త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dehydration Test | మీరు నీళ్ల‌ను రోజూ త‌గిన‌న్ని తాగుతున్నారా, లేదా.. ఈ చిన్న టెస్ట్‌తో తెలుసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Dehydration Test | డీహైడ్రేషన్ (శరీరంలో నీటి కొరత) మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా వేడి వాతావరణం, అనారోగ్యం లేదా తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో ఇది మరింతగా కనిపిస్తుంది. దాహం అనేది అత్యంత స్పష్టమైన లక్షణం అయినప్పటికీ, శరీరం నీటి లోపాన్ని సూచించే ఇతర సూక్ష్మ సంకేతాలను కూడా ఇస్తుంది.

S

Health | Published On Mar 20, 2026, 1.15 pm IST

Dehydration Test | మీరు నీళ్ల‌ను రోజూ త‌గిన‌న్ని తాగుతున్నారా, లేదా.. ఈ చిన్న టెస్ట్‌తో తెలుసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?
Advertisement

Dehydration Test | డీహైడ్రేషన్ (శరీరంలో నీటి కొరత) మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా వేడి వాతావరణం, అనారోగ్యం లేదా తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో ఇది మరింతగా కనిపిస్తుంది. దాహం అనేది అత్యంత స్పష్టమైన లక్షణం అయినప్పటికీ, శరీరం నీటి లోపాన్ని సూచించే ఇతర సూక్ష్మ సంకేతాలను కూడా ఇస్తుంది. అలాంటి సందర్భాల్లో వైద్య నిపుణులు ఉపయోగించే ఒక సులభమైన పద్ధతి స్కిన్ పించ్ టెస్ట్. ఈ పరీక్ష ద్వారా శరీరంలో నీటి స్థాయి గురించి ఒక అంచనాకు రావచ్చు. అయితే 2007లో ఎమర్జెన్సీ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన సమీక్ష ప్రకారం ఈ పరీక్ష చిన్నారుల్లో కొంతవరకు ఉపయోగకరమైనప్పటికీ, దాని క‌చ్చితత్వం పరిమితంగానే ఉంటుంది. అందువల్ల డీహైడ్రేషన్ నిర్ధారణకు వైద్యులు ఇతర పరీక్షలపై కూడా ఆధారపడతారు.

స్కిన్ పించ్ టెస్ట్ అంటే..

స్కిన్ పించ్ టెస్ట్, లేదా స్కిన్ టర్గర్ టెస్ట్ అని పిలిచే ఈ పరీక్షలో చర్మాన్ని స్వల్పంగా నొక్కి విడిచిన తర్వాత అది ఎంత వేగంగా మామూలు స్థితికి వస్తుందో పరిశీలిస్తారు. శరీరం సరైన స్థాయిలో నీటిని కలిగి ఉంటే, చర్మం సాఫ్ట్‌గా ఉండి వెంటనే తిరిగి తన స్థానానికి చేరుతుంది. అయితే నీటి లోపం ఉన్నప్పుడు చర్మం మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ పద్ధతిని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, డీహైడ్రేషన్ ప్రమాదంలో ఉన్నవారిలో ప్రాథమిక పరీక్షగా వైద్యులు ఉపయోగిస్తారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ చర్మం తన సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో వృద్ధుల్లో ఈ పరీక్ష ఫలితాలు క‌చ్చితంగా ఉండకపోవచ్చు. 2015లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం 65 ఏళ్లకు పైబడినవారిలో స్కిన్ టర్గర్ పరీక్షను ఆధారంగా తీసుకుని డీహైడ్రేషన్‌ను నిర్ధారించడం సరైన విధానం కాదని పేర్కొంది.

ఈ పరీక్షను ఎలా చేయాలి?

స్కిన్ పించ్ టెస్ట్‌ను ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. చేతి వెనుక భాగం, పొట్ట లేదా కాలర్‌బోన్ కింద భాగం వంటి భాగాల్లో చ‌ర్మం ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. బొటనవేలు, చూపుడు వేలితో చిన్న చర్మ మడతను పట్టుకుని కొన్ని సెకన్లు నొక్కి పట్టుకోవాలి. తరువాత వదిలి చర్మం ఎలా తిరిగి వస్తుందో గమనించాలి. చర్మం వెంటనే తన స్థానానికి చేరితే శరీరంలో నీటి స్థాయి సాధారణంగా ఉందని అర్థం. అయితే కొంతసేపు పైకి లేచినట్టే ఉండి, నెమ్మదిగా తిరిగి వస్తే డీహైడ్రేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పరీక్షను కేవలం ఒక సాధారణ సూచికగా మాత్రమే పరిగణించాలి.

ఇత‌ర ల‌క్ష‌ణాల‌ను కూడా చూడాలి..

చర్మం సాగే గుణం, నిర్మాణాన్ని నిలుపుకోవడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. చెమట, వాంతులు, విరేచనాలు లేదా తక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరం ద్రవాలను కోల్పోతుంది. దీంతో కణజాలం కఠినంగా మారి, చర్మం నొక్కినప్పుడు వెంటనే తిరిగి రాకపోవచ్చు. ఈ మార్పును ఆధారంగా చేసుకుని స్కిన్ టర్గర్‌ను ద్రవ సమతుల్యతకు సూచికగా ఉపయోగిస్తారు. స్కిన్ పించ్ టెస్ట్‌ను ఇతర లక్షణాలతో కలిపి పరిశీలించాలి. సాధారణంగా కనిపించే లక్షణాల్లో నోరు ఎండిపోవడం, అలసట, తల తిరగడం, తలనొప్పి, ముదురు రంగులో మూత్రం, మూత్ర విసర్జన తగ్గడం, పిల్లల్లో చిరాకు, అధిక నిద్రమత్తు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే డీహైడ్రేష‌న్ ఉన్న‌ట్లు భావించాలి. అలాగే తీవ్రమైన డీహైడ్రేషన్ పరిస్థితుల్లో గందరగోళం, గుండె వేగంగా కొట్టుకోవడం, తక్కువ రక్తపోటు వంటి సమస్యలు త‌లెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి స్థితిలో బాధితుల‌కు త‌క్ష‌ణ వైద్య చికిత్స అందించాలి.

స్కిన్ పించ్ టెస్ట్ ప్రతి ఒక్కరికీ సమానంగా పని చేయదు. వృద్ధుల్లో చర్మం సహజంగానే సాగే గుణాన్ని కోల్పోవడం వల్ల నీటి స్థాయి సరిగ్గా ఉన్నప్పటికీ చర్మం నెమ్మదిగా తిరిగి రావచ్చు. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు, అధిక బరువు తగ్గడం లేదా దీర్ఘకాల సూర్యరశ్మి ప్రభావం కూడా ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. ఈ పరిమితుల కారణంగా వైద్యులు సాధారణంగా ఇతర లక్షణాలు, వైద్య చరిత్ర, ప్రయోగశాల పరీక్షల ఆధారంగా డీహైడ్రేషన్‌ను నిర్ధారిస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement