త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | త‌డి ఆరుతున్న భాగ్య‌న‌గ‌రం..

Hyderabad | తెలంగాణ త‌డి ఆరిపోతోంది.. గుక్కెడు నీళ్ల కోసం గొంతు కూడా ఎండిపోయే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే.. ఎల్ నినో కార‌ణంగా రాష్ట్రంలో క‌రువు క‌రాళ నృత్యం చేస్తోంది. దీనికి తోడు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోతున్నాయి. దీంతో భ‌విష్య‌త్‌లో నీటి ఎద్ద‌డి మ‌రింత తీవ్రమ‌య్యే ఛాన్స్ ఉంది. మ‌రి ముఖ్యంగా హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంతో పాటు స‌మీపంలో ఉన్న మున్సిపాలిటీల్లో భూగ‌ర్భ జ‌లాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోతున్నాయి.

S

Hyderabad | Published On Oct 22, 2026, 3.35 pm IST

Hyderabad | త‌డి ఆరుతున్న భాగ్య‌న‌గ‌రం..
Advertisement

46 మండ‌లాల్లో 6.58 మీట‌ర్ల‌కు ప‌డిపోయిన భూగ‌ర్భ జ‌లాలు
కూక‌ట్‌ప‌ల్లిలో అత్య‌ల్ప స్థాయికి
షేక్‌పేట్‌, హిమాయ‌త్ న‌గ‌ర్ బెట‌ర్
ఇంకుడు గుంత‌లు నామ‌మాత్ర‌మే
కొత్త బోర్‌వెల్స్ త‌వ్వ‌డానికి అనుమ‌తి లేదు
తేల్చిచెప్పిన ప్ర‌భుత్వం

Hyderabad | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ త‌డి ఆరిపోతోంది.. గుక్కెడు నీళ్ల కోసం గొంతు కూడా ఎండిపోయే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే.. ఎల్ నినో కార‌ణంగా రాష్ట్రంలో క‌రువు క‌రాళ నృత్యం చేస్తోంది. దీనికి తోడు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోతున్నాయి. దీంతో భ‌విష్య‌త్‌లో నీటి ఎద్ద‌డి మ‌రింత తీవ్రమ‌య్యే ఛాన్స్ ఉంది. మ‌రి ముఖ్యంగా హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంతో పాటు స‌మీపంలో ఉన్న మున్సిపాలిటీల్లో భూగ‌ర్భ జ‌లాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోతున్నాయి. తెలంగాణ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 6.58 మీట‌ర్ల‌కు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోయిన‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

హైద‌రాబాద్‌తో పాటు స‌మీపంలో ఉన్న మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల ప‌రిధిలోని 46 మండ‌లాల్లో ఏడాది కాలంలోనే 6.58 మీట‌ర్ల‌కు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోయిన‌ట్లు వెల్ల‌డైంది. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో సగటు భూగర్భ జలమట్టం భూమి లోపలికి (bgl) 4.73 మీటర్లుగా ఉండగా, ఈ ఏడాది అదే నెలలో అది 11.58 మీటర్లకు చేరింది. ఎల్ నినో ప్రభావంతో పాటు సహజ వనరుల కొరత కారణంగా జలమట్టాలు అడుగంటి పోతున్నాయ‌ని తేలింది.

భూగ‌ర్భ జ‌ల శాఖ ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం.. హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల ప‌రిధిలోని 46 మండ‌లాల్లో భూగ‌ర్భ జ‌లాల‌ను ప‌రిశీలిస్తే.. కూక‌ట్‌ప‌ల్లిలో 20.67(2025లో 13.67 మీట‌ర్లు) మీట‌ర్ల‌కు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటాయి. ఆ త‌ర్వాత హ‌య‌త్ న‌గ‌ర్‌లో 19.46 మీట‌ర్లు(2025లో 4.73 మీట‌ర్లు), శంక‌ర్‌ప‌ల్లిలో 19.25 మీట‌ర్లు(2025లో 11.67 మీట‌ర్లు), మేడిప‌ల్లిలో 18.23 మీట‌ర్లు(2025లో 9.26 మీట‌ర్లు), మ‌ల్కాజ్‌గిరిలో 17.11 మీట‌ర్ల లోతు వ‌ర‌కు భూగ‌ర్భ‌జ‌లాలు చేరాయి. అదే సమయంలో అత్యంత మెరుగైన భూగర్భ జలమట్టాలు షేక్‌పేటలో 1.87 మీటర్లు, హిమాయత్‌నగర్‌లో 2.90 మీటర్లు, అమీన్‌పూర్‌లో 3 మీటర్లుగా నమోదయ్యాయి.

ప‌లు మండ‌లాల్లో భూగ‌ర్భ జ‌లమ‌ట్టాలు ఇలా..

కూక‌ట్‌ప‌ల్లి - 20.67 మీట‌ర్లు (2025లో 13.67 మీట‌ర్లు)
హ‌య‌త్ న‌గ‌ర్ - 19.46 మీట‌ర్లు (2025లో 4.73 మీట‌ర్లు)
శంక‌ర్‌ప‌ల్లి - 19.25 మీట‌ర్లు (2025లో 11.67 మీట‌ర్లు)
మేడిప‌ల్లి - 18.23 మీట‌ర్లు (2025లో 9.26 మీట‌ర్లు)
అమీర్‌పేట - 16.79 మీట‌ర్లు (2025లో 9.65 మీట‌ర్లు)
కుత్బుల్లాపూర్ - 16.09 మీట‌ర్లు (2025లో 6.19 మీట‌ర్లు)
ప‌టాన్‌చెరు - 15.11 మీట‌ర్లు (2025లో 8.83 మీట‌ర్లు)
ఉప్ప‌ల్ - 14.85 మీట‌ర్లు (2025లో 6.13 మీట‌ర్లు)
గండి మైస‌మ్మ - 14.44 మీట‌ర్లు (2025లో 7.78 మీట‌ర్లు)

85 శాతం ఇంకుడు గుంతలు పనిచేయడం లేదు

రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్‌ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల ఏర్పాటుపై చూపిస్తున్న శ్రద్ధ, వాటి నిర్వహణపై చూపించడం లేదన్నారు. దీంతో ఇంకుడు గుంత‌లు నిరుపయోగంగా మారుతున్నాయని పేర్కొన్నారు. కొండాపూర్‌లో తాము చేసిన సర్వేలో 85 శాతం ఇంకుడు గుంతలు పనిచేయడం లేదని తేలింది. పూడిక తీయ‌క‌పోవ‌డం కూడా కార‌ణ‌మ‌న్నారు. అలాగే, బండరాళ్లపై గుంతలు తవ్వితే నీరు పైపైన ఉన్న భూగర్భ పొరల్లోకి చేరుతుందే తప్ప, మనం బోర్‌వెల్స్ ద్వారా నీటిని తోడే లోతైన పొరల్లోకి వెళ్లదని క‌ల్ప‌నా ర‌మేశ్‌ వివరించారు.

తాగునీటి అవ‌స‌రాల‌కే బోర్ వెల్స్‌

రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయని, నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. నగరంలో నిర్మాణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాల కోసం కొత్త బోర్‌వెల్స్ తవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న బోర్‌వెల్స్‌ను కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే మరింత లోతుగా తవ్వుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement