త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Health | రోజుకు 20 నిమిషాల వ్యాయామం.. మెదడుకు సూపర్‌ బూస్ట్‌! జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు మేలు!

Health | వ్యాయామం అంటే చాలామందికి గుర్తొచ్చేది బరువు తగ్గడం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, కండరాలను దృఢంగా మార్చుకోవడం. కానీ శారీరక శ్రమ వల్ల శరీరానికే కాదు.. మెదడుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. రోజుకు కేవలం 20 నిమిషాల వ్యాయామం చేసినా మెదడులో జ్ఞాపకశక్తి, అభ్యసన సామర్థ్యానికి సంబంధించిన కీలక ప్రక్రియలు చురుగ్గామారుతాయ‌ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అయోవా పరిశోధకులు గుర్తించారు.

P

Lifestyle | Published On Nov 24, 2026, 12.10 pm IST

Health | రోజుకు 20 నిమిషాల వ్యాయామం.. మెదడుకు సూపర్‌ బూస్ట్‌! జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు మేలు!
Advertisement

Health | వ్యాయామం అంటే చాలామందికి గుర్తొచ్చేది బరువు తగ్గడం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, కండరాలను దృఢంగా మార్చుకోవడం. కానీ శారీరక శ్రమ వల్ల శరీరానికే కాదు.. మెదడుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. రోజుకు కేవలం 20 నిమిషాల వ్యాయామం చేసినా మెదడులో జ్ఞాపకశక్తి, అభ్యసన సామర్థ్యానికి సంబంధించిన కీలక ప్రక్రియలు చురుగ్గామారుతాయ‌ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అయోవా పరిశోధకులు గుర్తించారు.

మెదడులో ఏం జరుగుతుంది?

వ్యాయామం చేసిన వెంటనే మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారితో నిర్ణీత వేగంతో 20 నిమిషాల పాటు సైక్లింగ్‌ చేయించారు. వ్యాయామానికి ముందు, తర్వాత వారి మెదడు విద్యుత్‌ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారికి మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) చికిత్సలో భాగంగా ఇప్పటికే మెదడులో ఎలక్ట్రోడ్లు అమర్చారు. దీంతో వ్యాయామం తర్వాత మెదడులో చోటుచేసుకునే మార్పులను అత్యంత దగ్గరగా పరిశీలించే అవకాశం పరిశోధకులకు లభించింది.

మెదడులో పెరిగిన 'రిపుల్స్‌'

వ్యాయామం అనంతరం మెదడులో ప్రత్యేకమైన హై-ఫ్రీక్వెన్సీ విద్యుత్‌ తరంగాలు ఒక్కసారిగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిని 'రిపుల్స్‌'గా పిలుస్తారు. ఇవి అతి తక్కువ వ్యవధిలో చోటుచేసుకునే విద్యుత్‌ కార్యకలాపాలు. మెదడులో జ్ఞాపకశక్తికి కీలకమైన హిప్పోక్యాంపస్‌లో ప్రారంభమయ్యే ఈ రిపుల్స్‌.. కొత్త విషయాలను నేర్చుకోవడం, సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించే ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి. తద్వారా జ్ఞాపకాలను మెదడులో నిల్వ చేసుకునే ప్రక్రియకు ఇవి తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఏకాగ్రత పెరుగుతుంది..

వ్యాయామం తర్వాత మెదడులో రిపుల్స్‌ పెరగడం కీలక పరిణామంగా పరిశోధకులు భావిస్తున్నారు. సైక్లింగ్‌, పరుగు, వేగంగా నడవడం వంటి శారీరక కార్యకలాపాల తర్వాత చాలామందికి మానసిక ఉల్లాసం, చురుకుదనం పెరిగినట్లు అనిపించడానికి ఇదొక కారణం కావొచ్చ‌ని పేర్కొంటున్నారు. వ్యాయామం వల్ల మెదడు కొత్త సమాచారాన్ని స్వీకరించేందుకు మరింత సంసిద్ధంగా మారుతుందని తాజా పరిశోధన సూచిస్తోంది. గతంలో జరిగిన అధ్యయనాలు కూడా ఒక్కసారి వ్యాయామం చేయడం వల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వరుసగా పనులను నిర్వహించే నైపుణ్యం మెరుగుపడవచ్చని వెల్లడించాయి.

అందరికీ ఇదే ఫలితాలు వర్తిస్తాయా?

ఈ పరిశోధనలో పాల్గొన్నవారు ఎపిలెప్సీ బాధితులు కావడంతో.. అధ్యయన ఫలితాలను అందరికీ నేరుగా వర్తింపజేయడం తొందరపాటే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరిలో గుర్తించిన మెదడు కార్యకలాపాల నమూనాలు ఆరోగ్యవంతులపై గతంలో నిర్వహించిన మెదడు ఇమేజింగ్‌ అధ్యయనాల్లోనూ కనిపించిన వాటితో సారూప్యత కలిగి ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోజంతా కూర్చుని గడిపే అలవాటు ఉన్నవారు వ్యాయామం చేయ‌డం ప్రారంభిస్తే మెరుగైన మార్పులు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

దీర్ఘకాలిక ఆరోగ్యానికీ వ్యాయామమే కీలకం

వ్యాయామం వల్ల తక్షణ ప్రయోజనాలే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని గత పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో నేచ‌ర్ క‌మ్యూనికేష‌న్ (Nature Communications) జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనల సమీక్ష ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అన్ని కారణాలతో సంభవించే మరణాల ముప్పుతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్‌ కారణంగా మరణించే ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉంది. వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడం, జ్ఞాపకశక్తికి తోడ్పడటం, ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజువారీ జీవితంలో కనీసం కొంత సమయమైనా వ్యాయామానికి స‌మ‌యం కేటాయించ‌డం మంచిది.

Advertisement
Advertisement