త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam | తిరుమ‌ల‌లో వైభ‌వంగా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాలు.. సింహ‌వాహ‌నంపై మ‌ల‌య‌ప్ప విహారం

Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం సింహ వాహనసేవ వైభవంగా జరిగింది. యోగ నరసింహుని అలంకారంలో మలయప్పస్వామివారు సింహ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.

P

Devotional | Published On Sep 17, 2026, 3.53 pm IST

Brahmotsavam | తిరుమ‌ల‌లో వైభ‌వంగా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాలు.. సింహ‌వాహ‌నంపై మ‌ల‌య‌ప్ప విహారం
Advertisement

Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం సింహ వాహనసేవ వైభవంగా జరిగింది. యోగ నరసింహుని అలంకారంలో మలయప్పస్వామివారు సింహ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. సింహ వాహనసేవ సందర్భంగా గజరాజులు ముందుగా నడవగా.. భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు సాగింది. దీంతో తిరుమల మాడ వీధులు భక్తిభావంతో మార్మోగాయి.

ధైర్యానికి ప్రతీకగా సింహ వాహనం

దుష్టశిక్షణ, శిష్టరక్షణను సూచించేలా మలయప్పస్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు. సింహం పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యం, మహాశక్తికి ప్రతీకగా భావిస్తారు. సింహరూపంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. సోమరితనాన్ని వీడి.. కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగాలనే స్ఫూర్తిని సింహ వాహనసేవ అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామివారి రూపం భక్తులకు అభయంతో పాటు ఆధ్యాత్మిక శక్తి, ధైర్యాన్ని ప్రసాదించే అనుభూతిని కలిగించింది. కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల పెద్ద జీయ‌ర్ స్వామి, చిన్న జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వాహ‌న‌సేవ‌లో అల‌రించిన క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు..

సింహ‌వాహ‌న‌సేవ‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శించి భక్తులను విశేషంగా అలరించారు. స్వామివారి వాహనసేవకు కళాకారుల ప్రదర్శనలు భక్తిభావాన్ని, సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు పాల్గొన్నాయి. మొత్తం 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు దశావతారాలు, భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు.

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గౌరసూర్ బోద్/చౌ, జానపద నృత్యాలు, డ్రమ్స్, కోలాటం తదితర సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చౌలియా, మేవశిరాస్, జానపద నృత్యం, గోందల్ నృత్యం వంటి వైవిధ్యభరిత సంప్రదాయ కళారూపాలు కనువిందు చేశాయి. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళములతో జానపద నృత్యం, డ్రమ్స్, నవదుర్గలు, శ్రీరామ చరితం, కోలాటం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు. శ్రీవారి సింహ వాహనసేవలో 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళారూపాలు తిరుమలలో భక్తి, కళ, భారతీయ సంస్కృతుల సమ్మేళనాన్ని ఆవిష్కరించాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయ, జానపద కళారూపాలకు వేదిక కల్పిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు భారతీయ కళా వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్నాయి.

Advertisement
Advertisement