త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemulawada | వేముల‌వాడ‌లో ఘ‌నంగా సీతారాముల క‌ల్యాణోత్స‌వం..

Vemulawada | వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌స్వామి దేవ‌స్థానంలో సీతారాముల క‌ల్యాణోత్స‌వాలు నేత్ర వైభ‌వంగా సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం క‌ల్యాణ వేడుక‌ల‌ను క‌నుల పండువ‌గా నిర్వ‌హించారు. రాజ‌న్న ఆల‌య పార్కింగ్ స్థ‌లంలో ఏర్పాటు చేసిన వేదిక‌పై సీతారాముల క‌ల్యాణ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

P

Devotional | Published On Mar 27, 2026, 7.11 pm IST

Vemulawada | వేముల‌వాడ‌లో ఘ‌నంగా సీతారాముల క‌ల్యాణోత్స‌వం..
Advertisement

Vemulawada | వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌స్వామి దేవ‌స్థానంలో సీతారాముల క‌ల్యాణోత్స‌వాలు నేత్ర వైభ‌వంగా సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం క‌ల్యాణ వేడుక‌ల‌ను క‌నుల పండువ‌గా నిర్వ‌హించారు. రాజ‌న్న ఆల‌య పార్కింగ్ స్థ‌లంలో ఏర్పాటు చేసిన వేదిక‌పై సీతారాముల క‌ల్యాణ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆల‌యంలో మొద‌ట సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ విధానంలో అభిషేకం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిపారు. మూల‌వ‌ర్ల‌కు ఉదయం 9 గంటలకు సీతారామ చంద్ర స్వామి ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా యాగశాలలో పుణ్యాహవచనం, మూలమంత్ర హోమం, స్వామివారి పరివార దేవతల హోమాలు జ‌రిగాయి. అనంతరం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు.

ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో జరిగిన కళ్యాణోత్సవం అనంతరం యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కన్యాదాతలుగా మరింగంటి విజయసారథి–కర్ణ దంపతులు వ్య‌వ‌హ‌రించారు. పండితులు ఆచార్యులుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, వేద పండితులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వ‌హించారు.

రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగియ‌నున్నాయి. ఈసారి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా బియ్యపు గింజపై శ్రీరాముని నామం ముద్రించిన తలంబ్రాలను ఆలయ అధికారులు సిద్ధం చేయించారు. సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, విప్ భీమేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. వారికి క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్ తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ఓ వైపు సీతారాముల క‌ల్యాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌రో వైపు.. శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు శివుడిని పెళ్లాడారు. దేశంలో మ‌రెక్క‌డా లేనివిధంగా కేవ‌లం వేముల‌డా క్షేత్రంలోనే సీతారాముల క‌ల్యాణం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్, జోగినిలు, శివ‌స‌త్తులు మ‌హాదేవుడినే త‌మ నాధునిగా భావించి ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగ‌ళ‌సూత్రాల‌ను క‌ట్టుకుంటారు. త‌ర్వాత తలంబ్రాలు పోసుకుంటూ పెళ్లి చేసుకున్న‌ట్లుగా త‌న్మ‌య‌త్వం చెందారు. ఏళ్లుగా వేముల‌వాడ‌లో ఇది సంప్ర‌దాయంగా కొన‌సాగుతోంది.

ఈ జ‌రిగే ఈ క్ర‌తువు కోసం వేలాది మంది వేముల‌వాడ‌కు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ సారి సైతం క‌ల్యాణ వేడుక‌ల‌కు హాజ‌రై సీతారాముల‌కు త‌లంబ్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా స‌త్తుప‌ల్లికి చెందిన ప్రియ‌, విజ‌య‌వాడ‌కు చెందిన తేజ‌, క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఆరోహి మాట్లాడుతూ తాము చాలా సంవ‌త్స‌రాలుగా సీతారాముల క‌ల్యాణానికి వ‌చ్చి ప‌ట్టువ‌స్త్రాలు, తలంబ్రాలు స‌మ‌ర్పిస్తున్న‌ట్లు తెలిపారు. సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలోనే క‌ల్యాణం చేసుకుంటామ‌ని, శ్రీరాముడు వనవాసంలో అర్ధనారీశ్వర రూపంలో వరం ఇచ్చినట్లుగా.. తాము అదే ఆచారాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement