త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Assembly | ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 8 రోజులు.. 51 గంటల 52 నిమిషాలు న‌డిచిన స‌భ‌

TG Assembly | తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శాస‌న‌స‌భ‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు. సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 8 రోజులపాటు కొనసాగాయి. 51 గంటల 52 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు సాగగా.. నాలుగు బిల్లులు, మూడు ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది.

P

Telangana | Published On Sep 18, 2026, 8.53 pm IST

TG Assembly | ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 8 రోజులు.. 51 గంటల 52 నిమిషాలు న‌డిచిన స‌భ‌
Advertisement

TG Assembly | తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శాస‌న‌స‌భ‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు. సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 8 రోజులపాటు కొనసాగాయి. 51 గంటల 52 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు సాగగా.. నాలుగు బిల్లులు, మూడు ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు, నల్ల చీరలు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, దుస్తులపై ఎలాంటి రాతలు ఉండకూడదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్న తీరుపైనా బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స‌భ‌లోనూ క‌నిపించిన ప్ర‌భావం..

గేటు వద్ద జరిగిన పరిణామాల ప్రభావం సభలోనూ కనిపించింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. ఈ వ్యవహారంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభా కార్యక్రమాలకు పదేపదే ఆటంకం కలిగించడం, స్పీకర్‌ పోడియం వద్ద నిరసనలకు దిగడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సమావేశాల మిగిలిన కాలానికి సస్పెండ్‌ చేశారు. ఈ పరిణామంతో అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది.

మండ‌లిలో స‌స్పెన్ష‌న్ల వ్య‌వ‌హారం..

మరోవైపు శాసనమండలిలోనూ సస్పెన్షన్ల వ్యవహారం కొనసాగింది. స్పీకర్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో తాతా మధుసూదన్‌, నవీన్‌కుమార్‌రెడ్డిలపై చర్యలు తీసుకున్నారు. దీంతో సమావేశాల సమయంలో అసెంబ్లీతో పాటు మండలిలోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. రాజకీయ దుమారం మధ్యే ప్రభుత్వం పలు శాసన కార్యక్రమాలను పూర్తి చేసింది. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, హామీలు, రాష్ట్ర అభివృద్ధి, సాగునీరు, రైతుల సమస్యలు తదితర అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చాయి. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించగా.. మంత్రులు ఆయా అంశాలపై సమాధానాలు ఇచ్చారు.

కాళేశ్వ‌రం, 22ఏ నిషేధిత భూముల‌పై ర‌గ‌డ‌..

సమావేశాల్లో సాగునీటి అంశం కీలకంగా చర్చకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, తుమ్మిడిహెట్టి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, ప్రాజెక్టుల భద్రత, రాష్ట్రానికి దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం తన వైఖరిని వివరించింది. భూ వ్యవహారాలపైనా సభలో వాడివేడి చర్చ జరిగింది. 22ఏ నిషేధిత జాబితా, ధరణి, భూభారతి, ప్రభుత్వ భూముల ఆక్రమణలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పేదలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరంపై సభ్యులు చర్చించారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించింది.

రైస్ మిల్ల‌ర్ల స‌మ‌స్య‌పై..

రైస్‌ మిల్లర్ల సమస్య కూడా సమావేశాల సమయంలో చర్చకు వచ్చింది. మిల్లర్ల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై పెనాల్టీలు, టెండర్‌ ధాన్యం ధరలు, స్టాక్‌ వ్యత్యాసాలు, సరఫరా గడువు తదితర అంశాలపై చర్చించింది. సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. జీవో 118 బాధితుల రిజిస్ట్రేషన్ల సమస్యపైనా ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని బాధిత కాలనీలకు పూర్తి యాజమాన్య హక్కులతో రిజిస్ట్రేషన్లు కల్పించే అంశంపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించి నూతన హక్కు పత్రాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు సమావేశాల చివరి దశలోనూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. భూ వ్యవహారాలు, రైతుల సమస్యలు, హామీల అమలు, సాగునీరు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించాయి.

స‌మావేశాల‌కు తెర‌..

మొత్తంగా ఎనిమిది రోజుల పాటు సాగిన వర్షాకాల సమావేశాలు రాజకీయంగా వాడివేడిగా మారినా.. శాసనపరమైన కార్యక్రమాలు కొనసాగాయి. 51 గంటల 52 నిమిషాల పాటు సభ సమావేశమై నాలుగు బిల్లులు, మూడు ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించింది. తొలిరోజు అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత నుంచి చివరి రోజు వరకు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. శుక్రవారం సాయంత్రం స్పీకర్‌ సభను నిరవధికంగా వాయిదా వేయడంతో వర్షాకాల సమావేశాలకు తెరపడింది.

Advertisement
Advertisement