త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (UUSP) నిర్ణయించింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాల‌యంలో యూఎస్‌పీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని అన్నారు.

S

Telangana | Published On Aug 4, 2026, 4.05 pm IST

USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం
Advertisement

ఆగస్టు 7న పాఠశాలల్లో నిరసనలు
12,13 న మండల కేంద్రాల్లో మెమోరాండంలు
19 న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు
పీఆర్సీ ప్రకటించేదాక నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
21 నుండి 26 వరకు రాష్ట్ర, జిల్లా బృందాల పర్యటన, జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు.
ఆగస్టు 29న ఇందిరా పార్క్ ఎదుట‌ మహా ధర్నా
అప్పటికీ స్పందన లేకుంటే సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ

USPC | త్రినేత్ర‌.న్యూస్ : ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్ణయించింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాల‌యంలో యూఎస్‌పీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని అన్నారు. వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి 15% నిధుల కేటాయింపు హామీని విస్మరించారని, నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ఘనంగా ప్రకటించినప్పటికీ కేవలం యూకేజీకే పరిమితం చేశారని విమ‌ర్శించారు. ప్రీప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12.00 గంటల వరకే నడపాలన్నారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో సాయంత్రం 4.00 వరకు ప్రీప్రైమరీ తరగతులు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మధ్యాహ్నం 12.00 తర్వాత పసి పిల్లలను ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని వివ‌రించారు.

ప్రాథమిక విద్యకు నష్టదాయకమైన జీవో 25 ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్య‌బ‌ట్టారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు టీచర్లు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈవో, రెవెన్యూ డివిజన్‌కు ఒక డిప్యూటీ ఈవో, అన్ని మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. పీవో 2018 కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఆగస్టు 15 లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. టెట్‌లో సర్వీసు వెయిటేజ్ ఇవ్వాలని కోరారు. స్పెషల్ టెట్‌ను సబ్జెక్టు వారీ పేపర్లతో నిర్వహించాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెమో 57 ప్రకారం 2003 డీయస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు. విద్యా శాఖలో బీసీ, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్చాలని, మోడల్ స్కూల్స్ ను, ఎయిడెడ్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. కేజీబీవీ, యూఆర్ఎస్‌, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో 190 అమలు చేయాలన్నారు. 5 వాయిదాల కరువు భత్యం (డీఎ) ను వెంటనే ప్రకటించాలని కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను ప్రతినెల రూ 2000 కోట్ల చొప్పున విడుదల చేయాలన్నారు. హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధ‌న‌కు దశలవారీ పోరాటాలు నిర్వహించాలని యూయూఎస్‌పీ నిర్ణయించింది.

ఆ మేరకు ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, ఆనాటి నుండి పీఆర్సీ ప్రకటించేదాకా ప్రతిరోజూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని యూయూఎస్‌పీ పిలుపునిచ్చింది. 12,13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, తహసీల్దార్లకు మెమోరాండంలు, 19 న‌ జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని, 29న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని యూఎస్‌పీసీ నాయకులు ప్రకటించారు. అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని, ఉపాధ్యాయులు అందరూ సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చావ రవి, ఎ వెంకట్(టీఎస్ యూటీఎఫ్), సిహెచ్ అనిల్ కుమార్, ఎన్ తిరుపతి(టీపీటీఎఫ్‌), ఎం సోమయ్య, టి లింగారెడ్డి(డీటీఎఫ్‌), కొమ్ము రమేష్ (బీటీఎఫ్), మేడి చరణ్ దాస్ (ఎస్సీ,ఎస్టీ టీఎఫ్), ఎస్ హరికిషన్(టీటీఏ), బి కొండయ్య (ఎంఎస్ టీఎఫ్), వై విజయ కుమార్, రవీందర్ (ఎస్సీ, ఎస్టీ యూఎస్‌) త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement