త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pinarayi Vijayan ED Raids | పినరయి విజయన్‌పై ఈడీ ఫోకస్ వెనుక అసలు కథ ఇదేనా? కాంగ్రెస్, బీజేపీలపై సీపీఎం సంచలన ఆరోపణలు!

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లో సీపీఎం భారీ ఆందోళన. మోడీ సర్కార్ తీరుపై, కాంగ్రెస్ మౌనంపై రాఘవులు తీవ్ర విమర్శలు చేశారు.

J

Hyderabad | Published On May 28, 2026, 3.27 pm IST

Pinarayi Vijayan ED Raids | పినరయి విజయన్‌పై ఈడీ ఫోకస్ వెనుక అసలు కథ ఇదేనా? కాంగ్రెస్, బీజేపీలపై సీపీఎం సంచలన ఆరోపణలు!
Advertisement
  • కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సీపీఎం భారీ ధర్నా
  • ఈ దాడుల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేసిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
  • విజయన్ పేరు ఎక్కడా లేకున్నా రాజకీయ కక్షసాధింపుతోనే టార్గెట్ చేశారని, కాంగ్రెస్ నేతలు సైతం ఆయన అరెస్టును కోరుకోవడం దారుణమన్న రాఘవులు
  • ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు మోడీ సర్కార్ దర్యాప్తు సంస్థలను (Agencies) వాడుకుంటోందని మండిపడ్డ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

Pinarayi Vijayan ED Raids | త్రినేత్ర.న్యూస్ : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) టార్గెట్‌గా సాగుతున్న ఈడీ దాడులు (ED Raids) దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరును తీవ్రంగా ఖండిస్తూ, గురువారం (మే 28) హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC X Roads) వద్ద సీపీఐ(ఎం) శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ నుంచి మొదలైన ఈ ర్యాలీలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు (B.V. Raghavulu) పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్యూయల్ స్టాండర్డ్స్ పై నిప్పులు చెరిగారు.

రాజకీయ దాడి

ఈడీ దాడులు కేవలం రాజకీయ దాడిలో భాగమేనని రాఘవులు ఆరోపించారు. ఈడీ చెబుతున్న ఏ కేసులోనూ విజయన్ పేరు లేదని, ఆయనపై ఒక్క అవినీతి మరక కూడా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం సోరెన్ వంటి విపక్ష నేతలను దర్యాప్తు సంస్థలతో భయపెట్టి రాజకీయంగా అణచివేసిన మోడీ సర్కార్, ఇప్పుడు వామపక్షాలను (Left parties) దెబ్బతీసేందుకు ప్లాన్ వేసిందని విమర్శించారు.

CPM Protests in Hyderabad Against ED Raids on Pinarayi Vijayan

కాంగ్రెస్, బీజేపీల సీక్రెట్ డీల్?

ఈ ఎపిసోడ్‌లో కాంగ్రెస్ (Congress) వైఖరిని రాఘవులు తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీని ఈడీ విచారించినప్పుడు, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసినప్పుడు సీపీఎం వారికి అండగా నిలబడిందని, కానీ ఇప్పుడు సీపీఎం నేతలపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ఎందుకు సైలెంట్‌గా ఉందని ప్రశ్నించారు. కేరళ కొత్త సీఎం వీడీ సతీశన్ (V.D. Satheesan) స్వయంగా ప్రధాని మోదీని కలిసి విజయన్‌ను అరెస్ట్ చేయాలని ప్రెజర్ తెచ్చారన్న అనుమానాలు బలంగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా విజయన్ అరెస్టును డిమాండ్ చేశారని ఆయన గుర్తుచేశారు.

బెదిరింపులకు భయపడేది లేదు

రాజ్యాంగ సంస్థలను మిస్ యూజ్ చేస్తూ, అక్రమ కేసులతో పార్టీలను చీల్చేందుకు బీజేపీ (BJP) ట్రై చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక విధానాలను మేధావులు ఖండించాలని ఆయన కోరారు. విజయన్‌కు మద్దతుగా ఢిల్లీలో నిరసన తెలిపిన జాతీయ నేతలు ఎంఏ బేబీ, బృందా కరత్‌లను (Brinda Karat) అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మోడీ సర్కార్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, లౌకిక శక్తులన్నీ ఏకమై మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నేతలు జూలకంటి రంగారెడ్డి, చుక్క రాములు, టి.సాగర్, పాలడుగు భాస్కర్, మల్లులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement