త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Golconda Bonalu 2026 | గోల్కొండ జగదాంబిక బోనాలు.. పోలీసుల స్మార్ట్ ట్రాఫిక్ ప్లాన్‌

Golconda Bonalu 2026 | నగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపే గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 13 వరకు దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ వేడుకల కోసం భాగ్యనగరం సిద్ధమైంది.

P

Hyderabad | Published On Jul 21, 2026, 4.06 pm IST

Golconda Bonalu 2026 | గోల్కొండ జగదాంబిక బోనాలు.. పోలీసుల స్మార్ట్ ట్రాఫిక్ ప్లాన్‌
Advertisement
  • ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ సర్వేలెన్స్
  • సీపీ ఆదేశాల మేర‌కు ఏర్పాటు చేసిన పోలీసులు

Golconda Bonalu 2026 | నగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపే గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 13 వరకు దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ వేడుకల కోసం భాగ్యనగరం సిద్ధమైంది. అయితే, ఈసారి కోట పరిసరాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భాగ్యనగర్ ట్రాఫిక్ పోలీసులు స‌రికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గోల్కొండ బోనాల చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా తొలిసారిగా డ్రోన్ సర్వేలెన్స్‌ను వినియోగిస్తున్నారు. డ్రోన్ల స‌హాయంతో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని ప‌రిశీలిస్తూ.. ఎక్కడైనా ర‌ద్దీ ఉంటే వెంట‌నే సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేస్తూ ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్నారు.

నెల రోజుల పాటు సాగే బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తులు, వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ కమిషనర్ వీసీ స‌జ్జ‌నార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ పర్యవేక్షణలో డీసీపీ కాజల్, ఏసీపీ ధనలక్ష్మి బందోబస్తు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు కేంద్రాలు, కోటకు వెళ్లే రహదారులు, భక్తులు ఎక్కువగా గుమికూడే ప్రాంతాలపై నిరంతర నిఘా వేస్తున్నారు. ముందుగా ప్రకటించిన ట్రాఫిక్ డైవర్షన్లు సక్రమంగా అమలవుతున్నాయా ? లేదా అన్న విష‌యాన్ని కూడా డ్రోన్ల ద్వారానే ప‌రిశీలిస్తున్నారు.

ప్ర‌స్తుతం ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డంతో పాటు పార్కింగ్ నిర్వహణలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోట సమీపంలోని కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాల రద్దీని అంచనా వేయడం, అనధికార పార్కింగ్‌ను అరికట్టడం, ఖాళీగా ఉన్న పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి భక్తులకు సూచించడం వంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో పార్కింగ్ సమస్యలు తగ్గడంతో పాటు వాహనాల రాకపోకలు కూడా వేగంగా సాగుతున్నాయి. ఆధునిక సాంకేతికతను ట్రాఫిక్ నిర్వహణలో వినియోగించడం వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులపై స్పష్టమైన అవగాహన లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. బోనాల సందర్భంగా భక్తులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా, సజావుగా రాక‌పోక‌లు సాగించ‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement