Gandipeta | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర ప్రజలకు సురక్షిత మంచినీరు అందించే గండిపేట జలాశయం వద్ద కొందరు గలీజు పనులకు పాల్పడుతున్నారు. మానవ మలమూత్ర వ్యర్థాలను సెప్టిక్ ట్యాంక్‌లోకి తీసుకొచ్చి.. గండిపేటలో వదులుతున్నారు. వారి చర్యలను చూస్తుంటే వీళ్లసలు మనషులేనా..? అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అసలేం జరిగిందంటే..? బుధవారం నాడు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు లోగో కలిగిన ఓ సెప్టిక్ ట్యాంక్ గండిపేట జలాశయం వద్దకు చేరుకుంది. ఇక గండిపేట కట్టపై ఎఫ్‌టీఎల్ 428వ పాయింట్ వద్ద సెప్టిక్ ట్యాంకును నిలిపారు. ఆ తర్వాత మలమూత్ర విసర్జన వ్యర్థాలను గండిపేట జలాశయంలోకి వదిలారు. ఈ తతంగాన్ని స్థానికులు గమనించి, సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్‌ను పట్టుకున్నారు. అనంతరం జలమండలి అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి జలాశయం వద్దకు చేరుకుని, మలమూత్ర వ్యర్థాలను వదలడంపై డ్రైవర్‌ను ప్రశ్నించారు. అనంతరం డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెప్టిక్ ట్యాంక్ వాహనాన్ని సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గండిపేట తాగు నీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు హైదరాబాద్ వాసులు తాగే గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను వదిలిపెడుతున్న మాఫియా pic.twitter.com/HdeTq5uyzR — Telugu Scribe (@TeluguScribe) December 18, 2025