త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha| ప్రాణం పోయినా ఇంచు భూమిని కూడా దోపిడీ కానివ్వం

Kavitha | ప్రాణం పోయినా తెలంగాణలో ఇంచు భూమిని దోపిడీ కానివ్వ‌మ‌ని.. తెలంగాణ వనరులు, సంస్కృతి, అస్తిత్వం కాపాడేందుకే తాము పార్టీ పెట్టామ‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం బడా బాబులకు కట్టబెడుతోందని ఆరోపించారు.

S

Telangana | Published On Jun 6, 2026, 1.19 pm IST

Kavitha| ప్రాణం పోయినా ఇంచు భూమిని కూడా దోపిడీ కానివ్వం
Advertisement
  • తెలంగాణ వ‌న‌రులు, సంస్కృతిని కాపాడేందుకే పార్టీ పెట్టాం
  • నాదర్‌గుల్‌లో ఉన్న 200 ఎక‌రాలు ఉద్య‌మ‌కారుల‌కు ఇవ్వాలి
  • ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ప‌దెక‌రాల భూమి ఇచ్చేయాలి
  • భూ దోపిడీకి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే రేవంత్ తలుపులు తెరిచాడు
  • రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిలో హైడ్రా చిన్న పాయ మాత్రమే
  • శ్రీ ఆదిత్య బిల్డ‌ర్స్ మూసీపై మ‌ర‌క‌లా ఉంది
  • కాంగ్రెస్‌కు ఇదే ఆఖ‌రు స‌ర్కార్‌
  • ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి
  • మీడియా స‌మావేశంలో టీఆర్ఎస్ చీఫ్ క‌విత ధ్వ‌జం

Kavitha| త్రినేత్ర‌.న్యూస్‌: ప్రాణం పోయినా తెలంగాణలో ఇంచు భూమిని దోపిడీ కానివ్వ‌మ‌ని.. తెలంగాణ వనరులు, సంస్కృతి, అస్తిత్వం కాపాడేందుకే తాము పార్టీ పెట్టామ‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందా చేస్తున్నారని.. వాటిని పూర్తి ఆధారాలతో బయటపెట్టబోతున్నామ‌ని హెచ్చ‌రించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. రూ.లక్ష కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం బడా బాబులకు కట్టబెడుతోందని ఆరోపించారు.

ప్రేమావ‌తిపేట పెద్ద చెరువు క‌బ్జా అయింది..

శ్రీ ఆదిత్య బిల్డర్స్ వెనుక ఒక ఎంపీ ఉన్నాడు. ఆయన పేరు తర్వలోనే బయటపెడుతా. ఇది మూసీ మీద మ‌ర‌క‌లాగా ఉంది. త‌క్ష‌ణ‌మే ఆ ప‌నులు ఆపాలి. రివ‌ర్ బెడ్‌లోనే ఆ ప్రాజెక్ట్ క‌డుతున్న‌రు. క‌చ్చితంగా దాన్ని ఆపాలే. సెలెక్టివ్‌గా పెద్ద‌వాళ్ల‌ను ఒదిలేసి పేదోళ్ల మీద ప‌డుతుంది ఈ స‌ర్కారు. ప్రేమావతి పేట పెద్ద చెరువు కు సంబంధించిన ఇమేజ్ ఇది. ఇక్కడ 2021లో బీఆర్ఎస్ హ‌యాంలోనే దీనికి పర్మిషన్ ఇచ్చారు. చెరువులో ఏడు ఎకరాలను కబ్జా చేశారు. 2023 నాటికి మరింత చొచ్చుకువచ్చారు. హైడ్రాకు సవాల్ చేస్తున్నా. ఆ సంస్థను ముట్టుకునే దమ్ముందా? ఏడు ఎకరాలు అంటే ఏడు వంద కోట్ల విలువైన భూమి, దాని పైన 30 అంతస్తుల భవనం అంటే వేల ఎకరాల వ్యాపారం చేస్తున్నారు. మేము దీని మీద కచ్చితంగా ఆధారాలతో సహా ఫిర్యాదు కూడా చేస్తాం అని క‌విత హెచ్చ‌రించారు.

బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్న‌రు..

సీఎం సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారు. వాళ్ల భూదందాలను వరుసగా ఆధారాలతో సహా బయటపెడతా. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్. 20 ఏళ్లు ఆ పార్టీని బొందపెట్టే పనులను రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు భూ దోపిడీకి కిటికీలు తెరిస్తే రేవంత్ రెడ్డి తలుపు తెరిచాడు. ప్రాణం పోయినా సరే తెలంగాణలో ఇంచు భూమిని దోపిడీ చేయనివ్వం అని టీఆర్ఎస్ చీఫ్ స్ప‌ష్టం చేశారు.

సుప్రీంకోర్టుకు వెళ్లైనా కొట్లాడ‌తాం..

తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా లీగల్ ఫైట్ చేస్తాం. తెలంగాణ నెక్ట్స్ జనరేషన్ కోసం ప్రభుత్వ పెద్ద కోరల నుంచి భూములను కాపాడుతాం. అప్పులు పుట్టడం లేదంటూ ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ అవసరాలకు భూమి ఎట్ల? అని ఆమె ప్ర‌శ్నించారు.

నిన్న కూక‌ట్‌ప‌ల్లిలో ఖాళీ చేయించారు..

హైడ్రా అనే సంస్థ కూకట్‌ప‌ల్లిలోని మంజీర కాలనీకి నిన్న కూడా వెళ్లి పేదల భూములను ఖాళీ చేయించింది. అదే మూసీకి మరకగా మారిన, రివర్ బెడ్ లోనే కడుతున్న శ్రీ ఆదిత్య బిల్డింగ్ ను మాత్రం టచ్ చేయటం లేదు. గతంలో మేం ఆ బిల్డింగ్ వద్ద ధర్నా చేస్తే హైడ్రా వాళ్లు మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ మేము ఆధారాలు చూపించిన తర్వాత ఒక్క మాట మాట్లాడటం లేదు. ఆ బిల్డింగ్ జోలికి ఇప్పటి వరకు వెళ్లటం లేదు. అదే విధంగా అక్కడ ఉన్న గ్రామానికి సంబంధించి పాత నక్షను కూడా మార్చారు. దాంట్లో తప్పులు ఉన్నా పట్టించుకోవటం లేదు అని క‌విత మండిప‌డ్డారు.

మెగాకు చెందిన ఐకాం సంస్థ ఐదెక‌రాలు క‌బ్జా చేసింది..

ఇక మెగాకు చెందిన ఐకాం అనే ఆయుధాల తయారీ సంస్థ నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఐదు ఎకరాలు కబ్జా చేసింది. మేడి బావి, జాలు బావి చెరువుల వద్ద ఐదు ఎకరాలు కబ్జా చేశారంటూ అక్కడి మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. సర్వే నంబర్ 59లో ఈ భూమి ఉంది. ఆ సంస్థపై చర్య తీసుకునే దమ్ముందా? శ్రీ ఆదిత్య వాళ్లు మూసీ గర్భంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. మూసీ గర్భశోకం ఎవరికీ మంచిది కాదు అని క‌ల్వ‌కుంట్ల‌ క‌విత పేర్కొన్నారు.

అప్పుడు కేటీఆర్ పాల‌నే ఉంది..

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆఖరి బార్. మరో 20 ఏళ్లు బొందపెట్టే విధంగా రేవంత్ రెడ్డి పనితీరు ఉంది. అప్పుడు కేటీఆర్ పాలనే ఉంది. ఇప్పుడు కేటీఆర్ పాలనే ఉంది. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు. ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అంటూ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో ఫినిక్స్ సంస్థకు బీఆర్ఎస్ 50 ఎకరాల వరకు ధారాధాత్తం చేస్తే ఇదే ముఖ్యమంత్రి అప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. కానీ అధికారంలోకి వచ్చాక మరో వంద ఎకరాలు కలిపి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని క‌విత ఆరోపించారు.

తెలంగాణ మా జాగీరే..

10 ఎకరాల శిఖం భూమి కొన్న పవన్ కళ్యాణ్ వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఆంధ్రా విష కోరల్లోంచి తెలంగాణను సాధించుకున్నాం.. కచ్చితంగా తెలంగాణ మా జాగీరే. తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా బాధపడిన పవన్ కళ్యాణ్ ఆ బాధలో ఇక్కడ భూములు కొన్నారు. కానీ అది కోడికుంట అనే చెరువులో 10 ఎకరాల శిఖం భూమినే కొన్నారు. ఆ భూమికి సంబంధించి సర్వే నంబర్ 706. ఇది శిఖం భూమియే అని ఇరిగేషన్ శాఖ నోటిఫై కూడా చేసింది. కానీ రిజిస్ట్రేషన్‌లో చాలా తప్పులు చేశారు. మూడు ఎకరాలు మాత్రమే శిఖం అని మిగతాది మాగాణి అంటూ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అంశం బయటకు వచ్చాక దీని గురించి తెలుసుకుంటే చాలా వివరాలు తెలిశాయి. శిఖం భూములు కొన్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి. రైతులకు ఇచ్చిన విధంగా ఆయనకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. శిఖం భూమి అయితే భూమి వాపస్ ఇస్తా అని మీరే చెప్పారు? వెంటనే ఆ భూమి రిటర్న్ ఇచ్చేయాలి అని క‌విత డిమాండ్ చేశారు.

గ‌ద్ద‌ర‌న్న‌ను అవ‌మానించారు..

ఇక తెలంగాణ అంటే దాన్ని ప్రాంతీయ వాద ఉగ్రవాదం అంటున్నారు. మా మేధావులు, కళాకారులను అవమానిస్తున్నారు. మీ సినిమాలకు వచ్చే ఇన్‌క‌మ్‌లో నైజాం నుంచే ఎక్కువగా వస్తుంది. మీరు కొనుక్కునే భూములు, కార్లు కూడా మా తెలంగాణ ప్రజల కొన్న టికెట్ల ద్వారా వచ్చినవే. కానీ మీరు గద్దరన్నకు కారు కొనిచ్చానని చెబుతూ ఆయనను అవమానించారు. మీరు కళాకారుడిగా ఉంటూ మరొక కళాకారుడిని అవమానిస్తారా? కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వద్దని అంటారు. కానీ ఎప్పుడో కొని ఇచ్చిన కారు గురించి ఇప్పుడు చెబుతారా? అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మీ రాజ‌కీయం ఇక్క‌డ ఎందుకు?

జానపద కళాకారుల ట్యూన్స్ వాడుకొని వాళ్లకు రాయల్టీ ఇచ్చారా? చిన్న కళాకారులను ఆదుకున్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమైక్యవాదుల‌ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రా విష కోరల్లో నుంచి తెలంగాణ సాధించుకున్నాం. కచ్చితంగా తెలంగాణ మా జాగీరే. రాజ్యాంగపరంగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. కానీ నైతికత అనేది ఉంటుంది. మా హక్కులు, వనరులను దోచుకున్న మీ మీద పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే మళ్లీ మీ రాజకీయం ఇక్కడ ఎందుకు? అని ప్ర‌శ్నించారు.

వ‌న్‌సైడ్ ల‌వ్ అంటూ యాసిడ్ పోస్తామంటే ఎలా?

మేము వద్దంటే వన్‌సైడ్ లవ్ అంటూ బలవంతం చేస్తూ యాసిడ్ పోస్తామంటే ఎలా? ముందు ఆంధ్రా ప్రజలకు మేలు చేయండి. మేము మా పాలన మేం చేసుకోగలం. బీజేపీకి ఇక్కడ లీడర్ లేక పవన్ కళ్యాణ్‌తో రెండు ఓట్లు తెచ్చుకుందామనుకుంటుంది. పంజాబ్‌లో మొత్తం ధాన్యం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం ఎందుకు పరిమితులు విధిస్తోంది. దానిపై బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు? వచ్చే సరి ఎనిమిది మంది కాదు కదా ఒక్క ఎంపీ కూడా గెలవరు?

ప‌ని చేస్తున్న‌ట్లు న‌టిస్తుండు..

పాలమూరు బిడ్డ అయి ఉండి ఈ ముఖ్యమంత్రి 30 నెలలుగా పాలమూరు ప్రాజెక్ట్ పై రివ్యూ చేయలేదు? మేం వెంటబడి ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఫస్ట్ టైమ్ రివ్యూ చేశారు. కానీ ఆంధ్రాకు 260 టీఎంసీలు నీళ్లు తీసుకోండి అని చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రికి నీటి మీద అవగాహన లేదు. ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. గతంలో తుమ్మడిహెట్టిని అంగీకరించని మహారాష్ట్ర సీఎం వద్దకు వెళ్లి ఏదో చేస్తున్నాననే భ్రమలు కల్పిస్తున్నారు. పని చేస్తున్నట్లు నటిస్తున్నాడు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న తన గురువైన ముఖ్యమంత్రిని మాత్రం కలవటం లేదు అని ఆమె ఫైర‌య్యారు.

ఉద్య‌మ‌కారుల‌కు భూములివ్వాలి..

చంద్రబాబు నాయుడిని కలిసి 200 టీఎంసీలు మనకు కావాలని అడగాలి. బనకచర్లకు మీరు అంగీకరిస్తే మనకు నీటి ద్రోహం చేసినట్లే. భవిష్యత్ లో మనకు కృష్ణా నీళ్లు సరిపోవు. కాబ‌ట్టి గోదావరిలో 200 టీఎంసీలు నీళ్లు కావాలని అడగాలి. లేదంటే తెలంగాణకు నీటి విషయంలో ద్రోహం చేసినవాళ్లవుతారు. ఉద్యమకారులను గుర్తించే అఖిలపక్ష సమావేశానికి మమ్మల్ని పిలవకపోవటాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. ఉద్యమకారులకు కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. దాని కోసం ఉప్పల్ భగాయత్ లో వచ్చే నెల పోరాటం చేయబోతున్నాం. నాదర్‌గుల్‌లో ఉన్న 200 ఎకరాల భూమిని కూడా ఉద్యమకారులకు ఇవ్వాలి అని టీఆర్ఎస్ చీఫ్ క‌విత డిమాండ్ చేశారు.

 

Advertisement
Advertisement