త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2027 | పంజాబ్‌ కింగ్స్‌లో కీలక మార్పు.. బౌలింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ కోచ్‌!

IPL 2027 | ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు బౌలింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రేను నియమించింది. గత నెలలో ఆ పదవికి రాజీనామా చేసిన జేమ్స్‌ హోప్స్‌ స్థానంలో తీసుకున్న‌ది.

P

Sports | Published On Nov 24, 2026, 10.10 am IST

IPL 2027 | పంజాబ్‌ కింగ్స్‌లో కీలక మార్పు.. బౌలింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ కోచ్‌!
Advertisement

IPL 2027 | ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు బౌలింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రేను నియమించింది. గత నెలలో ఆ పదవికి రాజీనామా చేసిన జేమ్స్‌ హోప్స్‌ స్థానంలో తీసుకున్న‌ది. మరోవైపు ఫీల్డింగ్‌ కోచ్‌నూ మార్పు చేసింది. మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ బ్రాడ్‌ హాడిన్‌ స్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచింగ్‌ బృందంలో పనిచేసిన రాజీవ్‌ కుమార్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. పరాస్‌ మాంబ్రేకు కోచింగ్‌ రంగంలో విశేష అనుభవం ఉంది. 2021 నుంచి 2024 వరకు రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని టీమిండియా కోచింగ్‌ బృందంలో బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. భారత జట్టు అండర్‌-19, ఇండియా-ఏ జట్లకూ ఇదే బాధ్యతలు నిర్వర్తించాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌, మహారాష్ట్ర, బరోడా, విదర్భ జట్లకు కోచింగ్‌ అందించాడు.

ముంబ‌యి ఇండియ‌న్స్‌తో అనుబంధం

ఐపీఎల్‌లోనూ మాంబ్రేకు మంచి అనుభవం ఉంది. లీగ్‌ ప్రారంభమైన 2008లోనే ముంబ‌యి ఇండియన్స్‌ సహాయక సిబ్బందిలో సభ్యుడిగా చేరాడు. 2010లో ఆ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2017లో ముంబ‌యి జట్టును వీడిన అతడు.. తిరిగి 2024 నుంచి 2026 వరకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. భారత జట్టు 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో, 2024 టీ20 ప్రపంచకప్‌ విజయంలో బౌలింగ్‌ కోచ్‌గా మాంబ్రే కీలక పాత్ర పోషించాడు. అతడి అనుభవం పంజాబ్‌ బౌలింగ్‌ విభాగానికి బలాన్నిస్తుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి మాంబ్రే జట్టు బౌలింగ్‌ వ్యూహాలను సిద్ధం చేయనున్నాడు.

తొలి టైటిల్‌ వేటలో పంజాబ్‌

ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ నుంచి లీగ్‌లో కొనసాగుతున్న పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించ‌లేక‌పోయింది. 2014, 2025 సీజన్లలో మాత్రమే ఫైనల్‌కు చేరింది. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో, రికీ పాంటింగ్‌ కోచింగ్‌లో ఐపీఎల్‌ 2025 ఫైనల్‌కు చేరడంతో జట్టుపై అంచనాలు పెరిగాయి. అయితే 2026 సీజన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ అద్భుతంగా ప్రారంభించినప్పటికీ.. సగం సీజన్‌ తర్వాత ప్రదర్శనలో గ‌ణ‌నీయంగా మార్పులు క‌నిపించాయి. దీంతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 2027 సీజన్‌కు ముందే కోచింగ్‌ విభాగంలో కీలక మార్పులు చేస్తోంది. మాంబ్రే రాకతో బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టమవుతుందని పంజాబ్‌ అభిమానులు ఆశిస్తున్నారు.

డిసెంబర్‌ 16న ఐపీఎల్‌ 2027 మినీ వేలం

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్‌ 16న గోవాలో జరగనుంది. వేలానికి ముందే కోచింగ్‌ బృందాన్ని బలోపేతం చేసుకుంటున్న పంజాబ్‌ కింగ్స్‌.. ఆటగాళ్ల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించనుంది. మరి కొత్త కోచింగ్‌ బృందం పర్యవేక్షణలోనైనా పంజాబ్‌ కింగ్స్‌ తన తొలి ఐపీఎల్‌ టైటిల్‌ కలను నెరవేర్చుకుంటుందేమో చూడాలి.

Advertisement
Advertisement