త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Diversions | బోనాల వేళ హైదరాబాద్‌లో రెండురోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు.. వాహ‌నదారుల‌కు కీల‌క సూచ‌న‌లు..!

Traffic Diversions | బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. లాల్‌దర్వాజా, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, అంబర్‌పేట మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ-పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీ, ఊరేగింపులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ మళ్లింపులు చేపడుతున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

P

Hyderabad | Published On Aug 8, 2026, 6.18 pm IST

Traffic Diversions | బోనాల వేళ హైదరాబాద్‌లో రెండురోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు.. వాహ‌నదారుల‌కు కీల‌క సూచ‌న‌లు..!
Advertisement

Traffic Diversions | బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. లాల్‌దర్వాజా, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, అంబర్‌పేట మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ-పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీ, ఊరేగింపులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ మళ్లింపులు చేపడుతున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

లాల్‌దర్వాజాలో రెండు రోజుల ఆంక్షలు

పాతబస్తీలోని సింహవాహిని మ‌హంకాళి ఆలయం, లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా ఆదివారం (ఆగ‌స్టు 9న) ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు, ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు కొనసాగుతాయి. మదీనా ఎక్స్‌రోడ్స్‌ నుంచి ఇంజిన్‌బౌలి వరకు గుల్జార్‌హౌస్‌, చార్మినార్‌, చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌, హిమ్మత్‌పురా, నాగుల్‌చింత, ఆలియాబాద్‌ మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని ఊరేగింపు పూర్తయ్యే వరకు పూర్తిగా మూసివేయనున్నారు. ఫలక్‌నుమా, ఇంజిన్‌బౌలి వైపు నుంచి ఆలియాబాద్‌ వచ్చే వాహనాలను కొత్త షంషేర్‌గంజ్‌ ‘టీ’ జంక్షన్‌ వద్ద గోశాల, తాడ్‌బన్‌, మిస్రీగంజ్‌, ఖిల్వత్‌ వైపు మళ్లిస్తారు. మహబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను ఇంజిన్‌బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్‌బన్‌, ఖిల్వత్‌ వైపు పంపిస్తారు. నాగుల్‌చింత, సుధా టాకీస్‌ నుంచి లాల్‌దర్వాజా వైపు వచ్చే వాహనాలను నెహ్రూ మోడ్‌ వద్ద సుధా టాకీస్‌, గౌలీపురా వైపు మళ్లిస్తారు. గౌలీపురా నుంచి లాల్‌దర్వాజా మోడ్‌ వైపు వచ్చే వాహనాలను హరిబౌలి, మీర్‌చౌక్‌ దిశగా పంపిస్తారు. పాత చంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక వైపు వెళ్లే భారీ వాహనాలను అనుమతించకుండా సంతోష్‌నగర్‌, చంద్రాయణగుట్ట వైపు మళ్లించనున్నారు. చార్మినార్‌, నయాపూల్‌, పురానీహవేలీ, గౌలిగూడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు కూడా అవసరాన్ని బట్టి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు.

భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌

ఆలియాబాద్‌ వైపు నుంచి వచ్చే భక్తులు శాలిబండ పోస్టాఫీసు ఎదురుగా దేవి ప్లైవుడ్‌ మెయిన్‌ రోడ్డుపై సింగిల్‌ లైన్‌లో లేదా అల్కా థియేటర్‌ ఖాళీ స్థలంలో వాహనాలు నిలపాలి. హరిబౌలి, గౌలీపురా వైపు నుంచి వచ్చే వారు ఆర్యవైశ్య మందిరం, అల్కా థియేటర్‌ ఖాళీ స్థలం, వి.డి.పి. స్కూల్‌ మైదానం, మిత్రా స్పోర్ట్స్‌ క్లబ్‌లో పార్కింగ్‌ చేసుకోవచ్చు. ఛత్రినాక వైపు నుంచి వచ్చే భక్తులకు లక్ష్మీనగర్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, ఫూల్‌బాగ్‌ చమన్‌ గ్రౌండ్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. మూసాబౌలి, మీర్‌చౌక్‌ వైపు నుంచి వచ్చే వారు చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌లో వాహనాలు నిలపాలి. ఊరేగింపు వాహనాలకు ఢిల్లీగేట్‌ వద్ద సింగిల్‌ లైన్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. టీజీ, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను చార్మినార్‌, ఫలక్‌నుమా, నయాపూల్‌ వైపు అనుమతించరు. వాటిని పాత సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, దారుల్‌షిఫా ఎక్స్‌రోడ్స్‌, ఛత్రినాక, ఇంజిన్‌బౌలి వద్ద నిలిపి ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు.

కార్వాన్‌లో ఊరేగింపు

కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ బోనాలు, ఏనుగు ఊరేగింపు నేపథ్యంలో ఆగస్టు 8 రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. పురానాపూల్‌ జంక్షన్‌ నుంచి జియాగూడ రోడ్డు మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు, నాలుగు చక్రాల వాహనాలను పురానాపూల్‌ వద్దే మళ్లిస్తారు. టప్పాచబుత్రా నుంచి దర్బార్‌ మైసమ్మ ఆలయం వైపు వెళ్లే వాహనాలను జిర్రా రోడ్డు వైపు పంపిస్తారు. యాదవ్‌భవన్‌ నుంచి కార్వాన్‌ వైపు వచ్చే వాహనాలను ముర్గిచౌక్‌, తల్లాగడ్డ జంక్షన్‌ వద్ద మళ్లించనున్నారు. ఆసిఫ్‌నగర్‌ నుంచి టప్పాచబుత్రా వైపు వెళ్లే వాహనాలను ఏనుగు ఊరేగింపు హనుమాన్‌ ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో రాయల్‌సీ హోటల్‌, జిర్రా రోడ్డు వైపు మళ్లిస్తారు. కార్వాన్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల మైదానం, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న తోలిమసీదు వద్ద, జగత్‌సింగ్‌ ప్రైవేట్‌ స్థలంలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. జగత్‌సింగ్‌ స్థలాన్ని ద్విచక్ర వాహనాల కోసం వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.

అంబర్‌పేటలో ఫ్లైఓవర్‌ మీదుగా..

అంబర్‌పేట మహంకాళి ఆలయంలో బోనాల నేపథ్యంలో ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. ఉప్పల్‌ నుంచి చాదర్‌ఘాట్‌, ఎంజీబీఎస్‌ వైపు వెళ్లే బస్సులు, భారీ వాహనాలు అంబర్‌పేట ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అదే మార్గంలో చాదర్‌ఘాట్‌, ఎంజీబీఎస్‌ నుంచి వచ్చే వాహనాలను కూడా పంపిస్తారు. రామంతాపూర్‌ వైపు నుంచి ఆలయానికి వచ్చే భక్తులు అంబర్‌పేట ఫ్లైఓవర్‌ వద్ద ఎడమ బైలేన్‌ ద్వారా గాంధీ విగ్రహం వైపు వెళ్లి అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ మైదానంలో వాహనాలు పార్క్‌ చేయాలి. ఫ్లైఓవర్‌ వద్ద రద్దీ పెరిగితే ఉప్పల్‌ నుంచి అంబర్‌పేట టీ జంక్షన్‌, ఆలీకేఫ్‌ వైపు వెళ్లే వాహనాలను రాయల్‌ జ్యూస్‌ కార్నర్‌, మల్లికార్జుననగర్‌, డీడీ కాలనీ, సిండికేట్‌ బ్యాంక్‌, శివంరోడ్డు, తిలక్‌నగర్‌ మీదుగా మళ్లిస్తారు.

చిలకలగూడలోనూ మళ్లింపులు

చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ-పోచమ్మ ఆలయం వద్ద ఆగస్టు 9, 10 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సీతాఫల్‌మండి జంక్షన్‌ నుంచి చిలకలగూడ ఎక్స్‌రోడ్స్‌ వైపు వచ్చే వాహనాలను నామాలగుండు, వారసిగూడ ఎక్స్‌రోడ్స్‌, సీతాఫల్‌మండి టీ జంక్షన్‌, ఓయూ సిటీ రోడ్డు, తార్నాక ఎక్స్‌రోడ్స్‌ వైపు మళ్లిస్తారు. అల్లుగడ్డబావి, సికింద్రాబాద్‌ నుంచి చిలకలగూడ మీదుగా సీతాఫల్‌మండి వైపు వెళ్లే వాహనాలను పద్మారావునగర్‌ టీ జంక్షన్‌ వైపు పంపిస్తారు.

ప్రయాణానికి ముందే ప్లాన్‌ చేసుకోండి

బోనాల వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు రద్దీ ప్రాంతాలను వీలైనంత వరకు తప్పించుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. ప్రయాణానికి ముందే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. అత్యవసర ట్రాఫిక్‌ సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చు. తాజా ట్రాఫిక్‌ సమాచారం కోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Advertisement
Advertisement