త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistani Cosmetics Seized Hyderabad | అందం పేరుతో విషం: రూ. 7 లక్షల విలువైన నిషేధిత పాకిస్థానీ కాస్మొటిక్స్ సీజ్

తెల్లబడతారని వాడితే ప్రాణానికే ముప్పు! హైదరాబాద్‌లో రూ. 7 లక్షల విలువైన నిషేధిత పాకిస్థానీ కాస్మొటిక్స్ సీజ్.. షాపుల్లో అధికారుల మెరుపు దాడులు.

J

Hyderabad | Published On Oct 1, 2026, 7.21 pm IST

Pakistani Cosmetics Seized Hyderabad | అందం పేరుతో విషం: రూ. 7 లక్షల విలువైన నిషేధిత పాకిస్థానీ కాస్మొటిక్స్ సీజ్

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్‌లోని నాంపల్లి, హబీబ్‌నగర్ పరిధిలోని బ్యూటీ స్టోర్లు, మెడికల్ షాపులపై టాస్క్‌‌ఫోర్స్, సీడీఎస్‌సీవో (CDSCO) సంయుక్త దాడులు నిర్వహించాయి. గోరీ, చాందినీ, గోల్డెన్ పెరల్ వంటి అనుమతులు లేని పాకిస్థానీ ఫేర్‌నెస్ క్రీములు, సబ్బులను అధికారులు సీజ్ చేశారు. వీటిలో పరిమితికి మించి విషపూరిత హెవీ మెటల్స్ ఉన్నట్లు, చర్మానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని అధికారులు హెచ్చరించారు. ముంబైకి చెందిన డీలర్ ద్వారా అక్రమంగా దిగుమతి చేస్తున్న ముఠాపై బీఎన్‌ఎస్, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Pakistani Cosmetics Seized Hyderabad | త్రినేత్ర న్యూస్ : తెల్లగా మెరిసిపోవచ్చంటూ విక్రయిస్తున్న నిషేధిత విదేశీ కాస్మొటిక్స్‌పై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమ మార్గాల్లో పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న సుమారు రూ. 7 లక్షల విలువైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ జోన్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అధికారులు సంయుక్తంగా నాంపల్లి, హబీబ్‌నగర్ ప్రాంతాల్లోని షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ షాపుల్లోనే అక్రమ విక్రయాలు

హబీబ్‌నగర్, నాంపల్లిలోని 'బ్యూటీ లేడీస్ ఎంపోరియం', 'బ్యూటీ క్వీన్ షాప్', 'ఎస్.జె. మెడికల్ షాప్'లలో నిబంధనలకు విరుద్ధంగా ఈ ఉత్పత్తులను అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి దిగుమతి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా, సరైన కొనుగోలు బిల్లులు లేదా ఇన్‌వాయిస్‌లు మెయింటైన్ చేయకుండా విక్రయిస్తుండటంతో మొత్తం స్టాక్‌ను సీజ్ చేశారు.

సీజ్ చేసిన బ్రాండ్లు ఇవే..

మార్కెట్లో విస్తృతంగా వినియోగించే స్కిన్ వైట్నింగ్ క్రీములు, ఫేస్ వాష్‌లు, సబ్బులు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా గోరీ (Goree), చాందినీ (Chandni), ఫైజ్ (Faiz), నావియా (Navia), గోల్డెన్ పెరల్ (Golden Pearl), సదఫ్ (Sadaf), ఫేస్ ఫ్రెష్ (Face Fresh), స్టిల్‌మ్యాన్స్ (Stillmans), నూర్ గోల్డ్ (Noor Gold) వంటి పాకిస్థానీ బ్రాండ్లను స్వాధీనం చేసుకున్నారు.

Banned Pakistani Cosmetics Seized in Hyderabad CDSCO Warns of Heavy Metals

పరిమితికి మించి హెవీ మెటల్స్.. చర్మానికి తీవ్ర ముప్పు

ఈ ఉత్పత్తుల్లో శరీరానికి అత్యంత హాని కలిగించే హెవీ మెటల్స్ (భార లోహాలు) అనుమతించిన పరిమితి కంటే అధికంగా ఉన్నట్లు సీడీఎస్‌సీవో గతంలోనే హెచ్చరించింది. వీటిని క్రమం తప్పకుండా వాడితే చర్మ వ్యాధులు రావడంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, కిడ్నీలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ముంబై టు హైదరాబాద్ లింక్.. ఐదుగురిపై కేసు

ప్రాథమిక విచారణ ప్రకారం, ముంబైకి చెందిన ఓ ప్రధాన డీలర్ ద్వారా ఈ ఉత్పత్తులు అక్రమంగా హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నట్లు తేలింది. సంతోష్‌నగర్‌లోని మదీనా కాస్మొటిక్స్‌తో పాటు ఓ రహస్య గోదాములో కూడా స్టాక్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

Banned Pakistani Cosmetics Seized in Hyderabad CDSCO Warns of Heavy Metals

ఈ వ్యవహారంలో మహ్మద్ ఫజల్ (35), మహ్మద్ అయాన్ (23), మహ్మద్ రియాజుద్దీన్ (41), సయ్యద్ అబిద్ అలీ (54), సయ్యద్ ఇస్మాయిల్ (22)లను గుర్తించి.. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 123, 318(4)తో పాటు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1940 కింద కేసులు నమోదు చేశారు. ముంబై సప్లయర్ ఆచూకీ, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
Advertisement