త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

బి-ఫామ్‌తో దానం బుక్‌.. కండువా ఎమ్మెల్యేల సంగతేంటి?

దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం మళ్లీ వేడెక్కింది. మరి ఇదే తీర్పు మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలకూ వర్తిస్తుందా? అందరికీ ఒకే తీర్పు కాకపోయినా.. ఎదురయ్యేది మాత్రం ఒకే న్యాయ పరీక్ష!

S

Hyderabad | Published On Sep 19, 2026, 7.23 pm IST

బి-ఫామ్‌తో దానం బుక్‌.. కండువా ఎమ్మెల్యేల సంగతేంటి?

సంక్షిప్త సారాంశం

కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడమే దానం కేసులో బలమైన ఆధారంగా నిలిచింది. మిగతా ఎమ్మెల్యేల భవిష్యత్తును వారి ప్రకటనలు, పత్రాలు, రాజకీయ ప్రవర్తనే నిర్ణయించనున్నాయి. దానం వికెట్‌ పడింది.. ఇక ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎవరి వంతన్నదే ఉత్కంఠ!

Advertisement

        దానం తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు.. అందరికీ అనర్హత తప్పదా?

 

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ వేసిన 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఆయన అనర్హుడని కోర్టు తేల్చింది. తీర్పును నిలిపివేయాలన్న అభ్యర్థనను కూడా అంగీకరించలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని దానం ప్రకటించడంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికపై చర్చ మొదలైంది.

మరి దానం తీర్పు మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ వర్తిస్తుందా? వారిపైనా అనర్హత వేటు పడుతుందా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్నలివే. న్యాయపరంగా చూస్తే దానం కేసులో వచ్చిన ఉత్తర్వులు ఆయనకు మాత్రమే నేరుగా వర్తిస్తాయి. మిగతా ఎమ్మెల్యేలు వెంటనే అనర్హులు కారు. అయితే వారి కేసుల్లోనూ ఇదే న్యాయసూత్రం కీలకం కానుంది.

దానం కేసులో బలమైన ఆధారాలు

మిగతా ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్‌ కేసు భిన్నమైనది. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్‌ నుంచి గెలిచారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన బి-ఫామ్‌, నామినేషన్‌ పత్రాలు, ఎన్నికల అఫిడవిట్‌, అభ్యర్థుల తుది జాబితా వంటి అధికారిక రికార్డులు కోర్టు ముందున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారా లేదా అనే విషయంలో ఎలాంటి వివాదానికి అవకాశం లేకుండా పోయింది. ఇది కేవలం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ నేతలతో వేదిక పంచుకోవడం వంటి వ్యవహారం కాదు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూనే మరో పార్టీ అధికారిక అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం. అందుకే దానం కేసులోని ఆధారాలు బలంగా నిలిచాయి.

రాజీనామా చేయకపోయినా అనర్హతేనా?

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ పేరా 2(1)(ఎ) ప్రకారం ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే అనర్హతకు గురవుతారు. అయితే పార్టీకి లిఖితపూర్వకంగా రాజీనామా చేస్తేనే సభ్యత్వాన్ని వదులుకున్నట్లు కాదు. ఎమ్మెల్యే మాటలు, చర్యలు, రాజకీయంగా వ్యవహరించిన తీరును బట్టి కూడా పార్టీని వీడినట్లు నిర్ణయించవచ్చు. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని హైకోర్టు ఇదే కోణంలో చూసింది. కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన రోజునే ఆయన బీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు తేల్చింది. అందుకే 2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

స్పీకర్‌ నిర్ణయాన్ని ఎందుకు కొట్టివేసింది?

దానం నాగేందర్‌పై వచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్‌ గతంలో కొట్టివేశారు. సభ వెలుపల ఎమ్మెల్యే చేసిన రాజకీయ కార్యకలాపాలను ఆధారంగా చేసుకొని అనర్హతను నిర్ణయించలేమని అభిప్రాయపడ్డారు. దానం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయకపోవడం, ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకోకపోవడం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. హైకోర్టు ఈ అభిప్రాయాన్ని అంగీకరించలేదు. ఎమ్మెల్యే సభలో ఎలా ఓటు వేశారన్నది మాత్రమే కాదు.. సభ వెలుపల ఆయన రాజకీయంగా ఎలా వ్యవహరించారన్నదీ ముఖ్యమేనని స్పష్టం చేసింది. మరో పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ పార్టీతో బహిరంగంగా కలిసి పనిచేయడం వంటి చర్యలనూ పరిశీలించవచ్చని తేల్చింది. పార్టీ విప్‌ను ఉల్లంఘించడం వేరు.. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం వేరు. దానం కేసు విప్‌ ఉల్లంఘనకు సంబంధించినది కాదు. ఆయన బీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని తన చర్యల ద్వారా వదులుకున్నారా లేదా అనేదే ప్రధాన అంశం.

పాత తీర్పులే దానం కేసుకు ఆధారం

సభ్యుడు రాజీనామా చేయకపోయినా, ఆయన ప్రవర్తనను బట్టి పార్టీని వదులుకున్నట్లు నిర్ణయించవచ్చనే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. రవి ఎస్‌. నాయక్‌, మహాచంద్ర ప్రసాద్‌ సింగ్‌ తదితర కేసుల్లో ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. ఆ తీర్పుల్లో చెప్పిన సూత్రాన్నే తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్‌ కేసుకు వర్తింపజేసింది. అందువల్ల ఇది కొత్త న్యాయసూత్రం కాదు. అయితే తెలంగాణలో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఎమ్మెల్యేల కేసులకు ఈ తీర్పు కీలకంగా మారనుంది.

మిగతా తొమ్మిది మంది పరిస్థితి ఏంటి?

దానం తీర్పుతో మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వెంటనే అనర్హులు కారు. ప్రతి ఎమ్మెల్యే విషయంలో విడిగా విచారణ జరగాలి. ఎవరిపై ఎలాంటి ఆధారాలున్నాయో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వారు కాంగ్రెస్‌లో చేరినట్లు బహిరంగంగా ప్రకటించారా? కాంగ్రెస్‌ నేతగా వ్యవహరించారా? ఆ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో వరుసగా పాల్గొన్నారా? కాంగ్రెస్‌లో ఏదైనా పదవి తీసుకున్నారా? పార్టీ మారినట్లు చెప్పడానికి అధికారిక పత్రాలున్నాయా? లేక ఫొటోలు, వీడియోలు, కండువాలే ప్రధాన ఆధారాలా? అనే అంశాలు కీలకం కానున్నాయి. దానం మాదిరిగా మరో పార్టీ బి-ఫామ్‌పై ఎన్నికల్లో పోటీ చేసిన ఆధారం మిగతా ఎమ్మెల్యేల విషయంలో లేకపోవచ్చు. అందువల్ల వారి కేసులను దానం కేసుతో పూర్తిగా సమానంగా చూడలేం. అదే సమయంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదనే ఒక్క కారణంతో వారు అనర్హత నుంచి తప్పించుకుంటారని కూడా చెప్పలేం.

కండువా కప్పుకుంటే సభ్యత్వం పోతుందా?

మరో పార్టీ కండువా కప్పుకోవడం లేదా ఆ పార్టీ నేతలతో ఒక్కసారి వేదికపై కనిపించడం మాత్రమే అనర్హతకు సరిపోతుందని చెప్పలేం. కానీ ఆ చర్యలకు ఎలాంటి విలువ లేదనీ కొట్టిపారేయలేం. ఎమ్మెల్యే కొత్త పార్టీ కార్యక్రమాల్లో వరుసగా పాల్గొన్నారా? ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారా? తాను కొత్త పార్టీలో చేరినట్లు ప్రకటించారా? పాత పార్టీకి వ్యతిరేకంగా కొత్త పార్టీ నేతగా వ్యవహరించారా? అన్నింటినీ కలిపి చూడాల్సి ఉంటుంది. మొత్తం ప్రవర్తన పార్టీ మారినట్లు చూపితే, అధికారిక రాజీనామా లేకపోయినా అనర్హతకు అవకాశం ఉంటుంది. అందువల్ల మిగతా కేసుల్లో అసలు పోరు చట్టం మీద కంటే ఆధారాల మీదే ఎక్కువగా జరగనుంది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం

తనను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ వేసిన 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఆయనపై అనర్హత అమలవుతుందని హైకోర్టు తేల్చింది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించడంతోపాటు తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలన్న అభ్యర్థనను కూడా అంగీకరించలేదు.

ఈ తీర్పుపై స్టే  కోరుతూ దానం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినంత మాత్రాన హైకోర్టు తీర్పు అమలు ఆగిపోదు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. అప్పటివరకు దానం అనర్హత, ఖైరతాబాద్‌ స్థానం ఖాళీపై హైకోర్టు ఇచ్చిన తీర్పే అమల్లో ఉంటుంది.

దీంతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు వైపు మళ్లింది. హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే లభిస్తే ఉప ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. స్టే లభించకపోతే అసెంబ్లీ అధికారులు చేపట్టే తదుపరి చర్యలు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా ఉప ఎన్నిక ప్రక్రియ ముందుకు సాగుతుంది. దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

ఒకే తీర్పు కాదు.. ఒకే పరీక్ష

దానం నాగేందర్‌ తీర్పుతో మిగతా ఎమ్మెల్యేలపై వెంటనే వేటు పడదు. కానీ “రాజీనామా చేయలేదు కాబట్టి పార్టీ మారినట్లు కాదు”, “సభ వెలుపల చేసిన రాజకీయ చర్యలను పరిగణించకూడదు” అనే వాదనలు ఇక అంత తేలిగ్గా నిలబడకపోవచ్చు. ప్రతి ఎమ్మెల్యే విషయంలో ఉన్న పత్రాలు, బహిరంగ ప్రకటనలు, వీడియోలు, కొత్త పార్టీతో కొనసాగించిన రాజకీయ సంబంధాలే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఆధారాలు బలంగా ఉంటే అనర్హత ముప్పు పెరుగుతుంది. ఆధారాలు పరిమితంగా ఉంటే తీర్పులు వేర్వేరుగా రావచ్చు. దానం తీర్పు అందరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు. కానీ మిగతా ఎమ్మెల్యేలంతా ఎదుర్కొనాల్సింది మాత్రం ఒకే రకమైన న్యాయ పరీక్షే.

Advertisement
Advertisement