

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు
- ●USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..
- ●RTC Employees | రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
- ●BRSV | ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే దుష్ప్రచారం: బీఆర్ఎస్వీ
- ●Sony BRAVIA 9II | సోనీ నుంచి 115 ఇంచుల భారీ టీవీ.. ధర ఎంతంటే..?

Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు

USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..

RTC Employees | రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి



