Bhogi Review | భోగి రివ్యూ – తెలంగాణ కథతో శర్వానంద్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
నమ్మకం ప్రాణాలు నిలబెడుతుంది. మూఢనమ్మకం ప్రాణాలు తీస్తుంది. ఆ రెండింటి మధ్య తేడాను చెప్పే సినిమానే భోగి. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది.
Entertainment | Published On Nov 27, 2026, 6.37 pm IST
Bhogi Review | పౌరాణిక గ్రంథాలు, అందులోని మంత్రాలు ప్రజలను విజ్ఞానవంతులను చేయడానికి ఉపయోగపడాలి. నమ్మకాలు నలుగురి ప్రాణాలు నిలిపేలా ఉండాలి. కానీ ఋషులు వేదాంతులు రాసిన పౌరాణిక గ్రంథాలను మంచి కోసం కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వినియోగిస్తున్నారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచుతున్నారు. తమ కలలు, లక్ష్యాలను సాధించేందుకు అడ్డదారుల్లో అడుగులు వేస్తూ క్షుద్ర విద్యలు, పూజలను నమ్ముకుంటే మిగిలేది అనర్థమే అనే అంశాలతో భోగి మూవీ రూపొందింది.
తెలంగాణ నేపథ్యం...
ఈ మెసేజ్‌కు తెలంగాణ నేపథ్యాన్ని, ఇక్కడి మట్టి మనుషులు వెతలు, బతుకులను జోడించారు దర్శకుడు సంపత్ నంది. 1960 దశకంలో తెలంగాణలో పటేండ్ల వ్యవస్థ బలంగా ఉండేది. ఊరికి దేవుడిగా పటేల్‌ను ప్రజలు కొలిచేవారు. కనీసం తలెత్తి దొరను చూడటానికి కూడా బయటపడేవారు. దొర ముఖం చూడకుండానే తమ జీవితాన్ని చాలించేవారు. ఆనాటి వివక్ష, పటేండ్ల అహంకారం, ఆధిపత్య ధోరణిని ఎదురించి పోరాడిన ఓ యువకుడి జీవితాన్ని భోగిలో సంపత్‌నంది అర్థవంతంగా చూపించారు.
కమ్మరోళ్ల గంగ...
కమ్మరోళ్ల గంగది బొగ్గులగుట్ట ఊరు. తల్లిదండ్రులు దూరం కావడంతో దాంతో తన ఐదుగురు చెల్లెండ్లను కంటికిరెప్పలా కాపాడుతుంటాడు. ఐదుగురికి ఒక్కో నది పేరు పెడుతాడు. పెద్ద చెల్లి కావేరికి ఓ పెండ్లి సంబంధం కూడా ఖాయం చేస్తాడు. బొగ్గులగుట్ట చుట్టపక్కలో ఉన్న గిరిజన గ్రామాల్లో పెండ్లి కానీ అమ్మాయిలు కనిపించకుండాపోతారు. వారి అదృశ్యానికి బొగ్గులగుట్ట పటేల్ కారణమని గంగ తెలుసుకుంటాడు. ఇకపై ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూస్తానని పటేల్‌కే సవాల్ విసిరుతాడు.
కానీ ఆ సవాల్ గంగ కుటుంబాన్ని కష్టాల్లోకి నెడుతుంది. అతడి చెల్లెండ్ల ప్రాణాల మీదకు తెస్తుంది. దొరను ఎదురించడం కోసం చివరకు గంగ కత్తిపడతాడు. ఆ తర్వాత ఏమైంది? అమ్మాయిల కనిపించకుండాపోవడానికి దొరకు ఉన్న సంబంధమేమిటి? దొర బారి నుంచి తన చెల్లెండ్లను గంగ కాపాడుకున్నాడా? అసలు దొర చేత ఈ తప్పును చేయించింది ఎవరూ అన్నదే మిగిలిన కథ.
కుల వృత్తులు...
హీరోలు అంటే తెలుగు సినిమాల్లో రౌడీ, గ్యాంగ్‌స్టర్, బిజినెస్‌మెన్...ఇలా కొన్ని పాత్రలకే పరిమితం చేసేశారు దర్శకుడు. కానీ కథానాయకుడిని కులవృత్తుల్లో చూపించడం కొత్తగా ఉంది. ఇందులో శర్వానంద్ (Sharwanand) కమ్మరి పనిచేసే యువకుడిగా కనిపిస్తాడు. ఎండ్ల బండి ఇరుసులు , కత్తులు గొడ్డండ్లు తయారు చేసే సీన్లలో నాచురల్‌గా చూపించారు. పాత్రలో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. హీరో చుట్టూ ఉన్నవాళ్లంతా షర్ట్స్ లేకుండా 1960ల కాలం నాటికి తగ్గట్లుగా కనిపిస్తారు. కానీ హీరో మాత్రం ఎప్పుడూ షర్ట్స్‌లోనే ఉంటాడు. అది కూడా నేటి ట్రెండ్‌ను తలపించే డిజైన్స్‌లో ఉంటాయి. ఆ విషయంలో దర్శకుడు కొంత కేర్ తీసుకుంటే బాగుండేది.
గ్లామరస్‌గా...
హీరోయిన్ అంటే పొట్టి పొట్టి డ్రెస్సుల్లో గ్లామరస్‌గా కనిపించాలి. హీరోతో పాటలు పాడాలనే రూల్‌కు భిన్నంగా అనుపమ (Anupama Parameswaran) పాత్ర సాగుతుంది. అడవిలోని మోదుగు ఆకులు సేకరిస్తూ జీవితాన్ని సాగించే ధైర్యవంతురాలైన అమ్మాయిగా చూపించాడు. అస్సలు మేకప్ లేకుండా అనుపమ డీ గ్లామర్ లుక్‌తో బాగా నటించింది. దొరకు వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్‌లో అనుపమ నటన బాగుంది.
తెలంగాణ యాసలో...
తెలంగాణ యాసలో వచ్చే డైలాగ్స్, పాటలు భోగికి ప్రాణం పోశాయి. ఎగిలివారంగా పాటతో పల్లెప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లారు దర్శకుడు. తెలంగాణ పల్లెల్లో వాడే మాటలే ఇందులో డైలాగ్స్‌గా కనిపిస్తాయి.
అదిలాబాద్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో కుంటాల జలపాతం, చెన్నూరు దేవస్థానంతో పాటు కొన్ని రియల్ లోకేషన్స్‌లో సినిమాను షూట్ చేశారు. తెలంగాణలో సినిమాలకు సరిపడా మంచి లొకేషన్స్ ఉన్నాయని చాటిచెప్పారు.
తీసిన విధానంలోనే...
భోగి సినిమాకు మంచి యాక్టర్లు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కుదిరారు. బొగ్గుల గుట్ట సెటప్ అదిరిపోయింది. దొరల కాలం...వారి ఆధిపత్యాన్ని ఎదురించే ఓ సామాన్య యువకుడి పోరాటం...ఈ క్రమంలో ఎదురయ్యే సంఘర్షణ, ఆటుపోట్లు.....హీరోయిజం, ఎలివేషన్లు, డ్రామా, సెంటిమెంట్ ఇలా అన్ని హంగులున్న కథ ఎంచుకున్నాడు దర్శకుడు. కానీ తీసిన విధానంలోనే లోపాలు ఉన్నాయి.
ఓ సినిమా, కథ ఏదైనా ఆడియెన్స్ మనసులో ఎక్కువ కాలం నిలవాలంటే భావోద్వేగాలే కీలకం. ఓ కథలోని పాత్రలు, వాటి తాలూకు సంఘర్షణ, ప్రేక్షకుడు సహానుభూతి చెందేలా చెప్పే నేర్పు దర్శకుడికి ఉండాలి. ఎమోషన్స్ లేకుండా దర్శకుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం ఉండదు. భోగిలో అదే జరిగింది. హీరో కుటుంబానికి జరిగిన అన్యాయంలో, దొరను ఎదురించి అతడు సాగించే పోరాటంలో ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే బలమైన ఉద్వేగం కనిపించదు. ఇలా జరిగి ఉండొచ్చు అనే భావన ఏ కోశన రాదు.
పాత్రలను క్రియేట్ చేయడం కాదు...వాటిని వాడుకోవడం కూడా తెలిసి ఉండాలి. మందారం పాత్రలో డింపుల్ హయతి తాత్వికమైన డైలాగ్స్ చెప్పించాడు. అనుపమది అదే పరిస్థితి. హీరో పోరాటాన్ని కళ్లు అప్పగించి చూడటం తప్పితే వీరు చేసింది ఏం లేదు అన్నట్లుగా ముగించడం బాలేదు. మూఢనమ్మకాలపై దర్శకుడు ఇచ్చిన సందేశంలో ఆలోచనాత్మకంగా అనిపించదు.
అచ్చ తెలంగాణ కథ...
భోగి అచ్చ తెలంగాణ (Telangana)నేపథ్యంలో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. ప్రయత్నం మంచిదే కానీ తీసిన విధానంలోనే కొన్ని తప్పులు జరిగాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shruti Haasan | ఆకాశంలో ఒక తార కోసం శృతి హాసన్ రెమ్యూనరేషన్ ఎంతంటే ? – హీరోయిన్ కంటే ఎక్కువే!
నవంబర్ 27, 2026

Rustum | చిరంజీవి టైటిల్‌తో హనుమాన్ నిర్మాతల సినిమా – హీరో ఎవరంటే?
నవంబర్ 27, 2026

Meenakshi Chaudhary | కంఫర్ట్ జోన్ దాటి చేసిన సినిమా – “వృషకర్మ”తో ఆ భయాలు పోయాయి – మీనాక్షి చౌదరి కామెంట్స్
నవంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..



