త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Police | అంతర్రాష్ట్ర ముఠా గుట్టుర‌ట్టు.. తొమ్మిది మంది నిందితుల అరెస్ట్‌

Hyderabad Police | పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపహరించడం.. అర్ధరాత్రి మొబైల్‌ షాపుల షట్టర్లు లేపి చోరీలు చేయడం.. చోరీ చేసిన ఫోన్లను ముంబయి మీదుగా బంగ్లాదేశ్‌కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, ఖమ్మం పోలీసులు రట్టు చేశారు.

P

Hyderabad | Published On Sep 19, 2026, 6.39 pm IST

Hyderabad Police | అంతర్రాష్ట్ర ముఠా గుట్టుర‌ట్టు.. తొమ్మిది మంది నిందితుల అరెస్ట్‌
Advertisement

Hyderabad Police | పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపహరించడం.. అర్ధరాత్రి మొబైల్‌ షాపుల షట్టర్లు లేపి చోరీలు చేయడం.. చోరీ చేసిన ఫోన్లను ముంబయి మీదుగా బంగ్లాదేశ్‌కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, ఖమ్మం పోలీసులు రట్టు చేశారు. సీపీ సజ్జనార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. సంయుక్త ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యులపై తెలంగాణలో 13 పశువుల దొంగతనాలు, ఖమ్మం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మొబైల్‌ షాపుల చోరీలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.22 లక్షల నగదు, 15 మొబైల్‌ ఫోన్లు, 3 కార్లు, నంబర్‌ ప్లేట్‌ స్వాధీనం చేసుకున్నారు. రంజాన్‌, బక్రీద్‌ సమయంలో పశువులకు డిమాండ్‌ ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న తబ్రేజ్‌, రఫీక్‌ తదితరులు అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతాల్లోని పశువుల పాకలను గుర్తించేవారు. పశువులు అరవకుండా జైలాజిన్‌ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి వాహనాల్లో తరలించి తక్కువ ధరకు విక్రయించేవారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఫ్యూచర్‌ సిటీ పరిధిలో 13 చోరీలకు పాల్పడ్డారు.

పశువుల నుంచి మొబైల్‌ చోరీలకు

పండుగలు ముగిసి పశువులకు గిరాకీ తగ్గడంతో ముఠా మొబైల్‌ షాపులను టార్గెట్‌ చేసింది. జూన్‌ 11న ఖమ్మంలోని సోనోవిజన్‌ మొబైల్‌ షాపు షట్టర్‌ లేపి ఫోన్లు దోచుకున్నారు. వాటిని ముంబయికి చెందిన మధ్యవర్తుల ద్వారా మహ్మద్‌ జాహెద్‌ ఖాన్‌ అలియాస్‌ రాజాభాయ్‌కు విక్రయించారు. అనంతరం ఉజ్జయినిలో రెండు మొబైల్‌ షాపుల్లోనూ చోరీలకు పాల్పడ్డారు. చోరీ మొబైళ్లను కొనుగోలు చేసే జాహెద్‌ ఖాన్‌ ముంబయిలో నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్దకు చేరిన ఫోన్లను ఢాకాకు చెందిన ఖాసిమ్‌ ద్వారా కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో హవాలా లావాదేవీల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మరో చోరీకి సిద్ధమవుతున్న సమయంలో ఆగస్టు 17న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పర్యవేక్షణలో జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఖమ్మం పోలీసులు సమన్వయంతో ఆపరేషన్‌ నిర్వహించారు. మొత్తం 17 కేసులను ఛేదించినట్లు సీపీ స‌జ్జ‌నార్ వివ‌రించారు.

Advertisement
Advertisement