త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sensex | రూ.1 ల‌క్ష పెట్టుబ‌డికి రూ.44 ల‌క్ష‌ల లాభం.. ఎఫ్ అండ్ వో క్లోజింగ్ ఆక్ష‌న్ సెష‌న్ మాయ‌..

Sensex | డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల నెలవారీ గడువు రోజు బీఎస్‌ఈలో ప్రవేశపెట్టిన కొత్త క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ విధానం తీవ్ర చర్చకు దారితీసింది. క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ గడువు రోజున సెన్సెక్స్‌, బ్యాంకెక్స్‌ సూచీల్లో భారీ ఊగిసలాట నమోదైంది.

S

Business | Published On Aug 28, 2026, 5.03 pm IST

Sensex | రూ.1 ల‌క్ష పెట్టుబ‌డికి రూ.44 ల‌క్ష‌ల లాభం.. ఎఫ్ అండ్ వో క్లోజింగ్ ఆక్ష‌న్ సెష‌న్ మాయ‌..
Advertisement

Sensex | డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల నెలవారీ గడువు రోజు బీఎస్‌ఈలో ప్రవేశపెట్టిన కొత్త క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ విధానం తీవ్ర చర్చకు దారితీసింది. క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ గడువు రోజున సెన్సెక్స్‌, బ్యాంకెక్స్‌ సూచీల్లో భారీ ఊగిసలాట నమోదైంది. మార్కెట్‌ ముగిసే సమయంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై సామాజిక మాధ్యమాల్లో ట్రేడర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ భారీ ధరల కదలికలు కొంతమంది ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఆర్జించే అవకాశాన్ని కూడా కల్పించాయి. ఆగస్టు 3న సెబీ క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్ (సీఏఎస్‌)ను ప్రవేశపెట్టింది. షేర్ల అధికారిక ముగింపు ధరను నిర్ణయించే ఈ విధానం ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన మార్కెట్లలో అమల్లో ఉంది. ధరల మానిప్యులేషన్‌కు అవకాశాలను తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ విధానం ప్రస్తుతం ఈక్విటీ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ట్రేడ్‌ అయ్యే సుమారు 200 షేర్లకు వర్తిస్తోంది. డెరివేటివ్స్‌ లేని మిగిలిన షేర్లకు మాత్రం పాత వాల్యూమ్‌ వెయిటెడ్‌ యావరేజ్‌ ప్రైస్‌ విధానం కొనసాగుతోంది.

7 నిమిషాల్లో 2వేల పాయింట్ల క‌ద‌లిక‌..

సీఏఎస్‌ విధానం ప్రకారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 3.30 గంటల వరకు క్లోజింగ్‌ ఆక్షన్‌ నిర్వహిస్తారు. ఈ సమయంలో కొనుగోలు, విక్రయ ఆర్డర్లను ఒకచోట చేర్చి, అత్యధిక పరిమాణంలో ట్రేడింగ్‌ జరిగే ధరను సమతుల్య ధరగా నిర్ణయిస్తారు. అదే ధర ఆ రోజు షేర్‌కు అధికారిక ముగింపు ధరగా మారుతుంది. అయితే సీఏఎస్‌ ప్రారంభమైనప్పటి నుంచి నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు, అంటే క్లోజింగ్‌ ఆక్షన్‌ ప్రారంభానికి ముందు ఉన్న స్థాయి నుంచి 3.30 గంటలకు సెషన్‌ ముగిసే వరకు తీవ్ర అస్థిరత కనిపిస్తోంది. గురువారం బీఎస్‌ఈలో సీఏఎస్‌ ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల్లోనే, అంటే 3.18 నుంచి 3.23 గంటల మధ్య సెన్సెక్స్‌ ఏకంగా 2,200 పాయింట్లకు పైగా పతనమైంది. అనంతరం కేవలం ఏడు నిమిషాల్లోనే దాదాపు 2,000 పాయింట్లు తిరిగి పుంజుకుంది. చివరకు సెన్సెక్స్‌ 76,934 పాయింట్ల వద్ద ముగిసి, బుధవారం ముగింపుతో పోలిస్తే 539 పాయింట్లు నష్టపోయింది.

రూ.1 ల‌క్ష‌కు రూ.44 ల‌క్ష‌లు..

ఎన్‌ఎస్‌ఈలో పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా గణనీయమైన కదలిక నమోదైంది. మధ్యాహ్నం 3.18 నుంచి 3.22 గంటల మధ్య నిఫ్టీ 100 పాయింట్లకు పైగా పడిపోయింది. ఆ తర్వాత సుమారు 60 పాయింట్లు తిరిగి పుంజుకుని 24,091 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో సెన్సెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరులోనూ భారీ ఊగిసలాట కనిపించింది. సీఏఎస్‌ సమయంలో ఏడు నిమిషాల్లోనే రిలయన్స్‌ షేరు ధర రూ.1,289 నుంచి రూ.1,250కు పడిపోయింది. అంటే దాదాపు 3 శాతం క్షీణించింది. అనంతరం అదే స్థాయిలో వేగంగా కోలుకుని రూ.1,286 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్‌ తదితర సెన్సెక్స్‌ షేర్లలోనూ ఇలాంటి భారీ ధరల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలపై ట్రేడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు అనేక మంది ట్రేడ‌ర్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు 76,500 స్ట్రైక్‌ సెన్సెక్స్‌ పుట్‌ ఆప్షన్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి, 3.20 గంటలకు విక్రయించి ఉంటే కేవలం ఐదు నిమిషాల్లో దాదాపు రూ.44 లక్షల లాభం వచ్చేదని పేర్కొన్నారు. ఈ ఉదాహరణ క్లోజింగ్‌ ఆక్షన్‌ సమయంలో మార్కెట్లో ఏర్పడిన అసాధారణ ధరల కదలిక తీవ్రతను సూచిస్తోంది.

మానిప్యులేష‌న్ ఆగేనా..?

కాగా వారం రోజుల క్రితం జేపీ మోర్గాన్‌కు చెందిన కాప్‌థాల్‌ మారిషస్‌ సంస్థను మార్కెట్‌ మానిప్యులేషన్‌ ఆరోపణలపై సెబీ ప‌సిగ‌ట్టింది. సెన్సెక్స్‌, దాని భాగస్వామ్య షేర్లలో ధరలను ప్రభావితం చేసి దాదాపు రూ.3 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్లు సెబీ ఆరోపించింది. ఇదే తరహా వ్యూహాన్ని దేశీయ బ్రోకర్‌ మాన్సీ స్టాక్‌ అండ్‌ షేర్‌ బ్రోకింగ్‌ కూడా అనుసరించినట్లు నియంత్రణ సంస్థ పేర్కొంది. దీంతో కాప్‌థాల్‌, మాన్సీ బ్రోకింగ్‌పై చర్యలు తీసుకున్న సెబీ, మాన్సీపై ప్రొప్రైటరీ ట్రేడ్స్‌కు సంబంధించి ఆంక్షలు విధించింది. అలాగే అక్రమంగా ఆర్జించిన దాదాపు రూ.3.8 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ ద్వారా ధరల మానిప్యులేషన్‌ను అరికట్టాలనే సెబీ ఉద్దేశం ఉన్నప్పటికీ, మార్కెట్‌ ముగింపు సమయంలో సెన్సెక్స్‌లో చోటుచేసుకున్న ఇంత భారీ ఊగిసలాట కొత్త విధానంపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Advertisement
Advertisement