త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Brahmotsavam | భక్తులను కటాక్షించిన శ్రీకృష్ణుడు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి..

Navaratri Brahmotsavam | తిరుమల కొండపై భక్తిభావం వెల్లివిరిసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమివ్వగా.. మరో తిరుచ్చిపై కొలువుదీరిన శ్రీకృష్ణస్వామివారు భక్తులను కటాక్షించారు.

P

Devotional | Published On Oct 16, 2026, 3.41 pm IST

Navaratri Brahmotsavam | భక్తులను కటాక్షించిన శ్రీకృష్ణుడు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి..
Advertisement

Navaratri Brahmotsavam | తిరుమల కొండపై భక్తిభావం వెల్లివిరిసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమివ్వగా.. మరో తిరుచ్చిపై కొలువుదీరిన శ్రీకృష్ణస్వామివారు భక్తులను కటాక్షించారు. గజరాజుల గంభీర నడకలు, మంగళవాయిద్యాల మధురధ్వనులు, భక్తబృందాల భజనలు, కోలాటాల నడుమ స్వామివార్ల పల్లకీసేవ వైభవంగా సాగింది. జీయ్యంగార్ల ఘోషలతో తిరుమల పురవీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివార్లను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. మోహినీ అవతారంలో మలయప్పస్వామి జగన్మోహన రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మోహినీ అవతారం మాయామోహాలకు అతీతంగా భగవంతుని తత్త్వాన్ని గ్రహించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. సమస్త జగత్తు భగవంతుని లీలావిలాసమని, ఆయన అనుగ్రహంతోనే మాయాబంధాలను అధిగమించి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలమనే తత్త్వాన్ని చాటిచెబుతుంది.

మరోవైపు, బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడసేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం పరిశీలించగా, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మధ్యాహ్నం ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి భక్తుడూ సౌకర్యవంతంగా శ్రీవారిని దర్శించుకోవడంతోపాటు వాహనసేవను వీక్షించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయడంతోపాటు తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాలరీల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈవో, అదనపు ఈవో గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదనపు ఈవో వాహన మండపం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గరుడసేవకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్ల నిర్వహణలో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమాల్లో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జానకీ దేవి, రంగశ్రీ, ఆనంద సాయి, దర్శన్, నరేష్ కుమార్, ఎన్ సదాశివరావు, జేఈవోలు శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement