త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramachander Rao | తెలంగాణ‌లో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం : ఎన్ రామ‌చంద‌ర్ రావు

N Ramachander Rao | రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే ర‌క‌మైన విధానాలు క‌లిగి ఉన్నార‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ శ‌క్తి వైపు ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On May 28, 2026, 3.36 pm IST

N Ramachander Rao | తెలంగాణ‌లో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం : ఎన్ రామ‌చంద‌ర్ రావు
Advertisement

N Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే ర‌క‌మైన విధానాలు క‌లిగి ఉన్నార‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ శ‌క్తి వైపు ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వ‌హించిన పండిట్ దీన్ ద‌యాళ్ ప్ర‌శిక్ష‌ణ్ మ‌హాభియాన్ కార్య‌క్ర‌మంలో రామ‌చంద‌ర్ రావు పాల్గొని ప్ర‌సంగించారు.

స‌ర్ మీద ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు దుష్ప్ర‌చారం చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లో కాంగ్రెస్, మజ్లిస్ క‌లిసి దుష్ప్ర‌చారం చేస్తున్నాయి. స‌ర్ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగ‌తిస్తోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం ఇది. ప్ర‌భుత్వానికి, పార్టీకి సంబంధం లేదు. ఈ విష‌యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు క‌లిసి ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు స‌మాచారం చేర‌వేస్తున్నాయి. బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. ఓడిపోతే స‌ర్, ఈవీఎంల మీద మాట్లాడుతున్నారు. గెలిస్తే వీటి మీద మాట్లాడ‌రు. ఈవీఎంల‌ను, స‌ర్‌ను సాకుగా తీసుకుని ఓడిపోయామ‌ని చెబుతున్నారు అని బీజేపీ అధ్య‌క్షుడు పేర్కొన్నారు.

విద్రోహ శ‌క్తులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 

దేశంలో చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీసుకువ‌స్తుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ స‌పోర్ట్ చేస్తుంది. రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు. జెన్ జీ రోడ్ల మీద‌కు వ‌చ్చి హింస‌కు దిగాల‌ని పిలుపునిస్తున్నారు. మ‌రో వైపు బీఆర్ఎస్ పార్టీ నేత రెచ్చ‌గొట్టి రైల్వే స్టేష‌న్లు, ఆఫీసుల‌ను త‌గ‌ల‌బెట్టండి అని పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ క‌లిసి విద్రోహ శ‌క్తులుగా మారుతున్నాయి. ఇద్ద‌రి మెంటాల్టీ ఒక‌టే దేశానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారు అని మండిప‌డ్డారు.

డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ కోసం ప్ర‌య‌త్నించాలి

బీఆర్ఎస్ హ‌యాంలో ఉద్యోగాలు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌లేదు. కాంగ్రెస్ హ‌యాంలో కూడా లేవు. రైతు భ‌రోసా ఇవ్వ‌డం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే ర‌క‌మైన విధానాలు క‌లిగి ఉన్నారు. ఇవాళ తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ శ‌క్తి వైపు చూస్తున్నారు. కొత్త రాజ‌కీయ పార్టీని చూస్తున్నారు. వారి విశ్వాసం బీజేపీ మీద ఉన్న‌ది. రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం. తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రావాల‌ని కోరుతున్నారు. మ‌నంద‌రం క‌ష్ట‌ప‌డి డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ కోసం ప్ర‌య‌త్నించాలి. ఆ ప్ర‌య‌త్నం రంగారెడ్డి జిల్లా నుంచి మొద‌లుపెట్టాలి. ఈ రెండున్న‌రేండ్లు ఒక ల‌క్ష్యంతో ముందుకు పోదాం.. తెలంగాణ‌లో రాబోయేది బీజేపీనే అని విశ్వాసం ఉంద‌న్నారు.

రాజ‌కీయ అహంకారంతో బీఆర్ఎస్ ఓట‌మి పాలైంది

కాంగ్రెస్ వ‌ద్ద నిధులు లేవు.. హామీలు నెర‌వేర్చే బాధ్య‌త మీది. త‌ప్పుడు వాగ్దానాల‌తో గ‌ద్దెనెక్కారు. రాజ‌కీయ అహంకారంతో బీఆర్ఎస్ ఓట‌మి పాలైంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ప‌ని చేస్తుంది. ప్ర‌జ‌ల‌ను ఆదుకోండి.. మీరు ఏం చేయ‌కున్నా ప‌ర్వాలేదు.. ప్ర‌జ‌లు గొంతులు కోయ‌కండి. ధాన్యం కొన‌లేక కేంద్రం మీద అభాండాలు వేస్తున్నారు. చివ‌రి ధాన్యం వ‌ర‌కు కొంటామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేశారు. రైతు గోస బీజేపీ భ‌రోసాతో ముందుకు పోయాం. రైతుల ప‌క్షాన బీజేపీ నిల‌బడింది. ఈ యాత్ర ఇక్క‌డితో ఆగ‌దు.. బీజేపీ రైతుల హ‌క్కుల కోసం పోరాడుతూనే ఉంటుంది.. ఆగేది లేదు.. కాంగ్రెస్ అరాచ‌కాలు సాగ‌వు. బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మీద త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. మేం భ‌యప‌డం.. ఎదురిస్తాం. ప్ర‌జాస్వామ్య‌యుత ప‌ద్ధ‌తుల్లో ఈ ప్ర‌భుత్వంపై పోరాడుదాం అని రామ‌చంద‌ర్ రావు పిలుపునిచ్చారు.

విక‌సిత్ భార‌త్‌గా ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానం

బీజేపీ ఒక సిద్ధాంతం గ‌ల పార్టీ. పార్టీ నిర్మాణంలో ఎంతో మంది ర‌క్తం, చెమ‌ట ఉంది. ఐక్య‌త‌తో ముందుకు పోవాలి. ప్ర‌జ‌లు మ‌న కోసం ఎదురుచూస్తున్నారు. మాస్ బేస్డ్ పార్టీగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. ప‌దేండ్లు బీఆర్ఎస్, రెండున్న‌రేండ్లు కాంగ్రెస్‌ను చూశారు. ఇప్పుడు ఒక కొత్త రాజ‌కీయ శ‌క్తిని కోరుకుంటున్నారు.. అదే బీజేపీ. ఈ 12 ఏండ్ల కాలంలో న‌రేంద్ర మోదీ రాష్ట్రానికి రూ. 13 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చారు. జాతీయ ర‌హ‌దారులు ఇచ్చారు. సెంట్ర‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఇచ్చారు. వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టు మోదీ వ‌ల్లే వ‌స్తుంది. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తున్నారు. విక‌సిత్ భార‌త్‌గా ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానంలో ఉంటామ‌ని రామ‌చంద‌ర్ రావు తెలిపారు.

Advertisement
Advertisement