H-FAST | 100 రోజుల్లో 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం
H-FAST | తినే అన్నంలో కల్తీలు.. తాగే పాలలో రసాయనాలు.. చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు.. లాభార్జనే పరమావధిగా సాగుతున్న ఆహార కల్తీపై (Food Adulteration) హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) ఉక్కుపాదం మోపుతున్నారు.
H-FAST | త్రినేత్ర.న్యూస్: తినే అన్నంలో కల్తీలు.. తాగే పాలలో రసాయనాలు.. చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు.. లాభార్జనే పరమావధిగా సాగుతున్న ఆహార కల్తీపై (Food Adulteration) హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) ఏర్పాటై 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మార్చి 19న శంఖారావం పూరించిన ఈ ప్రత్యేక విభాగం.. జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు, ఆకస్మిక తనిఖీలతో నగరంలో ఆహార కల్తీపై రాజీలేని సమరం సాగిస్తున్నది. వంద రోజుల్లో 185 కేసులు నమోదుచేయగా, 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నది.
సురక్షితమైన భవిష్యత్తు కోసం..
ఆహార కల్తీ అనేది కేవలం ఒక చట్టపరమైన నేరమో, వ్యాపార మోసమో కాదు.. అది యావత్ సమాజంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. మన పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారంతో నూరేండ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తే, నేడు కల్తీ విషం వల్ల సగటు ఆయుష్షు సగానికి పడిపోతున్నది. రసాయనాలు, నాణ్యత లేని నిల్వ పదార్థాల వాడకం వల్ల పసిబిడ్డల ఎదుగుదల దెబ్బతింటున్నది. యువత, వృద్ధులు క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువశక్తి రోగాల బారిన పడితే మానవ వనరుల ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇది కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, దేశ ప్రగతిని దశాబ్దాలు వెనక్కి నెడుతుంది. కల్తీ ఆహారం వల్ల చికిత్సల రూపంలో, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 310 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా హెచ్-ఫాస్ట్ పనిచేస్తున్నది.

విస్తుపోయే నిజాలు..
హెచ్-ఫాస్ట్ విభాగం క్షేత్రస్థాయిలో కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నది. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్‌లో 44, సికింద్రాబాద్ జోన్‌లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌లో 13, జూబ్లీహిల్స్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు రికార్డయ్యాయి.
నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, సుమారు 15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం (12 కేసులు), 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి (1 కేసు), సుమారు 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం (2 కేసులు), 2,500 కేజీల కల్తీ పెరుగు (1 కేసు), 1,514 కేజీల కల్తీ పనీర్ (5 కేసులు), ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ (2 కేసులు) స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి ఇతర విభాగాల్లో 34 కేసులు నమోదయ్యాయి.

జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి 247 కేసులు
పోలీసు చర్యలతో పాటు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)లకు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. ఇందులో అత్యధికంగా పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు నమోదు చేశారు. అలాగే సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్‌పై 3 కేసులు నమోదయ్యాయి.

కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్: సీపీ సజ్జనార్
హెచ్-ఫాస్ట్ ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే ఈ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఆశించిన ఫలితాలను సాధించడం అభినందనీయమని హైదరాబాద్ సీపీ సజ్జనర్ (VC Sajjanar) అన్నారు. జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ ఈ బృందం దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. ఆహార కల్తీ నియంత్రణకు హెచ్-ఫాస్ట్ కు సహకరిస్తున్న ఆయా ప్రభుత్వ విభాగాలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హెచ్-ఫాస్ట్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నదని, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు సగటున 15 వరకు కల్తీ ఆహార సమాచారాన్ని అందిస్తున్నారని వెల్లడించారు.

`సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆహార కల్తీ. ప్రజల కిడ్నీలను పాడుచేస్తూ, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులను పంచుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషపూరిత రసాయనాల వాడకం వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటున్నది. శారీరక సామర్థ్యం దెబ్బతింటే మానవ వనరుల ఉత్పాదకత తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమవుతుంది. అందుకే ఈ దందాను మేము కేవలం ఒక చిన్నపాటి వ్యాపార మోసంగానో లేదా నిబంధనల ఉల్లంఘనగానో చూడటం లేదు. ఇది ప్రజల ఆరోగ్యంతో, అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఒక ఘోరమైన హత్యాయత్నం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారి ప్రాణాలను హరించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించడానికి కూడా వెనుకాడబోం.` అని హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరించారు.

ఆహార కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని పిలుపునిచ్చారు. పరిసరాల్లో ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సురక్షిత, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
తాజావార్తలు
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?
- ●Voter ID Online Registration | ఓటరు కార్డు అప్లై చేసే వారికి అలెర్ట్: ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో ఈ కొత్త రూల్ తప్పనిసరి!
- ●Shyam Prasad Reddy | "జైలుకు పంపుతారా? ఆరోజు కేసీఆర్ కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు!".. రేవంత్ వ్యాఖ్యలపై కన్నీరుపెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!

Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?






