త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్ర‌త‌.. భారీ న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌డంతో ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. దీంతో అంత‌ర్జాతీయ‌, దేశీయ సూచీలు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి. బుధ‌వారం సెష‌న్‌లో భార‌త ప్ర‌ధాన బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి సుమారుగా 1 శాతం మేర ప‌త‌న‌మ‌య్యాయి.

S

Business | Published On Sep 9, 2026, 4.06 pm IST

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్ర‌త‌.. భారీ న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌డంతో ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. దీంతో అంత‌ర్జాతీయ‌, దేశీయ సూచీలు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి. బుధ‌వారం సెష‌న్‌లో భార‌త ప్ర‌ధాన బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి సుమారుగా 1 శాతం మేర ప‌త‌న‌మ‌య్యాయి. సెష‌న్ మొత్తం తీవ్ర అస్థిర‌త‌తో క‌దిలిన సూచీలు మ‌ధ్యాహ్నం అనంత‌రం భారీగా క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 813.35 పాయింట్లు (1.08 శాతం) ప‌త‌న‌మై 74,764.23 వ‌ద్ద ముగియ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 203.60 పాయింట్లు (0.86 శాతం) ప‌త‌న‌మై 23,431.50 వ‌ద్ద నిలిచింది. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం మార్కెట్ల ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఈ ఒక్క సెష‌న్‌లోనే చ‌మురు ధ‌ర‌లు ఏకంగా 1 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.04 శాతం ఎగ‌సి బ్యారెల్‌కు 98 డాల‌ర్ల‌కు స‌మీపించ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.90 శాతం పెరిగి బ్యారెల్‌కు 95 డాల‌ర్ల‌కు చేరువ‌లో ఉంది.

100 డాల‌ర్ల దిశ‌గా చ‌మురు ధ‌ర‌లు..

ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధ మ‌రింత తీవ్ర‌త‌రం కావ‌డం ముడి చ‌ముర ధ‌ర‌ల‌పై ప్ర‌భావం పెంచింది. దీంతో చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ బ్యారెల్‌కు 100 డాల‌ర్ల దిశ‌గా ప‌రుగులు పెడుతున్నాయి. చ‌మురు స‌ర‌ఫ‌రాకు కీల‌క‌మార్గంగా ఉన్న హోర్ముజ్ జ‌ల‌సంధిలో ఇరాన్ నౌక‌ల‌పై అమెరికా దాడులు చేస్తుండ‌డం, ప్ర‌తిగా అరబ్ దేశాల్లోని అమెరికా స్థావ‌రాల‌పై ఇరాన్ దాడుల‌కు పాల్ప‌డుతుండ‌డం ఉద్రిక్త‌త‌ల‌ను మ‌రింత పెంచింది. దీంతో చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంద‌నే ఆందోళ‌న‌లు మ‌రింత పెరిగాయి. భారత్ ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద చ‌మురు దిగుమ‌తి దేశంగా ఉన్న నేప‌థ్యంలో ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగితే ద్ర‌వ్యోల్బణం, ఆర్థిక స్థితిపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు ఉన్నందున పెట్టుబ‌డిదారులపై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. వారు రిస్క్ తీసుకోవ‌డానికి అస‌లు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని సూచీల‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే ప్ర‌ధాన బెంచ్ మార్క్ సూచీలు కీల‌క మ‌ద్ద‌తు స్థాయిల‌కు స‌మీపంలో ఉండ‌డంతో మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త నెల‌కొంద‌ని, పెట్టుబ‌డిదారులు ఈ స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

బ్యాంకింగ్ షేర్ల‌లో భారీ న‌ష్టం..

ఇక విస్తృత స్థాయి మార్కెట్లు సైతం న‌ష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 100 సూచీ 0.72 శాతం మేర ప‌త‌న‌మ‌వ్వ‌గా, నిఫ్టీ200 సూచీ 0.58 శాతం త‌గ్గింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.46 శాతం, నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 సూచీ 0.64 శాతం త‌గ్గాయి. నిఫ్టీ50 సూచీలో అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ షేర్ ధ‌ర ఏకంగా 5.13 శాతం మేర పెరిగి టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా మ్యాక్స్ హెల్త్‌, అదానీ పోర్ట్స్‌, కోల్ ఇండియా, టాటా స్టీల్ నిలిచాయి. ఇక అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన షేర్ల‌లో ఇన్పోసిస్ మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ షేర్ ధ‌ర 4.34 శాతం మేర ప‌త‌న‌మైంది. త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌, టెక్ మ‌హీంద్రా, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిలిచాయి. ఇక అత్య‌ధింగా న‌ష్టపోయిన రంగాల్లో నిఫ్టీ బ్యాంక్ నిలిచింది. ఈ సూచీ 0.85 శాతం మేర క్షీణించింది.

Advertisement
Advertisement