త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vitamin B12 | విటమిన్ B12 పొందాలంటే శాకాహారుల‌కు చ‌క్క‌ని మార్గం.. రోజూ కాస్త తీసుకుంటే చాలు..

Vitamin B12 | దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అధిక శాతం మంది విటమిన్ B12 లోపాన్ని ఎదుర్కొంటున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మెడిబ‌డ్డీ అనే సంస్థ అధ్య‌య‌నం ప్ర‌కారం దేశంలో ఉద్యోగం చేసే పురుషుల్లో 57 శాతం మందికి విటమిన్ B12 లోపం ఉండ‌గా, ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌ల్లో 50 శాతం మంది ఈ లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తేలింది.

S

Health | Published On Apr 5, 2026, 2.03 pm IST

Vitamin B12 | విటమిన్ B12 పొందాలంటే శాకాహారుల‌కు చ‌క్క‌ని మార్గం.. రోజూ కాస్త తీసుకుంటే చాలు..
Advertisement

Vitamin B12 | దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అధిక శాతం మంది విటమిన్ B12 లోపాన్ని ఎదుర్కొంటున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మెడిబ‌డ్డీ అనే సంస్థ అధ్య‌య‌నం ప్ర‌కారం దేశంలో ఉద్యోగం చేసే పురుషుల్లో 57 శాతం మందికి విటమిన్ B12 లోపం ఉండ‌గా, ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌ల్లో 50 శాతం మంది ఈ లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తేలింది. విటమిన్ B12 శరీరంలో శక్తి స్థాయిలు, నాడీ వ్యవస్థ ఆరోగ్యం, ఎర్ర రక్త కణాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. B12 స్థాయిలు తగ్గినప్పుడు అలసట, బలహీనత, మానసికంగా నిస్తేజంగా ఉండ‌డం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా విటమిన్ B12 లోపం ఉంటే నాడీ వ్యవస్థపై ఎక్కువ‌ ప్రభావం చూపే అవ‌కాశం ఉంటుంది. అయితే విటమిన్ B12 చాలా వ‌ర‌కు మాంసాహారాల్లో ల‌భిస్తుంది. అందువ‌ల్ల శాకాహారులు ఈ లోపాన్ని ఎక్కువ‌గా ఎదుర్కొనే అవ‌కాశాలు ఉంటాయ‌ని పోష‌కాహార నిపుణురాలు పాల‌క్ నాగ్‌పాల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు. కానీ శాకాహారులు కూడా ప‌లు మార్గాల ద్వారా విటమిన్ B12 అందేలా చూసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్ అంటే..

విటమిన్ B12 ప్రధానంగా మాంసం, చేపలు, గుడ్లు వంటి జంతు ఆధారిత ఆహారాల్లో లభిస్తుంది. అందువల్ల శాకాహారులు ఈ పోషకాన్ని సరిపడా పొందడం కష్టంగా మారుతుంది. ఫలితంగా చాలా మంది సప్లిమెంట్స్‌పై ఆధారపడాల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు చిన్న ఆహార మార్పులు ఈ లోటును భర్తీ చేయడంలో సహాయపడ‌తాయి. శాకాహారులు విటమిన్ B12 ల‌భించాలంటే న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్‌ను తీసుకోవాల‌ని పాల‌క్ నాగ్‌పాల్ సూచించారు. ఇది శాకాహారుల‌కు కావ‌ల్సిన విటమిన్ B12ను అందిస్తుంద‌ని తెలిపారు. న్యూట్రిషనల్ ఈస్ట్ అంటే డీయాక్టివేట్ చేసిన ఈస్ట్ రూపం. దీన్ని రెస్టారెంట్ల‌లో సాధారణంగా సీజనింగ్ కోసం ఉపయోగిస్తారు. దీనికి స్వల్పంగా చీజ్ వంటి రుచి ఉండటంతో ప్లాంట్-బేస్డ్ వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది పసుపు రంగు ఫ్లేక్స్ లేదా పొడి రూపంలో లభిస్తుంది. ఆహారంపై చ‌ల్లుకుని సుల‌భంగా తీసుకోవ‌చ్చు.

అనేక పోష‌కాలు..

కేవలం ఒక టేబుల్ స్పూన్ (సుమారు 5 గ్రాములు) ఫోర్టిఫైడ్ న్యూట్రిషనల్ ఈస్ట్‌లో అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయ‌ని పాల‌క్ నాగ్‌పాల్ తెలిపారు. ఒక్క టేబుల్ స్పూన్ న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్‌లో విటమిన్ B12 సుమారుగా 2.4 నుంచి 5 మైక్రోగ్రాముల మేర ల‌భిస్తుంది. పెద్ద‌ల‌కు ఇది రోజువారిగా 2.4 మైక్రోగ్రాములు అవ‌స‌రం అయ్యే కోటాను భ‌ర్తీ చేస్తుంది. అలాగే ఒక్క స్పూన్ ఈస్ట్‌లో 4 నుంచి 5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. శ‌రీరం సొంతంగా త‌యారు చేసుకోలేని 9 ర‌కాల అమైనో ఆమ్లాలు కూడా న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్‌లో ఉంటాయి. వీటితోపాటు ఇందుల ఉండే B1, B2, B3, B6 వంటి విటమిన్లు శక్తి మార్పిడి, నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడతాయి. ఇందులో త‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి. ఒక్క టేబుల్ స్పూన్ న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్ తీసుకుంటే సుమారుగా 20 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. అందువ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌న్న భ‌యం ఉండ‌దు.

సుల‌భంగా తీసుకోవ‌చ్చు..

న్యూట్రిషనల్ ఈస్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది అనేక వంటకాలలో సులభంగా కలిసిపోతుంది. ఆహారపు టెక్స్చర్‌ను మార్చదు. అందువ‌ల్ల దీన్ని చాలా సుల‌భంగా తీసుకోవ‌చ్చ‌ని పాల‌క్ నాగ్‌పాల్ తెలిపారు. త‌ర‌చూ తినే స‌లాడ్స్‌, పాస్తా, స్వీట్ కార్న్‌, పాప్ కార్న్‌, కూర‌ల‌పై న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్‌ను చ‌ల్లి తీసుకోవ‌చ్చు. ఇది స్వల్పంగా చీజ్ రుచిని అందిస్తూ ఆహారపు పోషక విలువల‌ను పెంచుతుంది. మొత్తం ఆహారాన్ని మార్చడం లేదా ఒకే పదార్థంపై ఆధారపడడం అవసరం లేకుండా ఈ విధమైన చిన్న మార్పులు చేస్తే సాధారణంగా వచ్చే పోషకాహార‌ లోపాలను భర్తీ చేయడం సుల‌భ‌త‌రం అవుతుంది. శాకాహారులకు ఈ న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్ ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement