త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..

Heat Stroke | దేశంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో వైద్యులు ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నారు. ఎండల వల్ల వచ్చే అనారోగ్యాల ప్రారంభ లక్షణాలను కేవలం సాధారణ వేసవి అలసటగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వారు హెచ్చరిస్తున్నారు.

S

Health | Published On May 21, 2026, 12.16 pm IST

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
Advertisement

Heat Stroke | దేశంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో వైద్యులు ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నారు. ఎండల వల్ల వచ్చే అనారోగ్యాల ప్రారంభ లక్షణాలను కేవలం సాధారణ వేసవి అలసటగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వారు హెచ్చరిస్తున్నారు. హీట్ స్ట్రోక్ (వడదెబ్బ) ఎండల వల్ల వచ్చే అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య రూపాలలో ఒకటని, దీనిని సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే, ఇది వేగంగా వైద్య అత్యవసర పరిస్థితిగా (మెడికల్ ఎమర్జెన్సీ) మారుతుంద‌ని అంటున్నారు. సాధారణంగా ప్రజలు అనుకునేదానికి భిన్నంగా, కేవలం ఎక్కువ గంటల పాటు నేరుగా సూర్యరశ్మి కింద నిలబడటం వల్ల మాత్రమే హీట్ స్ట్రోక్ రాదు. విపరీతమైన వేడి ఉన్న ఇండోర్ (ఇళ్ల లోపల) లేదా అవుట్‌డోర్ (బయటి) వాతావరణంలో, ముఖ్యంగా డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం), హ్యుమిడిటీ (గాలిలో తేమ), సరిగ్గా గాలి ఆడకపోవడం (పూర్ వెంటిలేషన్) లేదా ఎక్కువ సమయం వేడి వాతావరణంలో గడపడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హీట్ స్ట్రోక్‌ను తీవ్రమైన ఎండ సంబంధిత పరిస్థితిగా అభివర్ణించింది, దీంతో శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరుగుతుంది, ఇది మెదడు, గుండె, మూత్రపిండాలు, కండరాలకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అత్యవసర జోక్యం లేకపోతే, ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ప్రారంభ లక్షణాలు చాలా వరకు సాధారణ అలసట లేదా డీహైడ్రేషన్ లాగే ఉండటం వల్ల చాలా మంది వీటిని గమనించకుండా వదిలేస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు, ప్రాణాలను కాపాడుకోవచ్చు. హీట్ స్ట్రోక్‌కు సంబంధించి ఎప్ప‌టికీ నిర్లక్ష్యం చేయకూడని హెచ్చరిక సంకేతాల‌ను నిపుణులు వివ‌రిస్తున్నారు.

హీట్ స్ట్రోక్ అంటే ఏమిటి..?

శరీరం తనను తాను సమర్థవంతంగా చల్లబరుచుకోలేనప్పుడు, శరీర అంతర్గత ఉష్ణోగ్రత వేగంగా, తరచూ 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగినప్పుడు హీట్ స్ట్రోక్ సంభవిస్తుంది. హీట్ స్ట్రోక్ ఎండల వల్ల వచ్చే అత్యంత తీవ్రమైన అనారోగ్యం, దీనికి తక్షణ వైద్య సహాయం అవసరం. సాధారణంగా శరీరం చెమట పట్టడం, చ‌ర్మానికి రక్త ప్రసరణను పెంచడం ద్వారా తనను తాను చల్లబరుచుకుంటుంది. కానీ విపరీతమైన వేడి లేదా డీహైడ్రేషన్ సమయంలో, ఈ కూలింగ్ సిస్టమ్ విఫలం అవుతుంది, ఇది ప్రమాదకరమైన ఓవర్‌హీటింగ్‌కు (అధికంగా వేడెక్కడానికి) దారితీస్తుంది. ద్వారకాలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్, యూనిట్ హెడ్ డాక్టర్ పరిణితా కౌర్ మాట్లాడుతూ ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికావడం వల్ల మాత్రమే హీట్ స్ట్రోక్ సంభవిస్తుంద‌ని అనుకోకూడ‌ద‌ని, విపరీతమైన వేడి పరిస్థితుల్లో ఒక వ్యక్తి శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడంలో విఫలం చెందినా కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంద‌ని తెలిపారు.

ప్రారంభ హెచ్చరిక సంకేతాలు..

హీట్ స్ట్రోక్ అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి ప్రారంభ లక్షణాలు మొదట్లో చాలా స్వల్పంగా ఉండ‌డం. చాలా మంది ప్రారంభ దశలను కేవలం అలసట లేదా సాధారణ డీహైడ్రేషన్‌గా తప్పుగా భావిస్తారని డాక్టర్ కౌర్ వివరించారు. హీట్ స్ట్రోక్ ప్రారంభ దశలలో విపరీతమైన వేడి అనుభూతి, అసౌకర్యం, కళ్లు తిరగడం, తలనొప్పి, వికారం, వాంతులు కావడం వంటివి సంభ‌విస్తాయ‌ని ఆమె చెప్పారు. అయితే కళ్లు తిరగడం లేదా తల తేలికగా అనిపించడం, తీవ్రమైన అలసట లేదా బలహీనత, తలనొప్పి, వికారం లేదా వాంతులు, విపరీతమైన శరీర వేడి అనుభూతి, అకస్మాత్తుగా అలసిపోవడం, ప్రారంభంలో విపరీతంగా చెమటలు పట్టడం, వేగవంతమైన హృదయ స్పందన, కండరాల నొప్పులు (క్రాంప్స్) వంటివి ఉంటే వైద్య స‌హాయం అవ‌స‌రం అని గుర్తించాలి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ కాలం అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల శరీరంలోని చల్లబరిచే వ్యవస్థలు దెబ్బతింటాయని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.

మానసిక గందరగోళం..

హీట్ స్ట్రోక్ తీవ్రమవుతున్న కొద్దీ మెదడుపై ప్రభావం ప‌డుతుంది. మానసిక స్థితి మారడం అత్యంత ఆందోళనకరమైన లక్షణాలలో ఒకట‌ని డాక్టర్ కౌర్ పేర్కొన్నారు. గందరగోళం, నెమ్మదిగా స్పందించడం, మాట్లాడటంలో అసాధారణతలు, చుట్టుపక్కల పరిసరాలపై అవగాహన లేకపోవడం వంటి మానసిక స్థితి మార్పులు క‌నిపిస్తాయ‌ని తెలిపారు. బాధితుడికి ఏదో తేడాగా ఉందని తెలియక ముందే కుటుంబ సభ్యులు వారిలో అసాధారణ ప్రవర్తనను గమనించాల‌ని, అనేక సార్లు,సదరు వ్యక్తికి ఏదైనా సమస్య ఉందని గ్రహించే ముందే కుటుంబ సభ్యులు వారిలో చిరాకు, అశాంతి లేదా అసాధారణ ప్రవర్తనలను గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని ఆమె వివరించారు. మేయో క్లినిక్ తెలిపిన ప్రకారం గందరగోళం, ఆందోళన, మాట ముద్దబారడం, మతిభ్రమించడం (డెలిరియం), ఫిట్స్ (సీజర్స్) లేదా స్పృహ తప్పడం వంటివన్నీ హీట్ స్ట్రోక్ కు చెందిన అత్యవసర హెచ్చరిక సంకేతాలుగా భావించాలి.

ప్రాణాంతకంగా మారుతుందా..?

అవును, చికిత్స చేయని హీట్ స్ట్రోక్ కీలక అవయవాలను వేగంగా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన హీట్ స్ట్రోక్ వల్ల తక్షణమే చికిత్స అందించకపోతే మెదడు గాయం, కిడ్నీ ఫెయిల్యూర్ (మూత్రపిండాల వైఫల్యం), గుండె సమస్యలు, కండరాలు క్షీణించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చివ‌ర‌కు మరణం సంభవించే అవ‌కాశాలు ఉంటాయి. పెరుగుతున్న శరీర ఉష్ణోగ్రతపై సరైన శ్రద్ధ పెట్టడం అవసరమ‌ని, లేకపోతే అది ప్రాణాంతకమయ్యే స్థాయికి దారితీయవచ్చ‌ని డాక్ట‌ర్ కౌర్ అన్నారు. తీవ్రమైన కేసులలో స్పృహ తప్పడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అపస్మారక స్థితి, ఫిట్స్ లేదా మూర్ఛ రావడం వంటివి సంభ‌విస్తాయ‌ని తెలిపారు. ఒకవేళ చికిత్స చేయకుండా వదిలేస్తే, హీట్ స్ట్రోక్ మెదడుతోపాటు శరీరంలోని కీలక అవయవాలకు నష్టం కలిగిస్తుంద‌ని ఆమె పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులు, అథ్లెట్లు (క్రీడాకారులు), దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, తక్కువగా ద్రవాలు తీసుకునే వ్యక్తుల‌కు హీట్ స్ట్రోక్ ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌ని చెప్పారు. అలాగే గుండె జబ్బులు, మధుమేహం (డయాబెటిస్), శ్వాసకోశ వ్యాధులు, ఊబకాయం లేదా కదలికలు తక్కువగా ఉన్నవారు హీట్‌వేవ్స్ (వడగాల్పులు) సమయంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారని తెలిపారు. అధిక హ్యుమిడిటీ, పేలవమైన వెంటిలేషన్, మద్యం సేవించడం, కఠినమైన శారీరక శ్రమ, డీహైడ్రేషన్ వంటివి ఈ ముప్పును మరింత పెంచుతాయ‌ని అన్నారు.

హీట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి..?

హీట్ స్ట్రోక్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ క‌నుక దీనికి తక్షణ చర్య అవసరం. బాధితుడిని వెంటనే వేడి వాతావరణం నుండి దూరంగా తీసుకెళ్లాలని డాక్టర్ కౌర్ సూచించారు. వారిని ఇంటి లోపలికి, నీడ ఉన్న చోటికి లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశానికి తరలించడం ద్వారా ప్రాథ‌మిక చికిత్స చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇతర అత్యవసర చర్యలలో అదనపు దుస్తులను వదులు చేయడం లేదా తొలగించడం, చర్మంపై చల్లని, తడి ట‌వ‌ల్స్‌ను ఉంచడం, శరీరంపై చల్లని నీటిని చల్లడం, మెడ, తల, గజ్జలు, చంకలలో ఐస్ ప్యాక్‌లను ఉపయోగించడం, సదరు వ్యక్తి స్పృహతో, అప్రమత్తంగా ఉంటేనే ద్రవాలను అందించడం, తక్షణమే అత్యవసర వైద్య సేవలను అందించ‌డం వంటివి చేయాలి. వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు వేగంగా చల్లబరచడం (రాపిడ్ కూలింగ్) చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు, ఎందుకంటే ఆలస్యం అవయవ నష్టాన్ని తీవ్రం చేస్తుంది. అయితే ఎలాంటి వైద్య పర్యవేక్షణ లేకుండా సొంత వైద్యం (సెల్ఫ్-మెడికేషన్) చేసుకోవడాన్ని ఏ పరిస్థితిలోనైనా క‌చ్చితంగా నివారించాలి.

హీట్ స్ట్రోక్‌ను ఎలా నివారించాలి..?

తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల సమయంలో నివారణే అత్యుత్తమ రక్షణ అని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ కౌర్ సిఫార్సు చేసిన నివారణ చర్యలలో శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవడం (హైడ్రేటెడ్‌గా ఉండటం), మధ్యాహ్నం వేళల్లో నేరుగా ఎండలోకి వెళ్లకుండా ఉండటం, తేలికపాటి, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, బహిరంగ కార్యకలాపాల సమయంలో తరచూ విరామం తీసుకోవడం, గరిష్ట వేడి ఉండే సమయాల్లో కఠినమైన పనులను నివారించడం వంటివి ఉన్నాయి. శరీరం చాలా తరచూ అనారోగ్యం ప్రారంభం కావడానికి ముందే కొన్ని సంకేతాలను చూపిస్తుందని, వాటిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. హీట్ స్ట్రోక్ కేవలం వేసవి వేడి వల్ల కలిగే తీవ్రమైన అలసట మాత్రమే కాదు. ఇది తక్కువ సమయంలోనే మెదడు, గుండె, మూత్రపిండాలు, ఇతర కీలక అవయవాలపై ప్రభావం చూపే తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి. ముఖ్యంగా తీవ్రమైన వడగాల్పుల సమయంలో కళ్లు తిరగడం, వికారం, గందరగోళం, అసాధారణ ప్రవర్తన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా స్పృహ తప్పడం వంటి లక్షణాలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ముందస్తు గుర్తింపు, వేగంగా చల్లబరచడం, సకాలంలో వైద్య జోక్యం ప్రాణాలను కాపాడుతాయి. భారత్‌ తీవ్రమైన, సుదీర్ఘమైన వడగాల్పులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, హీట్ స్ట్రోక్ ప్రారంభ హెచ్చరిక సంకేతాలను అర్థం చేసుకోవడం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైంద‌ని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement