త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

డబ్బులు చెల్లిస్తే ఇల్లు కచ్చితంగా ఇప్పిస్తాం.ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది....అంటూ మీ వెంట బడుతారు. అప్పుడు మీరేం చేయాలంటే

a

Flash news | Published On Jul 26, 2026, 12.45 pm IST

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
Advertisement
  • *మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ*

  • ఇటువంటి ప్రకటనల పట్ల తస్మాత్ జాగ్రత్త

  • డబ్బులు ఇచ్చి మోసపోకండి

  • ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మధ్యవర్తులు ఉండరు

  • అనుమానాలు ఉంటే ‘040-24603572’కు కాల్ చేయండి

  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచనలు

 

త్రినేత్ర.న్యూస్ : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయతలపెట్టిన ఇందిరమ్మ టవర్స్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం.. ముందస్తుగా డిపాజిట్ చేసే 10వేల రూపాయల పేరుతో సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ .. అధికారిక ప్రకటన విడుదల చేశారు.

డబ్బులు చెల్లిస్తే..ఇల్లు ఇచ్చేస్తాం

సాధారణంగా ఇంత మంచి పథకం కోసం నామమాత్ర డిపాజిట్ చెల్లించాల్సి వచ్చినప్పుడు.. ఈ ప్రక్రియలో తప్పనిసరిగా సైబర్ నేరగాళ్లు ప్రవేశిస్తారని కమిషనర్ తెలిపారు.లబ్ధిదారుల నుంచి రూ.10,000 ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో, సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింకులతో బురిడీ కొట్టించే ప్రమాదముందని ఆయన స్పష్టం చేశారు. "డబ్బులు చెల్లిస్తే ఇల్లు కచ్చితంగా ఇప్పిస్తాం" అని నమ్మించే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. "ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది" అని భయపెట్టి, తొందరపాటులో నగదు బదిలీ చేయించుకోవడం నేరగాళ్ల ప్రధాన ఎత్తుగడ అని హెచ్చరించారు.

మధ్యవర్తులు ఉండరని తెలుసుకోండి

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు తావులేదని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని కమిషనర్ సజ్జనార్ మరోమారు గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండీ సొమ్ము భద్రంగా ఉంటుందని, ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని వివరించారు.

లింకులు..ఏపీకే ఫైల్స్.. బీకేర్ ఫుల్

వాట్సాప్ లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మి ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసగించే ప్రమాదం ఉందని వెల్లడించారు. లబ్ధిదారులకు సహకరిస్తామనే నెపంతో ‘ఎనీడెస్క్’, ‘టీమ్‌వ్యూర్’ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేస్తారని పేర్కొన్నారు.

‘040-24603572’కు కాల్ చేయండి

యూపీఐ పిన్ అనేది కేవలం డబ్బులు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రీఫండ్ సొమ్మును స్వీకరించడానికి పిన్ నంబర్ నొక్కాల్సిన అవసరం లేదనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలని సజ్జనార్ తెలిపారు. అపరిచిత వ్యక్తులకు ఆధార్ కార్డుల ఫొటోలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు పంపకూడదని హితవు పలికారు.
ఈ పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘040-24603572’ అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, తక్షణమే పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసేందుకు 1930 ఉచిత హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

****

ట్యాగ్స్:

Advertisement
Advertisement