త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Voter List 2026 | హైదరాబాద్ ఓటర్ల జాబితాలో భారీ స్కామ్? డూప్లికేట్ ఓట్లను బట్టబయలు చేసిన కాంగ్రెస్

హైదరాబాద్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భారీ లోపాలున్నాయని డీసీసీ అధ్యక్షుడు సైఫుల్లా ఆరోపించారు. యాకుత్‌పురాలో 148 డూప్లికేట్ ఓట్లను బయటపెట్టారు.

J

Hyderabad | Published On Aug 28, 2026, 5.45 pm IST

Hyderabad Voter List 2026 | హైదరాబాద్ ఓటర్ల జాబితాలో భారీ స్కామ్? డూప్లికేట్ ఓట్లను బట్టబయలు చేసిన కాంగ్రెస్
Advertisement
  • హైదరాబాద్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో తీవ్ర లోపాలు
  • సరైన అడ్రస్ లేకుండా ఏఎస్‌డీ (ASD) జాబితాలు ఇవ్వడంపై హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సైఫుల్లా ఫైర్
  • యాకుత్‌పురా నియోజకవర్గంలోనే 148 డూప్లికేట్ ఓట్లను గుర్తించిన కాంగ్రెస్ నేతలు
  • ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించాలని, బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్

Hyderabad Voter List 2026 | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో లొసుగులు బయటపడుతున్నాయి. ఈ ఓటర్ల సవరణ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా శుక్రవారం ఆరోపించారు. సరైన చిరునామా వివరాలు లేకుండానే జాబితాలు చేతిలో పెడుతున్నారని ఆయన ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలింగ్ బూత్‌ల వద్ద జరుగుతున్న వార్డు సభలను సందర్శించి బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), అధికారులతో మాట్లాడిన అనంతరం సైఫుల్లా పలు కీలక విషయాలు వెల్లడించారు. అనామలీ (Anomaly), అన్‌మ్యాప్డ్ ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. అధికారులు మాత్రం ఆ డేటాను ఇవ్వకుండా దాస్తున్నారని మండిపడ్డారు. వివరాలు లేకుండా తమ పార్టీ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎలా సాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా ఊరు విడిచి వెళ్లిన, చనిపోయిన (Absent, Shifted, and Dead - ASD) ఓటర్ల జాబితాల్లో కనీసం ఇంటి నంబర్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే హైదరాబాద్ లాంటి నగరంలో అడ్రస్ సరిగ్గా లేకుండా కేవలం పేరు ఆధారంగా బీఎల్‌ఏలు ఓటర్లను ఎలా వెతుకుతారని సైఫుల్లా ఎన్నికల సంఘాన్ని నిలదీశారు.

దీనికి ఉదాహరణగా యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 148 అనుమానాస్పద డూప్లికేట్ ఓటర్ల (Duplicate voters) సెట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఒకే రకమైన పేర్లు, ఫొటోలు ఉండి.. ఎపిక్ (EPIC) నంబర్లు, పోలింగ్ పార్ట్‌లు, అడ్రస్‌లు వేరుగా ఉన్న రికార్డులను పక్కపక్కన పెట్టి పోల్చారు. ఇన్ని డూప్లికేట్ నమోదులు కొనసాగితే ఈ ప్రక్రియ నాణ్యతపై తీవ్ర సందేహాలు వస్తాయన్నారు. పారదర్శకతతో వ్యవహరించి బోగస్ ఓట్లను తీసేయాలని, అదే సమయంలో ఏ ఒక్క నిజమైన ఓటరు గల్లంతు కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస డేటా ఇవ్వకుండా ఎన్నికల సంఘం (ECI) పారదర్శకత లోపించేలా ప్రవర్తిస్తే బీజేపీకి అనుబంధ సంస్థగా ముద్ర పడుతుందని సైఫుల్లా హెచ్చరించారు.

Advertisement
Advertisement