త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BYD Ti7 | చైనా బీవైడీకి భారీ షాక్‌.. యూరప్‌లో ఎస్‌యూవీ అమ్మ‌కాల‌పై నిషేధం!

BYD Ti7 | చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ బీవైడీ (BYD)కి యూరప్‌లో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థకు చెందిన ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్ ఎస్‌యూవీ బీవైడీ టీఐ7 (SUV BYD Ti7) అమ్మకాలపై నెదర్లాండ్స్‌ కోర్టు కీలక నిషేధాజ్ఞలు జారీ చేసింది.

P

Business | Published On Nov 24, 2026, 10.40 am IST

BYD Ti7 | చైనా బీవైడీకి భారీ షాక్‌.. యూరప్‌లో ఎస్‌యూవీ అమ్మ‌కాల‌పై నిషేధం!
Advertisement
  • ల్యాండ్‌ రోవర్‌ డిజైన్‌ను పోలి ఉందంటూ నెదర్లాండ్స్‌ కోర్టు కీలక ఆదేశాలు..
  • ఉల్లంఘిస్తే రోజుకు లక్ష యూరోల జరిమానా..

BYD Ti7 | చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ బీవైడీ (BYD)కి యూరప్‌లో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థకు చెందిన ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్ ఎస్‌యూవీ బీవైడీ టీఐ7 (SUV BYD Ti7) అమ్మకాలపై నెదర్లాండ్స్‌ కోర్టు కీలక నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ ఎస్‌యూవీ డిజైన్‌ ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ను పోలి ఉందని, తద్వారా జాగ్వ‌ర్ ల్యాండ్ రోవ‌ర్ (Jaguar Land Rover-JLR)కు చెందిన యూరోపియన్‌ డిజైన్‌ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ ఆదేశాలతో యూరోపియన్‌ యూనియన్‌ (EU) దేశాల్లో బీవైడీ టీఐ7 విక్రయాలు, దిగుమతులు, తయారీపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

డిజైన్‌తోనే వివాదం..

బీవైడీ టీఐ7, ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ వాహనాల రూపురేఖలు చాలా దగ్గరగా ఉన్నాయని ది హేగ్‌ జిల్లా కోర్టు పేర్కొంది. హెడ్‌లైట్లు, గ్రిల్‌, బంపర్‌, బానెట్‌, కిటికీలు, వీల్‌ ఆర్చ్‌ల విషయంలో బీవైడీ కొన్ని మార్పులు చేసినప్పటికీ.. రెండు వాహనాల మధ్య ఉన్న మొత్తం డిజైన్‌ పోలిక లేద‌ని చెప్పేందుకు అవి ఏమాత్రం స‌రిపోవ‌ని అభిప్రాయపడింది. ఈ వివాదంలో జేఎల్ఆర్ కీలకమైన అంశాన్ని కోర్టు ముందు ఉంచింది. 2018లోనే తాము యూరోపియన్‌ డిజైన్‌ హక్కులను నమోదు చేసుకున్నామని వెల్లడించింది. ప్రస్తుత తరం ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ను 2019లో బహిరంగంగా ఆవిష్కరించడానికి ముందే ఈ డిజైన్‌ రిజిస్ట్రేషన్‌ జరిగింది. అంటే బీవైడీపై జేఎల్ఆర్ చేస్తున్న అభియోగాలు 2019లో విడుదలైన డిఫెండర్‌ కాపీకి సంబంధించినది మాత్రమే కాదు. అంతకంటే ముందే రిజిస్టర్‌ చేసిన తమ డిజైన్‌ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినదన్నమాట.

రోజుకు లక్ష యూరోల జరిమానా

కోర్టు ఆదేశాల ప్రకారం.. బీవైడీ ఇకపై యూరోపియన్‌ యూనియన్‌లోని ఏ దేశంలోనూ టీఐ7ని దిగుమతి చేసుకోవడం, తయారు చేయడం, విక్రయించడం లేదా అమ్మకానికి అందుబాటులో ఉంచడం సాధ్యం కాదు. అంతేకాకుండా వాణిజ్య అవసరాల కోసం ఈ ఎస్‌యూవీని నిల్వ చేయడం, డెలివరీ చేయడం, ఇతరత్రా వినియోగించడంపైనా ఆంక్షలు ఉంటాయి. కోర్టు నిర్ణయం ప్రకటించిన వారం రోజుల తర్వాత ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈలోగా బీవైడీ యూరోపియన్‌ అనుబంధ సంస్థలు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బీవైడీకి భారీ జరిమానాలు తప్పవు. ఉల్లంఘన జరిగిన ప్రతి రోజు, రోజులో కొంత భాగానికి ల‌క్ష యూరోల జరిమానా విధించే అవకాశం ఉంది. దీనికి అదనంగా ప్రతి ఉల్లంఘనకు 25వేల‌ యూరోల చొప్పున జేఎల్ఆర్‌కు జరిమానా చెల్లించేలా ఆదేశించే వెసులుబాటును కూడా కోర్టు కల్పించింది. ఈ అదనపు జరిమానాలపై మొత్తం 10 మిలియన్‌ యూరోల పరిమితి విధించింది.

డిఫెండర్‌ను పోలిన Ti7 డిజైన్‌

బీవైడీ గత ఏడాది చైనా మార్కెట్లో టీఐ7 ప్లగ్ ఇన్‌ హైబ్రిడ్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఐదు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉన్న ఈ వాహనాన్ని అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకెళ్లేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. బాక్సీ ఆకారపు బాడీ, నిటారుగా ఉండే విండోస్‌, ఫ్లాట్‌ రూఫ్‌లైన్‌, వెనుక భాగంలో అమర్చిన స్పేర్‌ వీల్‌ వంటి అంశాలు ఈ ఎస్‌యూవీకి ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్ పోలిక‌ను తీసుకువ‌చ్చాయి. ముఖ్యంగా గుండ్రని అంచులు, ప్రముఖంగా కనిపించే షోల్డర్‌ లైన్స్‌, ప్రత్యేకమైన సీ-పిల్లర్‌ ప్యానెల్‌, గుండ్రని వీల్‌ ఆర్చ్‌లు, నిరంతరంగా విస్తరించినట్లుగా కనిపించే గ్లాస్‌ ఏరియా రెండు వాహనాల మధ్య డిజైన్‌ పోలికను పెంచుతున్నాయని కోర్టు గుర్తించింది.

శాశ్వత నిషేధం కాదు.. ఆరు నెలల గడువు

అయితే బీవైడీ టీఐ7పై విధించిన నిషేధం తాత్కాలికం మాత్ర‌మే. ప్రధాన న్యాయ ప్రక్రియను ప్రారంభించేందుకు జేఎల్ఆర్‌కు ఆరు నెల‌ల గ‌డువు ఉంటుంది. ఈ వ్యవధిలో తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం విధించిన నిషేధం ముగిసే అవకాశం ఉంది. మరోవైపు జేఎల్ఆర్ కోరిన అన్ని ఉపశమనాలను కోర్టు మంజూరు చేయలేదు. బీవైడీ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను తమకు అందించాలని, ఎస్‌యూవీల డెలివ‌రీల‌కు సంబంధించిన ఇవ్వాలని, కోర్టు నిర్ణయాన్ని బీవైడీ తన వెబ్‌సైట్‌లో బహిరంగంగా ప్రకటించాలని జేఎల్ఆర్ కోర‌గా.. కోర్టు అంగీకరించలేదు.

యూకేలో జనవరి డెలివరీలకు గ్రీన్‌సిగ్నల్‌..

యూరోపియన్‌ యూనియన్‌లో టీఐ7 విక్రయాలకు నిషేధం ఎదురైనప్పటికీ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK)లో మాత్రం ప్రస్తుతానికి ఈ ఆదేశాల ప్రభావం ఉండదు. అక్కడ ఎస్‌యూవీని విడుదల చేసి, జనవరిలో వినియోగదారులకు డెలివరీలు ప్రారంభించాలన్న కంపెనీ యోచిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణపై దృష్టి పెట్టిన బీవైడీకి ఈ డిజైన్‌ వివాదం కీలక సవాల్‌గా మారింది. ప్ర‌స్తుతం కోర్టు తీర్పు ప్రాథ‌మికంగానే అయినా.. త‌ర్వాతి ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement