లోడ్ అవుతోంది...


మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మార్ఫింగ్ కేసులను విచారించడానికి డీజీపీ 'సిట్' ఏర్పాటు చేశారు. సీపీ వీసీ సజ్జనర్ పర్యవేక్షణలో ఎన్. శ్వేత నేతృత్వంలోని ఈ బృందం ఎన్టీవీ, ఇతర యూట్యూబ్ ఛానెళ్లపై దర్యాప్తు చేయనుంది.
Special Investigation Team(SIT) | తెలంగాణలో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యక్తిత్వ హననం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంలో తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుల సమగ్ర విచారణ కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (V.C. Sajjanar, IPS) ఈ సిట్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఉత్తర మండలం జాయింట్ సీపీ ఎన్.శ్వేత (N.Swetha, IPS) ఈ బృందానికి ఓవరాల్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. బృందంలో ఇతర కీలక సభ్యులుగా యోగేష్ గౌతమ్ (DCP), వెంకట లక్ష్మి (DCP), అరవింద బాబు (DCP, సైబర్ క్రైమ్స్) నియమితులయ్యారు.

జనవరి 8న ఎన్టీవీ (NTV) ఛానెల్‌లో ఒక మహిళా ఐఏఎస్ అధికారికి, ఒక రాజకీయ నాయకుడికి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు నిరాధారమైన వార్తలు ప్రసారం చేశారని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది.
సదరు అధికారి గతంలో పనిచేసిన ప్రాంతాలను ప్రస్తావిస్తూ ఆమె గుర్తింపును బహిర్గతం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసిన తెలుగు స్క్రైబ్ (Telugu Scribe), ప్రైమ్ 9 (Prime9), టీ న్యూస్ (TNews) సహా మొత్తం 9 డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై కేసులు నమోదయ్యాయి.
ఈ సిట్ కేవలం ఐఏఎస్ కేసునే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన కేసును (Cr.No. 11/2026) కూడా విచారించనుంది. నారాయణపేట జిల్లాలో నమోదైన ఈ కేసులో నిందితుడు కావలి వెంకటేశ్‌పై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam