త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HIV | హెచ్‌ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్‌ఐవీ-టు-హెచ్‌ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..

HIV | అమెరికాలోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ వైద్యులు చ‌రిత్ర సృష్టించారు. ప్ర‌పంచంలోనే తొలిసారిగా హెచ్ఐవీ పాజిటివ్ వ్య‌క్తి నుంచి మ‌రో హెచ్ఐవీ పాజిటివ్ వ్య‌క్తికి ఊపిరితిత్తుల మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. వైద్య‌రంగ చరిత్ర‌లోనే దీన్ని ఓ అద్భుత‌మైన ఘ‌ట్టంగా నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు.

S

Health | Published On Jun 22, 2026, 1.09 pm IST

HIV | హెచ్‌ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్‌ఐవీ-టు-హెచ్‌ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..
Advertisement

HIV | అమెరికాలోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ వైద్యులు చ‌రిత్ర సృష్టించారు. ప్ర‌పంచంలోనే తొలిసారిగా హెచ్ఐవీ పాజిటివ్ వ్య‌క్తి నుంచి మ‌రో హెచ్ఐవీ పాజిటివ్ వ్య‌క్తికి ఊపిరితిత్తుల మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. వైద్య‌రంగ చరిత్ర‌లోనే దీన్ని ఓ అద్భుత‌మైన ఘ‌ట్టంగా నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు. దీని వ‌ల్ల హెచ్ఐవీ రోగుల్లో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయ‌ని అంటున్నారు. ఈ ఏడాది మార్చి 21న ఈ శ‌స్త్ర చికిత్స‌ను నిర్వ‌హించ‌గా, ప్ర‌స్తుతం రోగి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్య నిపుణులు తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న 56 ఏళ్ల రోగికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న ఓ మృతదాత నుంచి సేక‌రించిన ఊపిరితిత్తుల‌ను విజ‌య‌వంతంగా అమ‌ర్చారు. ఊపిరితిత్తుల వ్యాధుల‌తో పోరాడుతున్న హెచ్ఐవీ రోగుల‌కు ఇది కొత్త అవ‌కాశాల‌ను అందిస్తుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హెచ్ఐవీ పాజిటివ్ రోగులు నెగెటివ్ దాత‌ల నుంచి అవ‌య‌వాల‌ను పొందుతున్నార‌ని, అయితే హెచ్ఐవీ పాజిటివ్ దాత నుంచి సేక‌రించిన ఊపిరితిత్తుల‌ను మ‌రో పాజిటివ్ రోగికి విజ‌య‌వంతంగా అమ‌ర్చ‌డం ఇదే తొలిసార‌ని వైద్య నిపుణులు తెలిపారు.

మెరుగైన రోగి ప‌రిస్థితి..

అమెరికాలో అమలులో ఉన్న హెచ్ఐవీ ఆర్గాన్ పాల‌సీ ఈక్విటీ (HOPE) యాక్ట్ చట్టం ప్ర‌కారం ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ చట్టం ప్రకారం కఠిన పర్యవేక్షణలో హెచ్‌ఐవీ-పాజిటివ్ దాతల నుంచి హెచ్‌ఐవీ-పాజిటివ్ గ్రహీతలకు అవయవ మార్పిడికి అనుమతి ఉంది. పరిశోధకులు, అవయవ మార్పిడి నిపుణులు ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విధానాలకు మార్గం సుగమం అవుతుంద‌ని చెబుతున్నారు. గ్రహీత బెర్‌ట్రాండ్ నెల్స‌న్ రెండు దశాబ్దాలకు పైగా హెచ్‌ఐవీతో జీవిస్తున్నాడు. అత‌నికి సార్కోయిడోసిస్ అనే తీవ్రమైన ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి ఉండగా, అది ఊపిరితిత్తులు, కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 2021లో లెజియోనేయర్స్ వ్యాధి బారిన పడిన తర్వాత అత‌ని ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు నిరంతర ఆక్సిజన్ సహాయం అవసరమయ్యే స్థితికి చేరుకున్నాడు. ఈ ఏడాది మార్చి 21న వైద్యులు హెచ్‌ఐవీ-పాజిటివ్ దాత నుంచి సేక‌రించిన‌ రెండు ఊపిరితిత్తులను అత‌నికి అమర్చారు. అదే శస్త్రచికిత్సలో కాలేయ మార్పిడి కూడా నిర్వహించారు. ప్రస్తుతం అత‌ను నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా అద‌న‌పు ఆక్సిజన్ అవసరం లేకుండానే శ్వాస తీసుకుంటూ కోలుకుంటున్నాడు.

మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌వ‌చ్చు..

ఎన్‌వైయూ లాంగోన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ క్లినికల్ డైరెక్టర్ డాక్ల‌ర్ సప్నా మెహ‌తా మాట్లాడుతూ హెచ్‌ఐవీ సమాజానికి ఇది ఒక మైలురాయ‌ని అన్నారు. అవయవ మార్పిడి రంగంలో సమానత్వాన్ని తీసుకురావడంలో ఇది గొప్ప ముందడుగ‌ని పేర్కొన్నారు. కాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.99 కోట్ల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. ఆధునిక యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) కారణంగా ప్ర‌స్తుతం హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులు సాధారణ జీవితకాలానికి దగ్గరగా జీవించగలుగుతున్నారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా కొందరికి భవిష్యత్తులో అవయవ మార్పిడి అవసరం అవుతోంది. అవయవ దాతల కొరత ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా ఉంది. హెచ్‌ఐవీ-పాజిటివ్ దాతల అవయవాలను కూడా వినియోగించగలగడం వల్ల అందుబాటులో ఉన్న దాతల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో వేచి ఉండే కాలం తగ్గి మరిన్ని ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.

ఊపిరితిత్తుల మార్పిడి రిస్కే అయినా..

2013లో అమెరికాలో అమలులోకి వచ్చిన హెచ్‌ఐవీ ఆర్గన్ పాలసీ ఈక్విటీ (హోప్) చట్టం, హెచ్‌ఐవీ-పాజిటివ్ దాతల అవయవాల వినియోగంపై ఉన్న దశాబ్దాల నాటి ఆంక్షలను తొలగించింది. అప్పటి నుంచి హెచ్‌ఐవీ-పాజిటివ్ దాతల నుంచి హెచ్‌ఐవీ-పాజిటివ్ గ్రహీతలకు మూత్రపిండాలు, కాలేయ మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లు విజయవంతంగా కొన‌సాగుతున్నాయి. అమెరికా జ‌ర్న‌ల్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ లో ప్రచురితమైన బహుళ కేంద్రాల అధ్యయనం ప్రకారం హెచ్‌ఐవీ-పాజిటివ్ దాతల నుంచి కాలేయ మార్పిడి సాధ్యమని, వాటి ఫలితాలు హెచ్‌ఐవీ-నెగటివ్ దాతల అవయవాలతో చేసే మార్పిడులతో సమానంగా ఉన్నాయని తేలింది. ఈ ఫలితాలు హోప్ చట్టం కింద మరిన్ని మార్పిడి అవకాశాలకు నమ్మకాన్ని పెంచాయి. అయితే ఊపిరితిత్తులు ఇతర అవయవాలతో పోలిస్తే ప్రత్యేక సవాళ్లను కలిగి ఉంటాయి. అవి నిరంతరం బయటి వాతావరణంతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు, మార్పిడి అనంతర తిరస్కరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే హెచ్‌ఐవీ-టు-హెచ్‌ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

హెచ్ఐవీ-టు-హెచ్ఐవీ.. అవ‌య‌వ మార్పిడి చేయ‌వ‌చ్చు..

గతంలో హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులకు అవయవ మార్పిడి చేయడం ప్రమాదకరంగా భావించేవారు. ఇమ్యూన్ వ్యవస్థ బలహీనపడటం, ఇన్‌ఫెక్షన్ల భయం త‌దిత‌ర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. అయితే యాంటీ రెట్రోవైరల్ చికిత్సల్లో వచ్చిన పురోగతి దీన్ని పూర్తిగా మార్చేసింది. ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ప్రోసీడింగ్స్‌లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం వైరస్‌ను సమర్థంగా నియంత్రణలో ఉంచుకున్న హెచ్‌ఐవీ రోగులు ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్న తర్వాత కూడా హెచ్‌ఐవీ-నెగటివ్ రోగులతో సమానమైన ఫలితాలను పొందగలుగుతున్నార‌ని తేలింది. వైరల్ సప్రెషన్ కొనసాగించడం, మందుల పరస్పర ప్రభావాలను పర్యవేక్షించడం, శస్త్రచికిత్స అనంతర క్రమమైన వైద్య పర్యవేక్షణ కీలకమని నిపుణులు చెబుతున్నారు. అయితే తాజాగా నిపుణులు సాధించిన ఈ విజ‌యం వ‌ల్ల హెచ్ఐవీ-టు-హెచ్ఐవీ అయ‌వయ మార్పిడి శస్త్ర చికిత్స‌ల‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగించ‌వ‌చ్చ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డింది.

ప‌రిశీలించ‌నున్న వైద్యులు..

ప్రపంచంలోనే తొలి హెచ్‌ఐవీ-టు-హెచ్‌ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయంతో మరిన్ని వైద్య కేంద్రాలు ఇలాంటి విధానాలను పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దాతల సంఖ్య పెరగడం వల్ల వేచి ఉండే జాబితాల్లో మరణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి మరింత సమానమైన వైద్య అవకాశాలు లభిస్తాయి. గత మూడు దశాబ్దాల్లో హెచ్‌ఐవీ చికిత్సలో చోటు చేసుకున్న అద్భుతమైన పురోగతికి ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించిన హెచ్‌ఐవీ, ఇప్పుడు దీర్ఘకాలికంగా నియంత్రించగలిగే పరిస్థితిగా మారింది. అలాంటి రోగులకు సంక్లిష్టమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా విజయవంతంగా చేయగలిగే స్థాయికి వైద్యశాస్త్రం చేరుకుంది.

రోగుల‌కు కొత్త ఆశ‌లు..

ప్రపంచంలోనే తొలి హెచ్‌ఐవీ-పాజిటివ్ నుంచి హెచ్‌ఐవీ-పాజిటివ్‌కు ఊపిరితిత్తుల మార్పిడి వైద్యరంగంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాద‌ని, హెచ్‌ఐవీ, అవయవ దానం గురించి ఉన్న పాత అభిప్రాయాలను సవాలు చేస్తూ, ప్రాణరక్షక మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రోగులకు కొత్త ఆశలను అందిస్తోంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు, వైద్య విధానాల అభివృద్ధితో హెచ్‌ఐవీ రోగులకు అవయవ మార్పిడి మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement