KTR Pebberu Rally Speech | పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే స్థానిక రైతుల నోట్లో మట్టి కొడుతున్న రేవంత్
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, ఎండిపోతున్న పంటలపై పెబ్బేరు ర్యాలీలో కేటీఆర్ నిప్పులు చెరిగారు. కృష్ణా జలాల దోపిడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంక్షిప్త సారాంశం
వనపర్తి జిల్లా పెబ్బేరు సబ్ స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ రైతు ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు 10-12 సార్లు కరెంట్ పోతోందని, స్టార్టర్లు, మోటార్లు కాలిపోతూ అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా నదికి 248 టీఎంసీల వరద వచ్చినా జూరాల, కల్వకుర్తి ఆయకట్టును పట్టించుకోకుండా ఏపీకి నీళ్లు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సీజన్ల రైతుబంధు ఎగ్గొట్టి, రైతుబీమా ప్రీమియం కట్టకుండా రైతులను దగా చేశారని, జూరాల కింద ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
- కరెంట్ కోతలు, నీళ్ల దోపిడీపై కేటీఆర్ నిప్పులు
KTR Pebberu Rally Speech | త్రినేత్ర.న్యూస్ : వనపర్తి జిల్లా పెబ్బేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ఆందోళన ర్యాలీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెబ్బేరు సబ్ స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ కోతలు, ఎండిపోతున్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టారు.

కరెంట్ గోస.. మళ్లీ ఆ చీకటి రోజులు తెచ్చారు
తాను స్వయంగా గుమ్మడం, పెబ్బేరు సబ్ స్టేషన్లకు వెళ్లి పరిస్థితులను పరిశీలించానని కేటీఆర్ వెల్లడించారు. "అధికారులేమో రోజుకు 12 గంటలు కరెంట్ ఇస్తున్నామని లెక్కలు చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో ఐదారు గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ రావడం లేదు. ఒక్కో రోజు పది నుంచి పన్నెండు సార్లు కరెంట్ పోతుండటంతో రైతుల స్టార్టర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. 'పాత రోజులు తెస్తా' అని ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి, అన్నదాతల పాలిట నిజంగానే ఆనాటి దుర్భర చీకటి రోజులను మళ్లీ తీసుకొచ్చారు" అని మండిపడ్డారు. కరెంట్ సరిగ్గా రావడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ రైతులు సైతం రోడ్డెక్కి నిరసన తెలపాల్సి రావడం సిగ్గుచేటన్నారు.

248 టీఎంసీలొచ్చినా జూరాల ఆయకట్టు ఆగం
పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎగువ నుంచి కృష్ణా నదికి ఏకంగా 248 టీఎంసీల వరద నీరు వచ్చినా పాలమూరు ప్రాజెక్టులను నింపడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. జూరాల ప్రాజెక్టు కింద కేవలం 18 టీఎంసీలే ఇచ్చారని, కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద కనీసం మూడు పంపులు కూడా నడపలేని చేతకానితనంలో సర్కార్ ఉందని ఎద్దేవా చేశారు. జూరాల కింద ఉన్న 1.10 లక్షల ఎకరాల ఆయకట్టులో ఒక్క ఎకరం ఎండిపోయినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, రైతుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఏపీకి కృష్ణా జలాల దోపిడీ.. రేవంత్ మౌనం వెనుక మర్మమేంటి?
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి" అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.

రైతుబంధు బంద్.. పాలమూరు-రంగారెడ్డికి గ్రహణం
రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మూడు విడతల రైతుబంధు నిధులను ఎగ్గొట్టారని, చివరకు రైతుబీమా ప్రీమియం కూడా చెల్లించకుండా అన్నదాతల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న రాజకీయ కక్షతోనే ఆపేశారని దుయ్యబట్టారు. అలాగే పెబ్బేరు మండలంలో దాదాపు 1,000 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. "మోసపోతే గోస పడతాం" అని ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని, రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

తాజావార్తలు
- ●Hyderabad Police | అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.. తొమ్మిది మంది నిందితుల అరెస్ట్
- ●Katrina Kaif Sister | కత్రినాకైఫ్ చెల్లెలు ప్రేమలో పడిందా? - అక్క ఇంటికే తోటి కోడలిగా !
- ●Janwada Farm House | ప్రదీప్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై దాడికి రావడం చట్ట వ్యతిరేకం?
- ●Harish Rao | సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టుతో కొడతామని రేవంత్ రెడ్డి బెదిరించారు
- ●2BHK Houses | క్యూర్లో 21వేల డబుల్ బెడ్రూంలు పూర్తి : మంత్రి పొంగులేటి
- ●Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు - షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్

Hyderabad Police | అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.. తొమ్మిది మంది నిందితుల అరెస్ట్

Katrina Kaif Sister | కత్రినాకైఫ్ చెల్లెలు ప్రేమలో పడిందా? - అక్క ఇంటికే తోటి కోడలిగా !

Janwada Farm House | ప్రదీప్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై దాడికి రావడం చట్ట వ్యతిరేకం?

Harish Rao | సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టుతో కొడతామని రేవంత్ రెడ్డి బెదిరించారు



