త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

H – FAST | విడి నూనె విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. వ్యాపారుల‌కు హెచ్చ‌రిక‌

H - FAST | ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె విక్రయాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హెచ్ ఫాస్ట్‌ విభాగం.. ఆదివారం బేగంబజార్‌లోని తన కార్యాలయంలో నూనె తయారీదారులు, సరఫరాదారులతో కీలక అవగాహన సదస్సును నిర్వహించింది.

S

Hyderabad | Published On Apr 26, 2026, 5.43 pm IST

H – FAST | విడి నూనె విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. వ్యాపారుల‌కు హెచ్చ‌రిక‌
Advertisement

H - FAST | త్రినేత్ర‌.న్యూస్ : ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె విక్రయాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హెచ్ ఫాస్ట్‌ విభాగం.. ఆదివారం బేగంబజార్‌లోని తన కార్యాలయంలో నూనె తయారీదారులు, సరఫరాదారులతో కీలక అవగాహన సదస్సును నిర్వహించింది.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ డీసీపీ, H-FAST ఇన్‌ఛార్జ్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్.. వంట నూనెల వ్యాపారంలో పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలపై వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు.

15 రోజుల గడువు.. ఆపై కఠిన చర్యలు

వ్యాపారులు తమ పనితీరును మార్చుకోవడానికి డీసీపీ 15 రోజుల గడువు విధించారు. ఈ గడువులోగా విడి నూనె విక్రయాలను పూర్తిగా నిలిపివేసి, వంద శాతం ప్యాకేజింగ్, బ్రాండింగ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహిత, ఆహార భద్రత చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ముఖ్యమైన ఆదేశాలు ఇవే:

ప్యాకేజింగ్ తప్పనిసరి: మార్కెట్‌లో విక్రయించే ప్రతి నూనె ప్యాకెట్ లేదా టిన్ సీల్ చేయబడి ఉండాలి. విడి నూనె అమ్మడం చట్టరీత్యా నేరం.
పారదర్శకమైన లేబిలింగ్: ప్రతి ప్యాకెట్‌పై తయారీ తేదీ (MFG Date), గడువు తేదీ (Expiry Date), బ్యాచ్ నంబర్, FSSAI లైసెన్స్ నంబర్‌ను స్పష్టంగా ముద్రించాలి.
కల్తీకి తావులేదు: నూనెలో తక్కువ రకం నూనెలను కలపడం లేదా హానికరమైన రసాయనాలు వాడటం వంటి చర్యలకు పాల్పడితే లైసెన్స్‌లు రద్దు చేయడమే కాకుండా కఠిన కారాగార శిక్ష తప్పదని హెచ్చరించారు.
పరిశుభ్రత ప్రమాణాలు: నూనె తయారీ కేంద్రాల్లో (Refineries), నిల్వ కేంద్రాల్లో ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం పరిశుభ్రతను పాటించాలి.

ప్ర‌జ‌ల ఆరోగ్యానికే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ఇవ్వాలి

"వ్యాపారులు లాభం కంటే ప్రజల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి" అని డీసీపీ హితవు పలికారు. అదేవిధంగా, వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకు వస్తుందని విడి నూనెను కొనుగోలు చేసి అనారోగ్యాల పాలు కావద్దని కోరారు. ఎక్కడైనా నూనె కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో H-FAST ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, నగరంలోని ప్రముఖ నూనె వ్యాపారులు పాల్గొన్నారు. అధికారులు తీసుకున్న ఈ చొరవను వ్యాపార సంఘాలు స్వాగతించాయి.

Advertisement
Advertisement