త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR vs Chanagani Dayakar | కేటీఆర్‌కు దమ్ముంటే ఓయూకి రావాలి: పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ సవాల్!

బీఆర్ఎస్ పేపర్ లీకేజీలపై ఉస్మానియాలో చర్చకు రావాలని కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత దయాకర్ సవాల్ విసిరారు. నిరుద్యోగులను ఇక రెచ్చగొట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు.

J

Hyderabad | Published On Jul 18, 2026, 3.53 pm IST

KTR vs Chanagani Dayakar | కేటీఆర్‌కు దమ్ముంటే ఓయూకి రావాలి: పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ సవాల్!
Advertisement
  • బీఆర్ఎస్ నిర్వహిస్తున్నది యువ సంగ్రామ సభ కాదని, అది కేవలం నిరుద్యోగులను రెచ్చగొట్టే కేటీఆర్ సదస్సు అని కాంగ్రెస్ విమర్శ
  • గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 16 పేపర్లు లీక్ అయ్యాయని, బీఆర్ఎస్ అంటేనే లీకేజ్, ప్యాకేజ్ అని నిరుద్యోగులు భావిస్తున్నారని ఫైర్
  • దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ (OU) వేదికగా నిరుద్యోగ సమస్యలపై చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్
  • ఉద్యోగ నియామకాలపై త్వరలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలతో మెగా 'ధన్యవాద సభ' ఏర్పాటు

KTR vs Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ (BRS) తలపెట్టిన 'యువ సంగ్రామ సభ'పై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గాంధీ భవన్‌లో మాట్లాడిన టీపీసీసీ (TPCC) ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్.. బీఆర్ఎస్ పాలనలో జరిగిన పేపర్ లీకేజీలను ఎండగట్టారు. దమ్ముంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) వేదికగా చర్చకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) ఓపెన్ చాలెంజ్ విసిరారు.

నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే ఆ సభ

బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ అసలు యువ సంగ్రామ సభే కాదని, అది నిరుద్యోగులను రెచ్చగొట్టడానికి పెట్టిన కేటీఆర్ సదస్సు అని దయాకర్ మండిపడ్డారు. తెలంగాణ యువత గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. బీఆర్ఎస్ అంటేనే "లీకేజ్ - ప్యాకేజ్" అని రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ఏకంగా 16 పరీక్షల పేపర్లను లీక్ చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనని, ఉద్యోగాలు అమ్ముకుని విద్యార్థుల ఉసురు పోసుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఆత్మహత్యల పాపం మీదే..

నిరుద్యోగుల ఆత్మహత్యలపై దయాకర్ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. "ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే, దాన్ని ప్రేమ లేఖ అంటూ కేటీఆర్ నీచంగా మాట్లాడారు. బీఆర్ఎస్‌ను ఓడించి మా బతుకులను కాపాడండి అంటూ సునీల్ నాయక్ ప్రాణాలు వదిలాడు. మరి ఆ ఇరు కుటుంబాలకు మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?" అని ప్రశ్నించారు. ఈ లీకేజీలకు ప్రధాన కారణం మీరేనని గతంలో కోవర్ట్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్వయంగా అన్నారని గుర్తుచేశారు.

ఓయూలో చర్చకు సిద్ధమా?

"మా రెండున్నర నెలల ప్రజా పాలనపై, మీ పదేళ్ల పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు కేటీఆర్ చర్చకు రావాలి. పది సంవత్సరాలు మంత్రిగా ఉండి కేటీఆర్ ఏనాడైనా ఓయూకి వచ్చారా?" అని దయాకర్ నిలదీశారు. కేటీఆర్ లోఫర్, లత్కోర్ మాటలు మాట్లాడటం మానుకోవాలని.. ఆయన వాడే భాషను నిరుద్యోగులు నమ్మే పరిస్థితిలో లేరని హెచ్చరించారు.

త్వరలో 'ధన్యవాద సభ'

తెలంగాణలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజా పాలనకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధ్యమని ఇప్పటికే నిరూపించామని తెలిపారు. దీనికి కృతజ్ఞతగా త్వరలోనే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో నిరుద్యోగులతో భారీ 'ధన్యవాద సభ' నిర్వహిస్తామని దయాకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ లీకేజ్, ప్యాకేజ్ బాగోతాలను ఊరూరా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement