త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Somnath Temple | ‘సోమనాథ్’ స్వాభిమాన పర్వం: వెయ్యేళ్ల అచంచల విశ్వాసం – ఆలయ పునర్నిర్మాణ ఘన చరిత్ర

సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదు.. భారత నాగరికత శక్తిని నిదర్శనం. ఈ ఆలయంపై దాడి చేసిన వారు చరిత్ర పుటల్లో కలిసిపోయారు. కానీ సోమనాథ్ మాత్రం నేటికీ అజేయంగా నిలిచి ఉంది.

J

Devotional | Published On Jan 5, 2026, 4.40 pm IST

Somnath Temple | ‘సోమనాథ్’ స్వాభిమాన పర్వం: వెయ్యేళ్ల అచంచల విశ్వాసం – ఆలయ పునర్నిర్మాణ ఘన చరిత్ర

సంక్షిప్త సారాంశం

సోమనాథ్ పేరు వినగానే మన మనసు పులకరించిపోతుంది. మదిలో సగర్వం మొదలవుతుంది. సోమనాథ్ శివలింగాన్ని దర్శించుకుంటే మనిషి పాప విముక్తుడై మరణానంతరం స్వర్గ ప్రాప్తి పొందుతాడని నమ్ముతారు. అందుకే నిత్యం లక్షలాది భక్తజనంతో సోమనాథుడు నీరాజనాలు అందుకుంటాడు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ క్షేత్రం వెయ్యేళ్ల కిందట విధ్వంసానికి గురైంది. విదేశీ దురాక్రమణదారుల దాడికి గురైంది. అప్పటి పాలకులు చేసిన కృషి వల్ల వెయ్యేళ్ల తర్వాత కూడా తొలి జ్యోతిర్లింగ నెలవుగా ఉన్న సోమనాథ్ భక్తులతో విరాజిల్లుతోంది.

Advertisement

  • సోమనాథ్ పునఃప్రారంభం
  • నెహ్రూ అభ్యంతరం
  • పటేల్, రాజేంద్ర ప్రసాద్ దృఢ సంకల్పం

Somnath Temple | భారతీయ సంస్కృతికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచే సోమనాథ్ ఆలయ చరిత్రలో 2026 వ సంవత్సరం అత్యంత కీలకమైనది. సరిగ్గా వెయ్యి ఏళ్ల క్రితం అంటే 1026 జనవరిలో మహమ్మద్ ఘజ్నీ ఈ పుణ్యక్షేత్రంపై దాడి చేశాడు. మన విశ్వాసాన్ని, నాగరికతను నాశనం చేయాలనే లక్ష్యంతో జరిగిన ఆ దాడి ఒక చీకటి అధ్యాయం.

కానీ, వెయ్యేళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయం నేడు అంతే వైభవంతో వెలుగొందుతోంది. ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించడానికి జరిగిన అనేక పోరాటాలు, ప్రయత్నాలే దీనికి కారణం. ఈ పునరుద్ధరణ చరిత్రలో మరో మైలురాయి కూడా 2026 నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 1951, మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మించబడింది.

Somnath temple attack by ghazni completes 1000 years

విధ్వంసంపై గెలిచిన విశ్వాసం

1026లో జరిగిన మధ్యయుగపు అనాగరిక దాడి మరికొందరిని కూడా ప్రేరేపించింది. మన ప్రజలను, సంస్కృతిని బానిసలుగా మార్చాలనే కుట్రలో భాగంగా సోమనాథ్‌పై పదేపదే దాడులు జరిగాయి. కానీ ప్రతిసారీ ఆలయాన్ని రక్షించడానికి, పునర్నిర్మించడానికి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. అహిల్యాబాయి హోల్కర్ లాంటి వారు భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఎంతో కృషి చేశారు.

సోమనాథ్‌ని దర్శించిన స్వామి వివేకానంద

1890వ దశకంలో స్వామి వివేకానంద సోమనాథ్‌ను సందర్శించినప్పుడు ఆ అనుభూతి ఆయనను ఎంతగానో కదిలించింది. చెన్నైలో ఆయన ఓ ప్రసంగంలో ఈ ఆలయం గొప్పదనాన్ని వర్ణించారు. వందలాది దాడులను తట్టుకుని, శిథిలాల నుండి మళ్లీ ప్రాణం పోసుకుని నిలబడిన దక్షిణ భారతానికి చెందిన పలు పురాతన ఆలయాలు మన జాతి చరిత్రను, వివేకాన్ని చాటిచెబుతాయన్నారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం వివేకాన్ని నేర్పిస్తుందని, పుస్తకాల్లో చదివి తెలుసుకున్న దానికంటే కూడా ఈ ఆలయం చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుందని అని ఆయన కొనియాడారు.

Somnath temple attack by ghazni completes 1000 years

సరిహద్దులు దాటిన సంకల్పం

స్వతంత్ర భారతదేశంలో సోమనాథ్ పునర్నిర్మాణ బాధ్యతను సర్దార్ వల్లభభాయ్ పటేల్ తన భుజానికెత్తుకున్నారు. 1947 దీపావళి సమయంలో ఆయన సోమనాథ్‌ని సందర్శించి, ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని ప్రకటించారు. అయితే, 1951లో ఆలయం సిద్ధమైనప్పటికీ, ఆ చారిత్రక ఘట్టాన్ని చూడటానికి సర్దార్ మన మధ్య లేరు. 1951, మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదగా తిరిగి ప్రారంభించబడింది.

నెహ్రూ కాదన్నా...

ఆ సమయంలో ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ కార్యక్రమం పట్ల విముఖత చూపించారు. రాష్ట్రపతి, మంత్రులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం దేశ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన భావించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి కట్టుబడి, ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నిజానికి ఈ ఆలయం పూర్తి కావడానికి కృషి చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కి వెనుక ఉండి కేఎం మున్షీ చేసిన కృషి కూడా మరువలేనిది. ఆయన రాసిన 'సోమనాథ్: ది ష్రైన్ ఎటర్నల్' పుస్తకం ఈ ఆలయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

భారత నాగరికత శక్తికి నిదర్శనం

సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదు.. భారత నాగరికత శక్తిని నిదర్శనం. ఈ ఆలయంపై దాడి చేసిన వారు చరిత్ర పుటల్లో కలిసిపోయారు. కానీ సోమనాథ్ మాత్రం నేటికీ అజేయంగా నిలిచి ఉంది. మతోన్మాదం, ద్వేషం కొంతకాలమే విధ్వంసాన్ని సృష్టిస్తుంది కానీ మంచిపై ఉండే నమ్మకం, విశ్వాసం శాశ్వతమైన శక్తిని అందిస్తుందని సోమనాథ్ నిరూపించింది.

-ప్రధాని నరేంద్ర మోదీ

Advertisement

తాజావార్తలు

Advertisement