త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vitamin B12 Supplements | విట‌మిన్ బి12 స‌ప్లిమెంట్ల‌ను రోజూ తీసుకోవ‌చ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?

Vitamin B12 Supplements | ప్రతిరోజూ అవసరమైన విటమిన్లను కేవలం ఆహారం ద్వారా పొందడం చాలా మందికి వీలు కాదు. అందుకే సప్లిమెంట్ల అవసరం వస్తుంది. అలాంటి ముఖ్యమైన సప్లిమెంట్లలో ఒకటి విటమిన్ బి12 (కోబాలమిన్). విటమిన్ బి12 నీటిలో కరిగే పోషక పదార్థం.

S

Health | Published On Mar 6, 2026, 12.20 pm IST

Vitamin B12 Supplements | విట‌మిన్ బి12 స‌ప్లిమెంట్ల‌ను రోజూ తీసుకోవ‌చ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?
Advertisement

Vitamin B12 Supplements | ప్రతిరోజూ అవసరమైన విటమిన్లను కేవలం ఆహారం ద్వారా పొందడం చాలా మందికి వీలు కాదు. అందుకే సప్లిమెంట్ల అవసరం వస్తుంది. అలాంటి ముఖ్యమైన సప్లిమెంట్లలో ఒకటి విటమిన్ బి12 (కోబాలమిన్). విటమిన్ బి12 నీటిలో కరిగే పోషక పదార్థం. ఇది నరాల ఆరోగ్యం, మెదడు పనితీరు, ఎర్ర రక్త కణాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సహజంగా మాంసం, చేపలు, గుడ్లు, పాల పదార్థాలు వంటి జంతు ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఈ విటమిన్ లోపం ఉంటే అనీమియా (ర‌క్త‌హీన‌త‌), అలసట, నరాల సమస్యలు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే విటమిన్ బి12 సప్లిమెంట్ల‌ను ప్రతిరోజూ తీసుకోవడం సురక్షితమా ? అనే ప్రశ్నకు నిపుణులు స‌మాధానం చెబుతున్నారు.

ప్రతిరోజూ విట‌మిన్ బి12ను తీసుకోవచ్చా?

బెంగళూరులోని ఆస్ట‌ర్ సీఎంఐ హాస్పిట‌ల్ లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ పూజా పిళ్లై తెలిపిన‌ వివరాల ప్రకారం విటమిన్ బి12 సప్లిమెంట్ల‌ను సాధారణంగా ప్రతిరోజూ తీసుకోవ‌చ్చ‌ని తెలిపారు. విట‌మిన్ బి12 లోపం ఉన్న‌వారు, శాకాహారులు, వ‌య‌స్సు పైబ‌డిన వారు, శ‌రీరంలో పోష‌కాలు స‌రిగ్గా శోషించ‌బ‌డ‌ని వారు విట‌మిన్ బి12 స‌ప్లిమెంట్ల‌ను తీసుకోవ‌చ్చ‌ని అన్నారు. ఈ స‌ప్లిమెంట్ల వ‌ల్ల ఎర్ర ర‌క్త క‌ణాలు ఉత్ప‌త్తి అవుతాయి. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. న‌రాల ఆరోగ్యం మెరుగు పడి న‌రాల బ‌ల‌హీనత నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరం శ‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌డంలో ఈ విట‌మిన్ స‌హాయం చేస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిన్ కావడంతో శరీరానికి అవసరమైన మోతాదుకంటే ఎక్కువగా తీసుకున్నా సాధారణంగా అదనపు భాగం మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. అందువల్ల సూచించిన మోతాదులో తీసుకుంటే సాధారణంగా సురక్షితమేన‌ని తెలిపారు.

విట‌మిన్ బి12 లోపం వల్ల వచ్చే ప్రమాదాలు..

కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ బి12 లోపం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చ‌ని తేలింది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనం ప్రకారం పెర్నిషియస్ అనీమియా కారణంగా బి12 లోపం ఉన్నవారిలో జీర్ణాశ‌య‌ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉంటుందని వెల్ల‌డైంది. 2024లో 788 మందిపై జరిగిన మరో పరిశోధనలో క్యాన్సర్ రోగుల్లో బి12 స్థాయిలు తక్కువగా ఉండడం కనిపించిందని గుర్తించారు. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ ప్రారంభ దశలో ఈ లోపం ఎక్కువగా కనిపించిందని పేర్కొన్నారు.

విట‌మిన్ బి12 లోపం లక్షణాలు..

తీవ్రమైన అలసట లేదా బలహీనత, వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నోరు లేదా నాలుకలో పుండ్లు, చర్మం తెల్లబడటం వంటి ల‌క్ష‌ణాలు విట‌మిన్ బి12 లోపం కార‌ణంగా క‌నిపిస్తాయి. అలాగే చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ లేన‌ట్లు అనిపించ‌డం, సూదుల్తో గుచ్చిన‌ట్లు ఉండ‌డం, చూపు సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్, చిరాకు, ప్రవర్తనలో మార్పులు క‌నిపిస్తాయి. విట‌మిన్ బి12 లోపం ఉంటే అది ఇత‌ర వ్యాధుల‌కు కూడా కార‌ణం అవుతుంది. దీంతో గ్యాస్ట్రిటిస్, పెర్నిషియస్ అనీమియా, జీర్ణవ్యవస్థ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

విట‌మిన్ బి12 సప్లిమెంట్లు ఎలా తీసుకోవాలి?

డాక్టర్ పూజా పిళ్లై సూచనల ప్రకారం వైద్యుడి సలహా లేకుండా అధిక మోతాదులో తీసుకోవద్దు. చాలా ఎక్కువ మోతాదులు తీసుకుంటే తలనొప్పి, వాంతులు, విరేచనాలు లేదా చర్మ అలర్జీలు వంటి దుష్ప్రభావాలు ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంటుంది. కొన్నిసార్లు అధిక మోతాదులు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కార‌ణం అవుతాయి. అందువల్ల ముందుగా రక్త పరీక్ష ద్వారా బి12 లోపం ఉందో లేదో నిర్ధారించుకోవాలి. డాక్టర్ సూచించిన మోతాదులోనే తీసుకోవాలి. స్వయంగా అధిక మోతాదులో ఇంజెక్షన్లు లేదా టాబ్లెట్లు వాడకూడదు. ఇక అదనంగా బి12 ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, ఫోర్టిఫైడ్ సిరియల్స్ వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బి12 ల‌భిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement