త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic Review | టాక్సిక్ రివ్యూ – గ‌న్స్‌, వ‌య‌లెన్స్‌..బోల్డ్ సీన్ల మ‌ధ్య న‌లిగిపోయిన క‌థ‌

క‌థ లేకుండా పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ లాంటి జిమ్మిక్కులేవి ప‌నిచేయ‌వు. క‌థ‌ను హీరో డామినేట్ చేస్తే రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చెప్ప‌డానికి టాక్సిక్ సినిమా ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.

N

Entertainment | Published On Aug 26, 2026, 12.46 pm IST

Toxic Review |  టాక్సిక్ రివ్యూ – గ‌న్స్‌, వ‌య‌లెన్స్‌..బోల్డ్ సీన్ల మ‌ధ్య న‌లిగిపోయిన క‌థ‌
Advertisement

Toxic Review | ద్రౌప‌ది శ‌ప‌థ‌మే కౌర‌వ సామ్రాజ్యాన్ని నేల‌కూల్చింది. సీత‌పై ఉన్న వ్యామోహ‌మే రావ‌ణుడి ప‌త‌నానికి దారితీసింది. చ‌రిత్ర‌లో ఆడ‌వాళ్ల వ‌ల్ల ఎన్నో సామ్రాజ్యాలు నేల‌కూలాయి. ఎంద‌రో గొప్ప రాజులు స్త్రీ వ్యామోహంతో చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోయారు. అలాంటి ఓ రాజు క‌థే టాక్సిక్‌. పుట్టుక‌తోనే తండ్రిని కోల్పోతాడు రాయ‌(య‌శ్‌). త‌న జీవితాన్ని ధార‌పోసి అక్క గంగ (న‌య‌న‌తార‌) అత‌డిని పెంచి పెద్ద చేస్తుంది. అవ‌మానాలు, బాధ‌లు అత‌డిని క‌ఠిన మ‌న‌స్కుడిగా మార్చేస్తాయి. గోవాకు నేర సామ్రాజ్యానికి రాజును కావాల‌నే ఆలోచ‌న‌తోనే రెబెకాను (తారా సుతారియా) పెళ్లిచేసుకుంటాడు. సింహాస‌నం అధిష్టించ‌డ‌మే త‌రువాయి అనుకుంటున్న త‌రుణంలోనే ఓ స‌ర్క‌స్ కంపెనీలో ప‌నిచేసే నాదియా(కియారా అద్వానీ)... రాయ జీవితంలోకి ప్ర‌వేశిస్తుంది. అనుమానంతో మొద‌లైన వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది.

గంగ ప్రాణ త్యాగం

ప‌ర స్త్రీ వ్యామోహంలో ప‌డి భ‌ర్త త‌న‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం రెబెకా త‌ట్టుకోలేక‌పోతుంది. ఆమె తండ్రి రాయ‌ను టార్గెట్ చేస్తాడు. రెబెకా తండ్రి మ‌నుషుల బారి నుంచి త‌మ్ముడిని కాపాడుకోవ‌డం కోసం గంగ ప్రాణ త్యాగం చేస్తుంది. విధి ఆడిన నాట‌కంలో తాను చేయ‌ని త‌ప్పుకు రాయ దృష్టిలో నాదియా ఓ విల‌న్‌గా మారిపోతుంది. ఆమెపై కోపం, ద్వేషంలో రాయ నిరంత‌రం మ‌త్తులో మునిగిపోతాడు. గోవాను రాజులా ఏలాల్సిన రాయ జీవితం చివ‌ర‌కు ఎలా విషాదంగా ముగిసింది అన్న‌దే మిగిలిన క‌థ‌.

క‌న్ఫ్యూజింగ్‌...

అవ‌స‌రాలు, అధికారాల కోసం అడ్డ‌దారులు తొక్కే పాత్ర‌లు త‌ప్ప హీరోలు, విల‌న్లు లేరు ఈ నాట‌కంలో అంటూ ఓ సినిమాలో సాయికుమార్ డైలాగ్ చెబుతాడు. టాక్సిక్ అలాంటి క‌థే. నేర సామ్రాజ్యానికి రాజుగా మారేందుకు కొంద‌రు వేసే ఎత్తులు, వాటి కోసం ప‌న్నే కుట్ర‌లు...వీటిలో న‌లిగిపోయే సామాన్య జీవితాల‌తో ఈ క‌థ‌ను రాసుకున్నారు డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్‌. పాయింట్ మంచిదే. కానీ చెప్పే విధానంలోనే ద‌ర్శ‌కురాలు త‌ప్ప‌ట‌డుగులు వేశారు. ప‌రిస్థితులు కొంద‌రు మ‌నుషుల‌ను ఎలా మారుస్తాయి? ఆకార‌ణ‌మైన ద్వేషం, కోపం ఎలాంటి అశాంతిని నింపుతాయ‌న్న‌దే ఈ సినిమాలో చూపించే విధానం చాలా క‌న్ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది.

డామినేట్‌...

ఎప్పుడూ కూడా క‌థ‌ను హీరో డామినేట్ చేయ‌కూడ‌దు. క‌థ‌లో హీరోతో పాటు మిగిలిన పాత్ర‌లు ఓ అంత‌ర్భాగంగానే ఉండాలి. కానీ టాక్సిక్‌లో మితిమీరిన వ‌య‌లెన్స్‌, గ‌న్స్ సౌండ్స్ మ‌ధ్య అస‌లు క‌థ గాలిలో క‌లిసిపోయింది.
హీరో త‌న‌కు తానే ఎలివేష‌న్ ఇచ్చుకుంటూ ఓ డైలాగ్ చెప్పడం, మందుతాగ‌డం, ఓ ఇంటిమేట్ సీన్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌...సినిమా మొత్తం ఇలాగే సాగిపోతుంది.

బోల్డ్ సీన్స్‌...

య‌శ్‌, కియారా మ‌ధ్య ప్రేమ బంధాన్ని బోల్డ్ సీన్ల‌తోనే స‌రిపెట్టారు. త‌న సామ్రాజ్యాన్ని, ఆప్తుల‌ను కాద‌ని వ‌చ్చేంతగా ఆమెను య‌శ్ ఆరాధించ‌డానికి కార‌ణ‌మేమిట‌న్న‌ది చూపించ‌లేదు. త‌మ్ముడిని గంగ కింగ్ మేక‌ర్‌గా ఎందుకు చూడాల‌ని అనుకుందో ఆవిష్క‌రించ‌లేదు. సెకండాఫ్ రివేంజ్ ఫార్ములాలోకి క‌థ ట‌ర్స్ అవుతుంది. తండ్రిపై ద్వేషంతో అత‌డి సామ్రాజ్యాన్ని కూల్చేయాల‌ని కొడుకు అనుకుంటాడు. అత‌డికి మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తాడు. అప్పుడే ఓ ట్విస్ట్ వ‌స్తుంది. ఇర‌వై ఏళ్ల క్రిత‌మే శంక‌ర్ చేసిన అప‌రిచితుడు సినిమాలోని ఓ పాయింట్ తెర‌పైకి వ‌స్తుంది. ఇక అక్క‌డి నుంచి వ‌చ్చే విధ్వంసం గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

జిమ్మిక్కులు...

క‌థ లేకుండా పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ జిమ్మిక్కులు ప‌నిచేయ‌వు. అందుకు బెస్ట్ ఎంగ్జాపుల్ టాక్సిక్‌. కేజీఎఫ్ విష‌యంలో అద్భుతం జ‌రిగింది క‌దా అని ప్ర‌తిసారి అదే ఫార్ములాను ఫాలో అవుతానంటే క‌ద‌ర‌దు. కేజీఎఫ్‌తో వ‌చ్చిన క్రేజ్‌ను ఎలా నిల‌బెట్టుకోవాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో య‌శ్ ఈ సినిమా చేసిన‌ట్లుగా అనిపిస్తుంది.

కియారా  హైలైట్

య‌శ్ యాక్టింగ్ ప‌రంగా సినిమాలో చేసిందేమీ లేదు. , డైలాగ్‌లు చెప్ప‌డం, ఫైట్లు చేయ‌డం ఇవే చేశాడు. ఆ హంగామా అంతా అన‌వ‌స‌ర‌పు వ్య‌వ‌హార‌మే అనిపిస్తుంది. రూమీ పాత్ర ఎందుకొస్తుందో అంతుప‌ట్ట‌దు. మందుతాగ‌డం, సిగ‌రెట్లు కాల్చ‌డం లాంటి సీన్లు హీరోలే చేయ‌లా...హీరోయిన్లు చేస్తే త‌ప్పేంటి అని డైరెక్ట‌ర్ ఈ సినిమాలో చూపించాల‌ని ఫిక్సైన‌ట్లు ఉన్నారు. హీరోయిన్లంద‌రూ రెబెల్స్‌గానే క‌నిపిస్తారు. త‌మ‌కు ఏది న‌చ్చితే అది చేసేస్తుంటారు. ఐదుగురు హీరోయిన్ల‌లో కియారా అద్వానీ ఎక్కువ‌గా హైలైట్ అయ్యింది. య‌శ్ సోద‌రిగా న‌య‌న‌తార క‌నిపించింది. వీరిద్ద‌రు త‌ప్ప మిగిలిన పాత్ర‌ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేవు. వారు చేసినందు వ‌ల్ల ఆ పాత్ర‌ల‌కు వ‌చ్చిన ఉప‌యోగం అంటూ ఏం లేదు.

ప్రొడ్యూస‌ర్ ఈ సినిమాకు అస‌లైన హీరో. రూపాయి పెట్టాల్సిన చోట ప‌ది రూపాయ‌లు ఖ‌ర్చుచేశాడు. మేకింగ్ ప‌రంగా సినిమాబాగుంది. ర‌వి బ‌స్రూర్ బీజీఎమ్‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయాయి. ప్ర‌తి సీన్‌కు మోత‌మోగించాడు.

గ‌న్స్‌... బోల్డ్ సీన్స్‌..వ‌య‌లెన్స్‌..టాక్సిక్‌లో ఇది త‌ప్ప మ‌రేం లేదు...

 

Advertisement
Advertisement