త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi Donald Tusk Meeting | భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!

డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్ రంగాల్లో భారత్, పోలాండ్ కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని మోదీని ప్రపంచానికే 'ఆశాకిరణం' అని కొనియాడిన టస్క్.

J

National | Published On Oct 22, 2026, 2.46 pm IST

PM Modi Donald Tusk Meeting | భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!

సంక్షిప్త సారాంశం

న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ రంగాల్లో భారత్‌తో కలిసి 'కో-డెవలప్‌మెంట్, కో-ప్రొడక్షన్' చేసేందుకు పోలాండ్ కంపెనీలను మోదీ ఆహ్వానించారు. 2030 నాటికి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 'భారత్-పోలాండ్ స్టార్టప్ బ్రిడ్జ్' ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ప్రపంచ అనిశ్చితి వేళ ప్రధాని మోదీ అందరికీ ఒక 'ఆశాకిరణం' (Beacon of Hope) అని, ఆయనను మిత్రుడిగా పిలుచుకోవడం గర్వంగా ఉందని డొనాల్డ్ టస్క్ ప్రశంసించారు.

Advertisement
  • డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్ రంగాల్లో భారత్-పోలాండ్ కీలక ఒప్పందాలు
  • ప్రధాని మోదీని 'ఆశాకిరణం'గా అభివర్ణించిన డొనాల్డ్ టస్క్

PM Modi Donald Tusk Meeting | త్రినేత్ర న్యూస్ : భారత్, పోలాండ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (Strategic Partnership) సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి వచ్చిన పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో (Donald Tusk) ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ (రక్షణ), స్పేస్ (అంతరిక్షం), న్యూక్లియర్ ఎనర్జీ (అణుశక్తి), ఐటీ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

PM Modi and Polish PM Donald Tusk Boost Ties in Defence, Space Nuclear Energy Aim to Double Trade by 2030

'మోదీ మా అందరికీ ఒక ఆశాకిరణం'

మీడియా సమావేశంలో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, అస్థిరత నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్ వంటి శక్తిమంతమైన దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని మోదీ మా అందరికీ ఒక ఆశాకిరణం (Beacon of Hope). మిమ్మల్ని నా స్నేహితుడిగా పిలుచుకోవడం నాకు నిజంగా ఎంతో గర్వంగా ఉంది' అని టస్క్ వ్యాఖ్యానించారు.

గత 35 ఏళ్లలో భారత్, పోలాండ్ సాధించిన ఆర్థిక ప్రగతిని చూసి ప్రపంచం అసూయపడుతోందని టస్క్ అన్నారు. భారత్ అనుసరించిన 'అహింసా' సిద్ధాంతం నుంచే పోలాండ్‌లోని ప్రఖ్యాత 'సాలిడారిటీ ఉద్యమం' స్ఫూర్తి పొందిందని ఆయన గుర్తుచేశారు.

PM Modi and Polish PM Donald Tusk Boost Ties in Defence, Space Nuclear Energy Aim to Double Trade by 2030

డిఫెన్స్, స్పేస్ రంగాల్లో 'కో-ప్రొడక్షన్'

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వ్యూహాత్మక రంగాల్లో భారత్‌తో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి (Co-development), ఉత్పత్తి (Co-production) చేసేందుకు పోలాండ్ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు), కోల్ గ్యాసిఫికేషన్ రంగాల్లో పోలాండ్ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని కొత్త భాగస్వామ్యాలను నిర్మిస్తామన్నారు.

2030 నాటికి వాణిజ్యం రెట్టింపు.. EU-India FTAతో కొత్త అవకాశాలు

గత ఏడాది పోలాండ్ జీడీపీ (GDP) ఒక ట్రిలియన్ డాలర్ల చారిత్రక మైలురాయిని దాటడంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మరోవైపు గత త్రైమాసికంలో భారత్ 7.8% అద్భుత వృద్ధిని నమోదు చేసిందని గుర్తుచేశారు.

  • భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) అమల్లోకి రావడంతో భారత్ నుంచి పోలాండ్‌కు మెషినరీ, కెమికల్స్, ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులకు భారీ అవకాశాలు లభిస్తాయి.
  • రైల్వేస్, మొబిలిటీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోటెక్ రంగాల్లో పోలాండ్ నుంచి భారత్‌కు కొత్త పెట్టుబడులు రానున్నాయి.
  • 2030 నాటికి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే (సుమారు 6 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు పైగా) లక్ష్యంగా పెట్టుకున్నారు.

'స్టార్టప్ బ్రిడ్జ్', టెక్నాలజీ హ్యాకథాన్

ఐటీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇరు దేశాల మధ్య ఇప్పటికే బలమైన బంధం ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ 'భారత్-పోలాండ్ స్టార్టప్ బ్రిడ్జ్' (Startup Bridge) ఏర్పాటుకు ఇరువురు నేతలు అంగీకరించారు. అలాగే ఇరు దేశాల యువత కోసం 'టెక్నాలజీ హ్యాకథాన్' నిర్వహించనున్నారు. దీనివల్ల ఏఐ (AI), సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్ రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఢిల్లీ పర్యటన అనంతరం టస్క్ శుక్రవారం బెంగళూరులో ఐటీ, స్పేస్ రంగ దిగ్గజాలతో సమావేశం కానున్నారు.

'గుడ్ మహారాజా' నుంచి ఆపరేషన్ గంగ వరకు.. మానవత్వపు బంధం

భారత్, పోలాండ్ స్నేహం కేవలం దౌత్య సంబంధాలపైనే కాకుండా మానవత్వం, సానుభూతి అనే పునాదులపై ఆధారపడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జామ్‌నగర్, కొల్హాపూర్ రాజకుటుంబాలు వేలాది మంది పోలాండ్ చిన్నారులకు, కుటుంబాలకు భారత్‌లో ఆశ్రయం కల్పించాయని గుర్తుచేశారు. అందుకే నేటికీ పోలాండ్ ప్రజలు జామ్ సాహెబ్‌ను ఎంతో గౌరవంగా 'దోబ్రీ మహారాజా' (మంచి మహారాజా) అని పిలుచుకుంటారని తెలిపారు.

PM Modi and Polish PM Donald Tusk Boost Ties in Defence, Space Nuclear Energy Aim to Double Trade by 2030

అదే స్ఫూర్తితో 2022లో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో పోలాండ్ అందించిన సహకారాన్ని మోదీ కొనియాడారు. పోలాండ్‌లోని క్రాకో (Krakow) నగరంలో 'ఇండియన్ స్టడీస్ ఛైర్' ఏర్పాటు చేశామని, జామ్ సాహెబ్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఇరు దేశాల యువత మధ్య బంధం బలపడుతోందని చెప్పారు.

ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతికి భారత్ మద్దతు

ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయ పాలనా సంస్థల్లో (Global Governance Institutions) సంస్కరణలు అత్యవసరమని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 'అది ఉక్రెయిన్ అయినా లేదా పశ్చిమాసియా అయినా.. శాంతి స్థాపన దిశగా జరిగే ప్రతి సార్థకమైన ప్రయత్నానికీ భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది' అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement