త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Metro | ప‌దో వ‌సంతంలోకి హైద‌రాబాద్ మెట్రో రైలు..

Hyderabad Metro | భాగ్య‌న‌గ‌ర ర‌వాణా ముఖ‌చిత్రాన్ని మార్చిన హైద‌రాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) ప‌దో వ‌సంతంలోకి అడుగుపెట్టింది. స‌రిగ్గా తొమ్మిదేండ్ల క్రితం 2017 నవంబర్‌ 28న ప్రధాని మోదీ, నాటి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

G

Hyderabad | Published On Nov 28, 2026, 7.50 am IST

Hyderabad Metro | ప‌దో వ‌సంతంలోకి హైద‌రాబాద్ మెట్రో రైలు..
Advertisement

Hyderabad Metro | త్రినేత్ర న్యూస్‌: భాగ్య‌న‌గ‌ర ర‌వాణా ముఖ‌చిత్రాన్ని మార్చిన హైద‌రాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) ప‌దో వ‌సంతంలోకి అడుగుపెట్టింది. స‌రిగ్గా తొమ్మిదేండ్ల క్రితం 2017 నవంబర్‌ 28న ప్రధాని మోదీ, నాటి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఆ మరుసటిరోజు నుంచి మెట్రోరైలు సేవలు దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ వెత‌ల నుంచి కొంత ఊర‌ట‌నిచ్చిన మెట్రో సేవ‌లు.. తొలుత 30 కిలోమీట‌ర్ల మార్గంతో మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం 3 కారిడార్ల‌లో (రెడ్, బ్లూ, గ్రీన్ లైన్లు) 57 స్టేషన్లతో దాదాపు 69.2 కిలోమీటర్ల మేర విస్తరించాయి. ప్ర‌తీరోజు 25,600 కిలోమీట‌ర్ల‌కుపైగా దూరం ప్ర‌యాణిస్తున్న‌ది. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్ర‌యాణ ట్రిప్పుల సంఖ్య 100 కోట్ల (1 బిలియన్)కు చేరువైంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 94.2 కోట్ల‌ మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం రోజుకు సగటున 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. గరిష్ఠంగా 5.20 లక్షల వరకు చేరిన రోజులు కూడా ఉన్నాయి.

ఈ తొమ్మిదేండ్ల‌లో ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించిన హైద‌రాబాద్ మెట్రో.. విస్త‌ర‌ణ కోసం ఎదురుచూస్తున్న‌ది. ఏప్రిల్ 2026లో ఎల్ అండ్ టి (L&T) సంస్థ నుంచి రూ.13,600 కోట్ల ఒప్పందంతో మెట్రో మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే రుణ ప్ర‌క్రియ పూర్తికాక‌పోవ‌డంతో అది సందిగ్ధంలో ప‌డిపోయింది. మ‌రోవైపు రెండో ద‌శ‌లో 7 మార్గాల్లో 122.9 కి.మీ.మేర‌ విస్త‌రించాల‌న్న తెలంగాణ స‌ర్కార్‌ ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న లేక‌పోవ‌డంతో అది కూడా నిలిచిపోయింది.

ప‌ర్యావ‌ర‌ణ హితం మ‌న మెట్రో..

మెట్రో కార్యకలాపాల వల్ల సుమారు 629 మిలియన్ కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి. స్టేషన్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన 12.4 MWp సోలార్ పవర్ ద్వారా 15 శాతం విద్యుత్ అవసరాలను సమకూర్చుకుంటున్న‌ది. రీజ‌న‌రేటివ్ బ్రేకింగ్ విధానం ద్వారా మెట్రో న‌డిపై విద్యుత్ అవ‌స‌రాల్లో 40 శాతాన్ని తిరిగి ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.


ప్రధాన మార్గాలు

రెడ్ లైన్: మియాపూర్ - ఎల్‌బీ నగర్ (సుమారు 29.2 కి.మీ., 27 స్టేషన్లు)
బ్లూ లైన్: నాగోలు - రాయదుర్గం (సుమారు 29 కి.మీ., 23 స్టేషన్లు)
గ్రీన్ లైన్: జేబీఎస్ - ఎంజీబీఎస్ (సుమారు 11 కి.మీ., 9 స్టేషన్లు)
ఇంటర్‌చేంజ్ స్టేషన్లు: అమీర్‌పేట (రెడ్/బ్లూ), పరేడ్ గ్రౌండ్ (బ్లూ/గ్రీన్), ఎంజీబీఎస్ (రెడ్/గ్రీన్)

Advertisement
Advertisement