త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్‌!

KTR | కేసీఆర్‌ కుటుంబానికి రూ.లక్ష కోట్ల విలువైన భూములు ఉన్నాయంటూ చేస్తున్న ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని బీఆర్‌ఎస్‌ సవాల్‌ విసిరింది. తమ కుటుంబానికి చెందిన ఆస్తులన్నీ రాసిస్తామని.. రాష్ట్రంలోని పేదల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించింది.

P

Telangana | Published On Sep 18, 2026, 8.36 pm IST

KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్‌!
Advertisement

KTR | కేసీఆర్‌ కుటుంబానికి రూ.లక్ష కోట్ల విలువైన భూములు ఉన్నాయంటూ చేస్తున్న ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే తమ కుటుంబానికి ఉన్న ప్రతి అంగుళం భూమిని రాసిస్తామని.. లేదంటే తప్పుడు ప్రచారాన్ని నిలిపివేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని పేదల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేస్తానని సీఎం ప్రకటిస్తే తమ కుటుంబ ఆస్తులన్నింటినీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో 67 ఎకరాలు మాత్రమే ఉన్నాయని రేవంత్‌రెడ్డే అసెంబ్లీలో అంగీకరించారని గుర్తుచేశారు.

గతంలో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ అంటూ చేసిన ప్రచారం బెడిసికొట్టడంతో ఇప్పుడు రూ.లక్ష కోట్ల భూములంటూ కొత్త ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. 420 హామీలు, 22ఏ భూముల సమస్య, రైతుల కరెంట్‌, యూరియా, సాగునీటి ఇబ్బందులపై సమాధానం చెప్పకుండా డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేసిందని, ఇప్పటివరకు ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబ భూముల పేరుతోనూ అదే తరహా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులు కరెంట్‌ కోతలు, యూరియా కొరత, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో భారీగా భూములను చేర్చడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ప్రభుత్వం అసెంబ్లీని అసత్య ఆరోపణలకు వేదికగా మార్చిందని కేటీఆర్‌ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెట్టి ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి రూ.లక్ష కోట్ల భూములు ఉన్నాయన్న ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement