త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fish Medicine | ఎల్లుండే చేప ప్ర‌సాదం పంపిణీ.. ఏర్పాట్ల‌లో బ‌త్తిని కుటుంబం

Fish Medicine | ఏటా పంపిణీ చేసే మాదిరిగానే ఈసారి కూడా ఆస్త‌మా రోగుల‌కు చేప ప్ర‌సాదం పంపిణీ చేయ‌నున్నారు. ఇందుకు బ‌త్తిని కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 8న రాత్రి 9 గంట‌ల నుంచి ఈ చేప ప్ర‌సాదం అందించ‌నున్నారు. మ‌రుస‌టి రోజు రాత్రి వ‌ర‌కు ఇది కొన‌సాగుతుంద‌ని బ‌త్తిని గౌరీశంక‌ర్ గౌడ్ తెలిపారు.

S

Hyderabad | Published On Jun 6, 2026, 12.12 pm IST

Fish Medicine | ఎల్లుండే చేప ప్ర‌సాదం పంపిణీ.. ఏర్పాట్ల‌లో బ‌త్తిని కుటుంబం
Advertisement

Fish Medicine | త్రినేత్ర‌.న్యూస్‌: ఏటా పంపిణీ చేసే మాదిరిగానే ఈసారి కూడా ఆస్త‌మా రోగుల‌కు చేప ప్ర‌సాదం పంపిణీ చేయ‌నున్నారు. ఇందుకు బ‌త్తిని కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మృగ‌శిర కార్తె సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ఈనెల 8న రాత్రి 9 గంట‌ల నుంచి ఈ చేప ప్ర‌సాదం అందించ‌నున్నారు. మ‌రుస‌టి రోజు రాత్రి వ‌ర‌కు ఇది కొన‌సాగుతుంద‌ని బ‌త్తిని గౌరీశంక‌ర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉద‌యం దూద్‌బౌలిలోని బ‌త్తిని ఇంటిలో స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తం, బావి పూజ త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ముందుగా త‌మ కుటుంబ స‌భ్యులు చేప ప్ర‌సాదాన్ని తీసుకున్న త‌ర్వాత నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ మైదానంలో పంపిణీ ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు.

బావి నీటితో త‌యారీ..

ఈ చేప ప్రసాదం పంపిణీకి 179 ఏళ్ల చరిత్ర ఉంది. ఏటా పాతబస్తీ దూద్‌బౌలిలోని వారి ఇంటిలో ప్రత్యేక పూజలు చేసిన త‌ర్వాత ఇక్కడి బావి నీటితో చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలోనే చేప ప్ర‌సాదం పంపిణీ చేయ‌గా వివిధ కారణాలతో అక్క‌డ వేయ‌డం ఆపేశారు. 2013 నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే కొనసాగిస్తూ వ‌స్తున్నారు.

చేప మందు నుంచి ప్ర‌సాదంగా..

మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన ఈ చేప ప్రసాదం ప్రస్తుతం 5 క్వింటాళ్లకు చేరిందని అనిరుధ్‌ గౌడ్‌ తెలిపారు. మొద‌ట‌గా చేప మందుగా ప్రాచుర్యం పొంద‌గా కాల‌క్ర‌మేణా చేప ప్రసాదంగా మారిందని.. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం తమ వద్దకు వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

45 రోజులు వాడాలి..

చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు ఇలా ఈ చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదాలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజుల్లో కార్తె మందును వాడుకోవాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు. అయితే చేపతో తీసుకునే ప్రసాదమే మేల‌ని ప‌లువురు న‌గ‌ర‌వాసులు చెబుతున్నారు. ఈ చేప‌ ప్రసాదం తీసుకునే ముందు రెండు గంటల పాటు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా తీసుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ప్రసాదం తీసుకున్న త‌ర్వాత కూడా గంటన్నర వరకు ఏమీ తినొద్ద‌ని అంటున్నారు.

మూడేళ్ల పాటు వేసుకుంటే..

వర్షాకాలం ప్రారంభంలో వాతావరణంలో తేమ పెరిగి, శ్వాస సంబంధిత వ్యాధులు విజృంభిస్తాయి. ఈ వ్యాధుల బారిన పడ‌కుండా ఉండ‌డానికి చిన్న ప్రాణంతో ఉన్న‌ చేప నోటిలో మూలికా పేస్ట్‌ను ఉంచి రోగి గొంతులో వేస్తారు. చేప కడుపులోకి వెళ్లేటప్పుడు అది గొంతును శుభ్రపరుస్తూ, మందును శరీరంలో వేగంగా కలపడానికి సహాయపడుతుందని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. దీన్ని మూడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆస్తమా శాశ్వతంగా నయమవుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం కూడా.

 

Advertisement
Advertisement