Ganja | హైదరాబాద్ : డ్రగ్స్ కొనుగోలుదారులు, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట డ్రగ్స్ అమ్మకాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు, లంగర్ హౌజ్ పోలీసులు కలిసి శనివారం ఓ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 70 లక్షల విలువ చేసే గంజాయితో పాటు హాసిస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను వైకుంఠ రావు, పాల్ ఖైలా, కృష్ణ జల్లా, బాలాజీ, చైతన్యగా గుర్తించారు. వైకుంఠ రావు సూచనల మేరకు పాల్, కృష్ణ కలిసి ఒడిశా నుంచి హాసిస్ ఆయిల్, గంజాను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక హైదరాబాద్‌లో వైకుంఠ రావు బాలాజీ, చైతన్య సహాయంతో స్థానికులకు గంజాయి, హాసిస్ ఆయిల్‌ను విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ తెలిపారు.