త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhubala Biopic | నిన్న కియారా అద్వానీ.. నేడు సారా అర్జున్‌..! మధుబాల పాత్రలో కనిపించేది ఎవరు..?

Madhubala Biopic | గత కొంతకాలంగా నిలిచిపోయిన మధుబాల బయోపిక్‌ ప్రాజెక్ట్‌ మళ్లీ పట్టాలెక్కింది. సారా అర్జున్‌ మధుబాల పాత్రలో నటించనుండగా, సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కనుంది. ఓటీటీ రిలీజ్‌గా ప్లాన్‌ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.

P

Entertainment | Published On Apr 24, 2026, 3.10 pm IST

Madhubala Biopic | నిన్న కియారా అద్వానీ.. నేడు సారా అర్జున్‌..! మధుబాల పాత్రలో కనిపించేది ఎవరు..?
Advertisement

Madhubala Biopic | బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ మధుబాల బయోపిక్‌. గత కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్‌ మళ్లీ తిరిగి వేగాన్ని అందుకుంది. ఈ చిత్రంలో మధుబాల పాత్రను సారా అర్జున్‌ పోషించనుంది. సంజయ్‌లీల భన్సాలీ నిర్మాణంలో జస్మీత్‌ కే రీన్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఈ ప్రాజెక్టు జూలైలో షూటింగ్‌ మొదలుకానుంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించింది. తొలుత బడ్జెట్‌ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోగా.. భన్సాలీ నిర్మాత బాధ్యతలు తీసుకోవడంతో తిరిగి పట్టాలెక్కింది.

మధుబాల జీవిత కథను అభిమానుల ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ‘ధురంధర్’ చిత్రంతో గుర్తింపు పొందిన సారా అర్జున్‌, ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సిద్ధమవుతోంది. మధుబాల గ్లామర్‌, భావోద్వేగాలు, స్క్రీన్ ప్రెజెన్స్‌ను తెరపైకి తీసుకురావడం ఈ పాత్రలో సవాల్‌గా భావిస్తున్నారు. ఈ సినిమాలో దిలీప్ కుమార్, కిశోర్ కుమార్ పాత్రల కోసం ఇంకా కాస్టింగ్ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో గతంలో కియారా అద్వానీతో పాటు మరికొందరి పేర్లు ప్రచారం జరిగింది. మధుబాల జీవితంలో ఉన్న సినీ విజయాలతో పాటు వ్యక్తిగత కష్టాలు, సంబంధాలు, 36 ఏళ్ల వయసులో జరిగిన ఆమె ఆకస్మిక మరణాన్ని చిత్రం ఆవిష్కరించనుంది.

ఇదే సమయంలో భన్సాలీ తెరకెక్కించనున్న మరో ప్రాజెక్ట్ ‘బైజు బావ్రా’ ప్రాజెక్ట్‌ సైతం అనిశ్చితిలోనే ఉంది. కాస్టింగ్‌, షెడ్యూల్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతోంది. గతంలో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు వినిపించాయి. అలియా భట్‌ కూడా భన్సాలీ తర్వాతి ప్రాజెక్టుల్లో కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల వచ్చిన ‘లవ్ అండ్ వార్’ ప్రాజెక్ట్‌ తర్వాత ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగింది. మధుబాల బయోపిక్‌ను నేరుగా ఓటీటీకి విడుదల చేయాలనే నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సారా అర్జున్‌ క్రేజ్ పెరుగుతున్న సమయంలో కూడా థియేట్రికల్ రిలీజ్‌ లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం ప్రభావం ఎలా చూపుతుందో విడుదల సమయానికి గానీ స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement