లోడ్ అవుతోంది...


Bhartha Mahasayulaku Wignyapthi Review | హిట్టు కోసం రవితేజ తన పంథా మార్చేశారు. మాస్ మహారాజా అనే ట్యాగ్‌ను పక్కనపెట్టి ఆయన చేసిన తాజా మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. క్లాస్ సినిమాల డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీ మంగళవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజకు హిట్టు బాట పట్టాడా? సంక్రాంతి హీరో అనిపించుకున్నారా అంటే?
రామసత్యనారాయణ అలియాస్ రామ్‌కు (రవితేజ) వైన్ ఫ్యాక్టరీ ఉంటుంది. తన భార్య బాలామణితో (డింపుల్ హయతి)కలిసి బిజినెస్‌ను రన్ చేస్తుంటాడు. అనార్కలి పేరుతో సొంతంగా బ్రాండ్ తయారు చేస్తాడు. స్పెయిన్‌కు చెందిన ఓ పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకొని తన బ్రాండ్‌ను డెవలప్ చేయాలనుకుంటాడు రామ్. ఆ డీల్ రిజెక్ట్ కావడంతో తన పీఏ లీలాతో (వెన్నెల కిషోర్) కలిసి స్వయంగా స్పెయిన్ వస్తాడు రామ్. స్పెయిన్‌లోని కంపెనీ ఎండీ మానసశెట్టిని (ఆషికా రంగనాథ్) కలిసి డీల్ ఓకే చేసుకుంటాడు. తనకు పెళ్లయిందనే నిజాన్ని దాచిపెట్టి ఫిజికల్‌గా మానస శెట్టికి దగ్గరవుతాడు. భర్త రామ్‌ను మగాళ్లకు రోల్ మోడల్‌గా భావిస్తుంటుంది అతడి భార్య బాలామణి. కన్నెత్తి కూడా పరాయి ఆడవాళ్లను చూడడని గొప్పగా చెబుతుంటుంది. తన భర్తను ఎవరైనా అనుమానించిన ఊరుకోదు. మానస శెట్టి పరిచయం తర్వాత రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. మానన గురించి బాలమణికి తెలియకుండా రామ్ ఏం చేశాడు? రామ్‌ను వెతుక్కుంటూ మానస ఎందుకు హైదరాబాద్ వచ్చింది? ఈ ఇద్దరి మధ్య అతడు ఎలా నగిలిపోయాడు? రామ్‌కు సాయం చేయడానికి సుదర్శన్ లీలా ఎలాంటి కష్టాలు పడ్డారు అన్నదే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కథ.
భార్యకు ప్రియురాలికి మధ్య హీరో నలిగిపోవడం, ఒకరి గురించి మరొకరికి తెలియకుండా అతడే పడే తిప్పలు, ఈ క్రమంలో ఎదురయ్యే కన్ఫ్యూజన్ కామెడీతో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ కథలతో సినిమాలు చేశారు. అప్పట్లో హీరోలకు హిట్టు ఇచ్చిన ఈ సక్సెస్‌ఫుల్ కాన్సెప్ట్‌తోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను రూపొందించారు డైరెక్టర్ కిషోర్ తిరుమల.
కథ పాతదే కానీ నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ట్రీట్‌మెంట్ విషయంలో కొత్తగా ఆలోచించారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్ స్టఫ్‌ను వాడుకొని ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌చేయాలని చూశారు. జనరేటర్‌లో షుగర్ పోయడం, అర్జున్ రెడ్డి డైలాగ్ స్ఫూఫ్‌లు వర్కవుట్ అయ్యాయి. ఈ కామెడీతో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఆడియెన్స్‌ను నవ్వించడానికే ప్రయత్నించారు కిషోర్ తిరుమల. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్‌లో హీరో ఎమోషనల్ అయిపోయి క్లాస్ ఇవ్వడం, హీరోయిన్లు తమ తప్పును తెలుసుకొని సారీ చెప్పడం లాంటివి కనిపిస్తాయి. అలాంటి సినిమాటిక్ రూల్‌ను పూర్తిగా పక్కనపెట్టి క్లైమాక్స్‌లో కూడా వినోదాన్నే నమ్ముకున్నారు డైరెక్టర్. సెంటిమెంట్ డోస్ ఎక్కడ లేకుండా సింపుల్‌గా తేల్చేశారు.
సినిమా ఆరంభమైన అరగంట వరకు రవితేజ కంటే సత్యనే ఎక్కువగా కనిపిస్తాడు. హీరోయిన్ పీఏగా అతడు చేసే హడావిడి ఫన్నీగా ఉంటుంది. ఆ తర్వాత రామ్, మానస రిలేషన్ మొదలవ్వడం, అనుకోకుండా మానస ఇండియా రావడం లాంటి సీన్లతో స్లోగా సినిమా సాగుతుంది. మానస, బాలామణికి మధ్య నలిగిపోతూ రామ్ ఆడే అబద్దాలు, తను సేఫ్ కావడానికి చుట్టూ ఉన్నవారందరిని వాడుకుంటూ వసే ఎత్తులతో సెకండాఫ్ సరదాగా సాగిపోతుంది. చివరకు రామ్ ఇంటికే మానస వచ్చే ట్విస్ట్ బాగుంది.
హ్యుమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ వ్యాలూస్‌తో గత సినిమాలు చేశారు కిషోర్ తిరుమల. ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. తనకు అలవాటు లేని జానర్ కావడంతో చాలా చోట్ల తడబడిపోయారు. కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక పాత సినిమాల పాటలు, టీవీ షోలో స్కిట్‌లను కథలో బలవంతంగా ఇరికించారు. మానస శెట్టి బ్రదర్, అజయ్ ఘోష్ తో పాటు సినిమాలో చాలానే క్యారెక్టర్లు కనిపిస్తాయి. వాటిలో చాలా పాత్రలకు సరైన ఇంపార్టెన్స్, ఆర్క్ ఉండదు. సునీల్, వెన్నెలకిషోర్, గెటప్ శీను లాంటి వారిని సరిగ్గా వాడుకోలేదు. ఇటీవల కాలంలో సత్య కామెడీతోనే హిట్టయిన సినిమాలు ఉన్నాయి. ఇందులో సత్య ఫన్నీ సీన్లు కూడా ఇరిటేట్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే లోపాలు చాలానే కనిపిస్తాయి.
మాస్ మహారాజా ట్యాగ్‌ను రవితేజ ఎందుకు పక్కనపెట్టారో సినిమా చూస్తే అర్థమవుతుంది. రవితేజ సినిమాల్లో ఉండే యాక్షన్, పంచ్ డైలాగ్స్, హీరోయిజం లాంటి ఎలిమెంట్స్ ఉండవు. రామ్ పాత్రలో చాలా జోవియల్‌గా కనిపించారు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. రవితేజ వన్ మెన్ షోగా సినిమా సాగుతుంది. ఆషికా గ్లామర్‌తో ఆకట్టుకుంది. డింపుల్ హయతి నటన పర్వాలేదనిపిస్తుంది. భీమ్స్ పాటల్లో వామ్మో వాయ్యో సాంగ్ బాగుంది. మిగిలినవి కూడా ఒకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి...టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో లేదు. కథ, కథనాల గురించి కాకుండా కామెడీ కోసం థియేటర్‌కు వెళితే టైమ్‌పాస్ చేస్తుంది. కొత్త రవితేజను మాత్రం సినిమాలో చూడొచ్చు. అంతుకుమించి ఏం లేదు.

జనవరి 8, 2026

డిసెంబర్ 22, 2025

డిసెంబర్ 21, 2025





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam