త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్‌ పాలిటిక్స్ : హరీశ్‌రావు

Harish Rao | ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. తన వ్యవసాయ భూముల పరిశీలన పేరుతో కాంగ్రెస్‌ ఎంపీల బృందం సిద్దిపేటకు రావడాన్ని తప్పుబట్టారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

P

Telangana | Published On Sep 18, 2026, 8.12 pm IST

Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్‌ పాలిటిక్స్ : హరీశ్‌రావు
Advertisement

Harish Rao | ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. తన వ్యవసాయ భూముల పరిశీలన పేరుతో కాంగ్రెస్‌ ఎంపీల బృందం సిద్దిపేటకు రావడాన్ని తప్పుబట్టారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 22ఏ నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలను చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. ఆ సమస్యను పరిష్కరించకుండా తమపై ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోనే అధికారులు సమయం లేకపోవడంతో పెద్దఎత్తున భూములను 22ఏలో చేర్చారని చెప్పారని గుర్తుచేశారు. సుమారు 30 లక్షల ఎకరాలను 22ఏలో చేర్చడంతో రైతులు భూములు అమ్ముకోలేక, రైతుబంధు, ఇతర అవసరాల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించా..

తన ఆస్తుల వివరాలను ప్రతి ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించానని హరీశ్‌రావు తెలిపారు. తన వ్యవసాయ భూమిలో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ లేదని, కనీసం బాత్రూం కూడా లేదన్నారు. భూముల కొనుగోలులో చిన్న తప్పు ఉన్నా మొత్తం 13 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చేందుకు సిద్ధమని సవాల్‌ చేశారు. 2018 నుంచి విడతల వారీగా భూమిని కొనుగోలు చేశానని, అధికారిక డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే అధికారులు సర్వే చేసి హద్దులు చూపించారని తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీల బృందాన్ని సిద్దిపేటకు స్వాగతిస్తున్నానని.. తన భూములతోపాటు 22ఏ బాధితులను, ఆగిపోయిన అభివృద్ధి పనులను చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సిద్దిపేట వెయ్యి పడకల ఆస్పత్రి పనులు 90 శాతం పూర్తయినా మిగిలిన పనులు చేపట్టలేదని, నర్సింగ్‌ కాలేజీ, రంగనాయకసాగర్‌ టూరిజం ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆరోపించారు. రోడ్ల దుస్థితి, విద్యుత్‌ సమస్యలు, రంగనాయకసాగర్‌లో నీటి కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఎంపీలకు చూపించాలనుకున్నానన్నారు. ఎంపీల పర్యటనకు భారీగా పోలీసు బందోబస్తు, డ్రోన్లు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు ఏర్పాటు చేయడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ప్రజాధనం, ప్రభుత్వ సమయం వృథా చేశారని విమర్శించారు. భూముల కొలతలు, రెవెన్యూ వ్యవహారాలపై ఎంపీలు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం రెవెన్యూ వ్యవస్థను అవమానించడమేనన్నారు.

రాష్ట్ర హక్కుల కోసం పోరాడండి..

కాంగ్రెస్‌ ఎంపీలు సిద్దిపేటలో యాత్రలు చేయడం కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడాలని హరీశ్‌రావు సూచించారు. కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టులకు గత ప్రభుత్వం అనుమతులు సాధించిందని.. వాటి అనుమతుల రద్దు అంశం కేంద్రం పరిధిలో చర్చకు వస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు, గోదావరి జలాల అంశంపై కేంద్ర జల సంఘం వద్ద పోరాడాలని అన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులు, మెట్రో ఫేజ్‌–2, పాలమూరు ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర హక్కుల కోసం కలిసి పోరాడాల్సిన సమయంలో రాజకీయ కక్షసాధింపు యాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. కేసీఆర్‌ దళితుల భూములు కబ్జా చేశారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అవి నిజం కాదని తేలితే సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆరోపణలు నిరూపితమైతే తాము రాజీనామాకు సిద్ధమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతుల సమస్యలు, రుణమాఫీ, విద్యుత్‌, సాగునీటి అంశాలపై చర్చ జరగకుండా భూ వ్యవహారాలతో డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement