త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాల‌కే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Minister Uttam Kumar Reddy | రైతుల ప్ర‌యోజ‌నాల‌కే త‌మ ప్ర‌భుత్వ తొలి ప్రాధాన్య‌మ‌ని రాష్ట్ర నీటిపారుదల, ఆహార-పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకూ లెక్క చెప్పాల్సిందేన‌న్నారు. ప్రభుత్వానికి చెందిన ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం లేదా సీఎంఆర్‌ బకాయిలను సకాలంలో చెల్లించకుండా ప్రజాధనానికి నష్టం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

D

Hyderabad | Published On Aug 4, 2026, 1.38 pm IST

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాల‌కే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
Advertisement
  • నిజాయితీగల రైస్‌ మిల్లర్లకు సంపూర్ణ సహకారం
  • ప్రభుత్వ నిల్వల దారి మళ్లింపుపై కఠిన చర్యలు
  • పెండింగ్‌ సీఎంఆర్‌ బకాయిలను మిల్లులవారీగా సమీక్షిస్తాం
  • రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు
  • రైతుల ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు ఎలాంటి ఆటంకం ఉండదు

Minister Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకూ లెక్క తేల్చడం, కస్టమ్‌ మిల్లింగ్‌ వ్యవస్థలో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, ఆహార-పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం లేదా సీఎంఆర్‌ బకాయిలను సకాలంలో చెల్లించకుండా ప్రజాధనానికి నష్టం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ధాన్యం సేకరణ, నిల్వలు, కస్టమ్‌ మిల్లింగ్‌, ప్రభుత్వానికి బియ్యం అప్పగింత, బకాయిల వసూలు, ప్రభుత్వ నిల్వల పరిరక్షణతో పాటు డిఫాల్టర్‌ రైస్‌ మిల్లులపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పౌరసరఫరాల శాఖాధికారులు పాల్గొనాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించే వరకు మొత్తం వ్యవస్థలోని ప్రతి దశను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

వారి వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాకు భారీ న‌ష్టం..

ఈ సమీక్ష రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమ మొత్తానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్య కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో వందలాది మంది రైస్‌ మిల్లర్లు దశాబ్దాలుగా ప్రభుత్వంతో నిజాయితీగా పనిచేస్తూ రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు విశేషంగా సహకరిస్తున్నారని కొనియాడారు. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిజాయితీగల మిల్లర్లకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సంద‌ర్భంగా భరోసా ఇచ్చారు. అయితే, కొంతమంది మిల్లర్లు ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, నిర్ణీత సమయంలో కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం అప్పగించకపోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఇటువంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, అంతిమంగా ఆ భారం తెలంగాణ ప్రజలపైనే పడుతోందన్నారు.

రైతుల కోసం భారీ కొనుగోలు వ్యవస్థ

దేశంలో అత్యధికంగా వరి సాగు, ధాన్యం సేకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి ఉత్త‌మ్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్రతి వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా, కనీస మద్దతు ధర పొందేలా ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ధాన్యం కొనుగోలు కార్యక్రమాల్లో ఒకదాన్ని నిర్వహిస్తోందన్నారు.

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. సాధారణంగా 48 గంటల్లోనే ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ హామీతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణంగా సమీకరించి ఈ కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ విధానంలో రైస్‌ మిల్లులకు అప్పగిస్తామని, మిల్లర్లు నిర్ణీత నిష్పత్తిలో ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ బియ్యాన్ని భారత ఆహార సంస్థకు అప్పగించడంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాల కింద ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

ఈ ప్రక్రియలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రైతులు, వేలాది కొనుగోలు కేంద్రాలు, లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం భాగస్వాములవుతున్నాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విలువ పదివేల కోట్ల రూపాయల్లో ఉంటుందని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. మిల్లింగ్‌, బియ్యం అప్పగింతలో ప్రతి రోజు ఆలస్యం జరిగినా ప్రభుత్వంపై అదనపు వడ్డీ భారం పడుతుందని మంత్రి గుర్తుచేశారు.

ప్రభుత్వ ఆస్తుల దారి మళ్లింపు తీవ్రమైన నేరం

అధిక శాతం రైస్‌ మిల్లర్లు తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తున్నప్పటికీ, కొంతమంది మిల్లర్ల వద్ద తీవ్రమైన అక్రమాలు వెలుగుచూశాయని మంత్రి తెలిపారు. నిర్ణీత గడువులో కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం అప్పగించకపోవడం, ప్రభుత్వ ధాన్యాన్ని అనధికారికంగా విక్రయించడం, ప్రభుత్వ బియ్యాన్ని దారి మళ్లించడం, తక్కువ పరిమాణంలో బియ్యం అప్పగించడం, నిల్వలను దాచిపెట్టడం, రికార్డులను తారుమారు చేయడం, చట్టబద్ధమైన స్టాక్‌ రిజిస్టర్లను నిర్వహించకపోవడం వంటి అక్రమాలను గుర్తించినట్లు చెప్పారు.

మిల్లులకు అప్పగించిన ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా విక్రయించడం, అనేక సీజన్లుగా భారీ సీఎంఆర్‌ బకాయిలను పేరుకుపోయేలా చేయడం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. దారి మళ్లించిన ప్రతి కిలో ధాన్యం ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ఆస్తేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తిరిగి చేరని ప్రతి టన్ను బియ్యం ప్రజాపంపిణీ వ్యవస్థను బలహీనపరుస్తుందని, ఆ నష్టాన్ని చివరకు పన్నులు చెల్లించే ప్రజలే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

నాలుగు సూత్రాలతో ప్రభుత్వ విధానం

  • ధాన్యం కొనుగోలు, కస్టమ్‌ మిల్లింగ్‌ వ్యవస్థలో ప్రభుత్వం నాలుగు స్పష్టమైన సూత్రాలను అనుసరిస్తుందని మంత్రి వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ప్రయోజనాలకు భంగం క‌లగకుండా ధాన్యం కొనుగోలును నిరంతరాయంగా కొనసాగించడం మొదటి ప్రాధాన్యమన్నారు. ఇతరులు చేసే తప్పులకు రైతులు నష్టపోకూడదని స్పష్టం చేశారు.
  • రెండో సూత్రంగా నిజాయితీగల రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిల్లర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
  • మిల్లులకు అప్పగించిన ప్రతి ధాన్యం గింజకూ పూర్తి లెక్క ఉండేలా జవాబుదారీతనం కల్పించడం మూడో సూత్రమని తెలిపారు. ధాన్యం మిల్లుకు చేరిన క్షణం నుంచి బియ్యం ప్రభుత్వానికి అప్పగించే వరకు ప్రతి దశకు స్పష్టమైన రికార్డు ఉండాలన్నారు.
  • ప్రభుత్వ నిల్వల దారి మళ్లింపు, మోసం, నమ్మకద్రోహం, ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చట్టాన్ని అమలు చేయడం నాలుగో సూత్రమని మంత్రి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ధృవీకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైస్‌ మిల్లుల్లో ప్రత్యక్షంగా నిల్వలను పరిశీలించడం, స్టాక్‌ రిజిస్టర్లను తనిఖీ చేయడం, సీఎంఆర్‌ నిల్వలను ధృవీకరించడం, కొనుగోలు రికార్డులను వాస్తవ నిల్వలతో సరిపోల్చడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వల్లో కొరత, దారి మళ్లింపును గుర్తించడంతో పాటు అనుమానాస్పద లావాదేవీలపై లోతైన విచారణ జరుపుతామని తెలిపారు.

అక్రమాలకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించి, అవసరమైన చోట క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు, బకాయిల వసూలుకు చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు నిరంతరం నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టడం సహా పరిపాలనాపరమైన చర్యలను పరిశీలిస్తామని చెప్పారు. తనిఖీలు, విచారణల విషయంలో ఏ వ్యక్తికీ, సంస్థకూ మినహాయింపు ఉండదని మంత్రి ఈ సంద‌ర్భంగా తేల్చిచెప్పారు.

ప్రతి రూపాయినీ వసూలు చేస్తాం

ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయినీ సాధ్యమైనంత వరకు తిరిగి వసూలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్‌ సీఎంఆర్‌ బకాయిలను మిల్లులవారీగా సమీక్షించాలని, వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒప్పందాల కింద ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సెక్యూరిటీలను అవసరమైన చోట వినియోగించాలని, బ్యాంకు గ్యారంటీలు, ఇతర ఒప్పందపరమైన రక్షణలను అమలు చేయాలని సూచించారు. అవసరమైన కేసుల్లో సివిల్‌, క్రిమినల్‌ చర్యలను ఏకకాలంలో చేపట్టాలని ఆదేశించారు. కేవలం శిక్షించడం మాత్రమే ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, ప్రజాధనాన్ని రికవరీ చేయడం, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

సాంకేతికతతో పకడ్బందీ పర్యవేక్షణ

భవిష్యత్తులో అక్రమాలకు అవకాశం లేకుండా ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం అప్పగింత వరకు పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం రవాణాను ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు డిజిటల్‌గా పర్యవేక్షించడం, జీపీఎస్‌ ఆధారిత రవాణా పర్యవేక్షణ, నిల్వలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సరిపోల్చడం వంటి సంస్కరణలను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. గోదాములు, రైస్‌ మిల్లుల తనిఖీలను మరింత బలోపేతం చేయడం, గత పనితీరు ఆధారంగా మిల్లులపై రిస్క్‌ ఆధారిత ఆడిటింగ్‌ నిర్వహించడం, ధాన్యం సేకరణ-మిల్లింగ్‌-ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగింతకు సంబంధించిన డేటాబేస్‌లను అనుసంధానం చేయడం వంటి చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎంఆర్‌ ఖాతాలను నిర్దిష్ట గడువులోగా సరిచూడటం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణను మెరుగుపరచడం, నిర్దిష్ట వ్యవధుల్లో థర్డ్‌ పార్టీ ధృవీకరణ నిర్వహించడం ద్వారా మొత్తం సరఫరా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతామని మంత్రి పేర్కొన్నారు.

మిల్లర్లకు విజ్ఞప్తి

రైస్‌ మిల్లర్లు తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. పెండింగ్‌ సీఎంఆర్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని, తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని, రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని మిల్లర్లను కోరారు. తమకు అప్పగించిన ప్రభుత్వ నిల్వలను కాపాడుతూ ప్రభుత్వం–మిల్లింగ్‌ పరిశ్రమ మధ్య పరస్పర విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. చట్టాన్ని, ఒప్పంద నిబంధనలను పాటించే మిల్లర్లకు ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని, ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేసే వారిపై మాత్రం చట్టపరంగా క‌ఠిన‌మైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

రైతులకు పూర్తి భరోసా

రాష్ట్రంలోని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు యథావిధిగా కొనసాగుతుందని, కనీస మద్దతు ధరకు పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు అనంతరం మిల్లింగ్‌, నిల్వలు, బియ్యం అప్పగింతలో జరిగే అక్రమాల ప్రభావం రైతులపై పడకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

“ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి ధాన్యం బస్తా వెనుక రైతు చెమట, కష్టం ఉన్నాయి. ఖర్చు చేసే ప్రతి రూపాయి తెలంగాణ ప్రజలకు చెందిందే. ప్రభుత్వానికి అప్పగించిన ప్రతి ధాన్యం గింజ అంతిమంగా అర్హులైన లబ్ధిదారులకు చేరాలి. రైతులను రక్షించడం, ప్రజాధనాన్ని కాపాడటం, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రతి దశలో జవాబుదారీతనాన్ని నెలకొల్పడం కోసం ప్రభుత్వం నిష్పక్షపాతంగా, నిర్భయంగా, కఠినంగా వ్యవహరిస్తుంది” అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Also Read..

విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

30 సెక‌న్ల‌లో 34 క‌త్తిపోట్లు.. స్కూల్‌ టీచ‌ర్‌పై వ్య‌క్తి పైశాచిక దాడి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Advertisement

తాజావార్తలు

Advertisement